Afghanistan: ఏడాదిగా అరాచకమే

Taliban completes one year of power in Afghanistan - Sakshi

తాలిబన్ల గుప్పిట అఫ్గానిస్తాన్‌ ప్రజలు విలవిల 

అందని విదేశీ సాయం..కుంగదీస్తున్న కరువు, పేదరికం 

మహిళలపై కొనసాగుతున్న వివక్ష  

సరిగ్గా ఏడాది క్రితం.. అమెరికా రక్షణ ఛత్రం కింద ఉన్న అఫ్గానిస్తాన్‌ మళ్లీ తాలిబన్ల చెరలో చిక్కుకుంది. 20 ఏళ్ల యుద్ధాన్ని విరమించి, అమెరికాతోపాటు పశ్చిమ దేశాల సైన్యం వెనక్కి తరలిపోవడం ప్రారంభమైన కొద్ది రోజుల వ్యవధిలోనే దేశంలో తాలిబన్లు పాగా వేశారు. వారి అరాచక పాలనకు ఏడాది నిండింది. తాలిబన్లు అఫ్గాన్‌ ప్రజలకు నరకం చూపుతూనే ఉన్నారు.

విద్య, వైద్యం, కనీస వసతులు అందని ద్రాక్షగా మారాయి. మానవ హక్కుల జాడే లేదు. పేదరికం, కరువు ప్రధాన శత్రువులుగా మారిపోయి పీడిస్తున్నాయని అఫ్గాన్‌ పౌరులు ఆవేదన చెందుతున్నారు. ఎవరిని కదిలించినా కన్నీళ్లే ఉబికి వస్తున్నాయి. పిడివాద పాలనను పరిశీలిస్తే నిర్వేదమే మిగులుతుంది.  

ఆహార సంక్షోభం  
ప్రపంచంలో తాలిబన్‌ పాలకులు ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోయారు. అఫ్గాన్‌ ప్రభుత్వాన్ని చాలా దేశాలు అధికారికంగా గుర్తించడం లేదు. విదేశీ సాయం నిలిచిపోయింది. 2020–21లో అఫ్రాఫ్‌ ఘనీ ప్రభుత్వ హయాంలో 5.5 బలియన్‌ డాలర్ల వార్షిక బడ్జెట్‌ ప్రకటించారు. ఇందులో 75 శాతం నిధులు విదేశాల నుంచి సాయం రూపంలో అందినవే కావడం గమనార్హం. తాలిబన్ల రాకతో ఈ సాయమంతా హఠాత్తుగా ఆగిపోయింది. అఫ్గాన్‌కు చెందిన 7 బిలియన్‌ డాలర్ల నిధులను అమెరికా స్తంభింపజేసింది. ఆర్థిక ఇబ్బందులు కుంగదీస్తున్నాయి.

ఉద్యోగాలు లేవు, ఉపాధి మార్గాలు మూసుకుపోయాయి. అఫ్గాన్‌ పేదలు ఉపాధి కోసం పొరుగుదేశం ఇరాన్‌కు వలసవెళ్తున్నారు. అక్కడా పనులు దొరక్క ఉత్త చేతులతో తిరిగి వస్తున్నారు. లక్షలాది మంది జనం పేదరికంలోకి జారిపోతున్నారు. ఈ రోజు తినడానికి తిండి దొరికితే అదే గొప్ప అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఎక్కడ చూసినా ఆకలి కేకలే వినిపిస్తున్నాయి. అఫ్గాన్‌ జనాభా 4.07 కోట్లు కాగా, సగానికి పైగా ప్రజలు ఆహార కొరత ఎదుర్కొంటున్నారు. సమీప భవిష్యత్తులోనూ బతుకులు మారుతాయన్న సూచనలు కనిపించడం లేదు.

ఆంక్షలను అతిక్రమిస్తే కఠిన శిక్షలు: అఫ్గాన్‌లో మహిళలపై వివక్ష యథావిధిగా కొనసాగుతోంది. తాలిబన్లు పాలనా పగ్గాలు చేపట్టిన వెంటనే మహిళలను ప్రభుత్వ ఉద్యోగాల నుంచి తొలగించారు. మీరు ఇక ఇళ్లకే పరిమితం కావాలి, మీ కుటుంబాల్లోని పురుషులకు ఉద్యోగాలు ఇస్తాం అంటూ తేల్చిచెప్పేశారు. వారికి ఉన్నత విద్యను సైతం దూరం చేస్తున్నారు. బాలికలు పాఠశాలల్లో ఆరో గ్రేడ్‌కు మించి చదువుకోవడానికి వీల్లేదు. టీనేజీ బాలికలకు పాఠశాలల్లో ప్రవేశం లేదు. అంతోఇంతో స్తోమత కలిగిన కొందరు ఇళ్లల్లో విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు. మహిళలు ఇళ్ల నుంచి బయటకు వస్తే శరీరమంతా కప్పేసేలా దుస్తులు ధరించాలి. ఆంక్షలను అతిక్రమిస్తే శిక్షలుంటాయి.  

వ్యవసాయ కూలీలుగా విద్యావంతులు  
దేశంలో ఈ ఏడాది కరువు తీవ్రత పెరిగింది. పంటల సాగు విస్తీర్ణం పడిపోయింది. ప్రధాన పంట గోధుమల ఉత్పత్తి తగ్గింది. ఉన్నత చదువులు చదువుకున్న యువత కూడా ఉపాధి కోసం చేలల్లో పనిచేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. వారికి రోజువారీ కూలీ 2 డాలర్ల లోపే లభిస్తోంది. జనం ఆవేదన ఇలా ఉండగా, తాలిబన్ల వాదన మరోలా ఉంది. దేశంలో అవినీతిని అంతం చేశామని, దురాక్రమణదారులను తరిమికొట్టి ప్రజలకు భద్రత కల్పిస్తున్నామని చెబుతున్నారు.

షరియా చట్టం పరిధిలోనే మహిళలకు హక్కులు కల్పిస్తున్నామనిఅంటున్నారు. బొగ్గు, పండ్లను పాకిస్తాన్‌కు ఎగుమతి చేయడంతోపాటు కస్టమ్స్‌ రెవెన్యూ వసూళ్ల ద్వారా తాలిబన్లు ఆదాయం సంపాదిస్తున్నారు. 2021 డిసెంబర్‌ నుంచి 2022 జూన్‌ మధ్య 840 మిలియన్‌ డాలర్లు ఆర్జించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో అఫ్గానిస్తాన్‌ బడ్జెట్‌ 2.6 బిలియన్‌ డాలర్లుగా ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
  
 – నేషనల్‌ డెస్క్, సాక్షి    

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top