
డమాస్కస్: దీర్ఘకాల అంతర్యుద్ధం అనంతరం.. సిరియాలో పార్లమెంటరీ ఎన్నికలు జరగనున్నాయి. సెప్టెంబర్ 15 నుంచి 20 ఎన్నికలను నిర్వహించనున్నట్లు పీపుల్స్ అసెంబ్లీ ఎన్నికల ఉన్నత కమిటీ చైర్మన్ మొహమ్మద్ తహా అల్–అహ్మద్ తెలిపారు.
గతేడాది డిసెంబర్‌లో తిరుగుబాటుతో బషర్ అసద్ అధికార పతనం తరువాత.. దేశంలో మొదటిసారి ఎన్నికలు జరగుతున్నాయి. తాత్కాలిక అధ్యక్షుడు అహ్మద్ అల్–షరా మార్చిలో తాత్కాలిక రాజ్యాంగంపై సంతకం చేశారు. సాధారణ ఎన్నికలు జరిగి.. శాశ్వత రాజ్యాంగాన్ని ఆమోదించే వరకు తాత్కాలిక పార్లమెంటుగా పీపుల్స్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఆధ్వర్యంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
అలవైట్లపై హింస.. డ్రూజ్ మిలిటెంట్ల దాడులు
మార్చిలో అలవైట్ మైనారిటీకి చెందిన వందలాది మంది హత్యతో మతపరమైన హింస చెలరేగింది. సిరియా భద్రతా దళాలు అలవైట్ మైనార్టీ వర్గానికి చెందిన వందలాదిమంది పౌరులను చంపినట్టు ఆరోపణలు వచ్చాయి. అలవైట్లను లక్ష్యంగా చేసుకొని 30 సార్లు సాగించిన మారణకాండలో 745 మంది పౌరులు చనిపోయినట్లు బ్రిటన్ కేంద్రంగా పనిచేసే సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యుమన్ రైట్స్ (ఎస్‌ఓహెచ్‌ఆర్) తెలిపింది.
దీంతో సిరియాలో మైనారిటీల స్థితిగతులపై ఆందోళనలను రేకెత్తించాయి. మరో మైనారిటీ గ్రూప్ డ్రూజ్ మిలిటెంట్లు ప్రభుత్వంపై దాడికి దిగారు. గతంలో ఐఎస్‌ఎస్ ఉగ్రవాదిగా ఉన్న అహ్మద్ అల్ షరా.. అసద్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ఈ డ్రూజ్ మైనారిటీల మిలిటెంట్ల సాయం తీసుకున్నారు.
తీరా అల్ షరా తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడేటప్పుడు కేవలం ఒక్క డ్రూజ్ నేతకే ప్రభుత్వంలో స్థానం కల్పిస్తానని చెప్పడం, డ్రూజ్ ప్రాభల్య ప్రాంతాల అభివృద్ధిని పట్టించుకోకపోవడంతో చీలిక వచ్చింది. డ్రూజ్‌లో ఒక వర్గం ఇలా సాయుధ పంథాను ఉధృతం చేసింది. సువైదా ప్రావిన్స్‌లో జూలై 13న డ్రూజ్ వ్యాపారి అపహరణతో తాజా హింస ప్రారంభమైంది. డమాస్కస్, సువైదా, డెరాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు ప్రారంభించింది.
ప్రభుత్వ అనుబంధ దళాల నుండి డ్రూజ్‌ను రక్షించడానికి తమ దళాలు ప్రయత్నిస్తున్నాయని పేర్కొంది. సువైదాలో 1,100 మందికి పైగా మరణించినట్లు ఎస్‌ఓహెచ్‌ఆర్ తెలిపింది. డ్రూజ్, బెడోయిన్, ప్రభుత్వ దళాలు.. దారుణాలకు పాల్పడ్డాయి. అసద్ పతనం నుంచి దేశవ్యాప్తంగా సైనిక స్థావరాలు, ప్రభుత్వ దళాలపై దాడి చేస్తున్న ఇజ్రాయెల్.. సిరియాలోని కుర్దులు, డ్రూజ్, అలవైట్లతో సహా మైనారిటీల రక్షకుడిగా చూపించుకునే ప్రయత్నం చేసింది.
అయితే.. ఇజ్రాయెల్ తన విస్తరణ కోసం సిరియాలో మత విభజనను రేకెత్తిస్తోందని విమర్శలున్నాయి. రాష్ట్ర నిర్మాణం, యుద్ధానంతర పునరుద్ధరణ ప్రయత్నాలను మత ఘర్షణలు, ఇజ్రాయెల్ దాడులు పక్కదారి పట్టిస్తున్నాయి. ఈ హింస తర్వాత ప్రజల్లో చీలిక వచ్చింది. కొత్త ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత పెరిగింది. ఈ నేపథ్యంలోనే తాత్కాలిక ప్రభుత్వం ఎన్నికల ప్రకటన చేసింది.
అసద్ పతనం తరువాత మొదలైన మతపరమైన విభజనలను తగ్గించి.. పరిస్థితులను పునరుద్ధరించేందుకు తాత్కాలిక అధ్యక్షుడు అల్–షరా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఇటీవల తన ఎన్నికల చట్టాలను సవరించింది, పార్లమెంటు సీట్లను 150 నుంచి 210కి పెంచింది. 210 సీట్లలో మూడింట ఒక వంతు స్థానాలను తాత్కాలిక అధ్యక్షుడు అల్–షరా నియమిస్తారు. మిగిలిన స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. దీనికోసం సిరియాలోని ప్రతి ప్రావిన్స్‌లో ఒక ఎలక్టోరల్ కాలేజీని ఏర్పాటు చేయనున్నారు.