ప్రధాని నివాసాన్ని ఆక్రమించుకుని.. బెడ్‌పై రెజ్లింగ్ చేసిన లంకేయులు..

Sri Lanka Protesters Wrestling on PM Bed Video goes Viral on Social Media - Sakshi

కొలంబో: దేశాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టినందుకు అధ్యక్షుడు, ప్రధాని రాజీనామా చేయాలని లంకేయుల కొంతకాలంగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో గతవారం అధ్యక్ష భవనాన్ని ముట్టడించి ఆక్రమించారు. అనంతరం అక్కడి విలాస సదుపాయాలను కొందరు ఆందోళనకారులు ఆస్వాదించారు. భవనంలోని స్విమ్మింగ్‌పూల్లో దూకి ఈత కొట్టారు. కిచెన్‌లో వండుకుని తిన్నారు. బెడ్‌రూంలలో హాయిగా సేదతీరారు. జిమ్‌లో వర్కౌట్లు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. వాటిని చూసి నెటిజన్లు తెగ కామెంట్లు చేశారు.

ఇప్పుడు ఇలాంటి వీడియోనే మరొకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రధాని అధికారిక నివాసంలోకి ప్రవేశించిన నిరసనకారులు ఆయన బెడ్‌పై సరదాగా రెజ్లింగ్ చేశారు. ప్రొఫెషనల్ రెజ్లర్లను తలపించేలా స్టంట్లతో రెచ్చిపోయారు. అంతేకాదు ఈ వీడియోను కాస్త ఎడిట్ చేసి దానికి బ్యాగ్రౌండ్లో నిజమైన రెజ్లింగ్ మ్యాచ్ కామెంటరీని కూడా జోడించారు.

ఇందుకు సంబందించిన వీడియోను ఓ శ్రీలంక యూజర్ ట్విట్టర్‍లో షేర్ చేశాడు. ప్రొఫెషనల్ రెజ్లర్లలా మారి ఆందోళనకారులు ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. నిజమైన మ్యాచ్‌ను తలపించేలా బెడ్‌పై ‘కుమ్మేసుకున్నారు’.  వీడియోలో ఓ ఆందోళనకారుడు డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్‌ రెజ్లర్‌ ర్యాండీ ఆర్టన్‌లా పోజులివ్వడం ఆకట్టుకుంది. 

అంతకుముందు అధ్యక్షుడు గొటబాయ, ప్రధాని విక్రమ సింఘే రాజీనామా చేయాలని ఆందోళనకారులు విధ్వంసం సృష్టించారు. ప్రధాని  ప్రైవేటు నివాసానికి నిప్పంటించారు. ప్రజల ఆగ్రహావేశాలు చూసి అధ్యక్షుడు గొటబాయ పారిపోయారు. ప్రస్తుతం ఆయన శ్రీలంక నేవీ ఓడలో ఉన్నట్లు తెలుస్తోంది. లంకేయుల ఆందోళనల నేపథ్యంలో పదవుల నుంచి తప్పుకుంటామని అధ్యక్షుడు, ప్రధాని ఇప్పటికే ప్రకటించారు.
చదవండి: అధ్యక్షుడి భవనంలో కరెన‍్సీ కట్టల గుట్టలు.. ఆశ్చర్యంలో లంకేయులు

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top