ఆ దేశానికి 12 లక్షల మంది ఉద్యోగులు కావాలంట

Singapore Country May Require one Million Digital Skilled Workers By 2025 - Sakshi

సింగపూర్‌: 2025 నాటికి వివిధ సంస్థలు ఎంపిక చేసుకునే ఉద్యోగాలకు డిజిటల్‌ నైపుణ్యాలే కీలకంగా మారతాయని ఓ సర్వేలో వెల్లడైంది. సింగపూర్‌ వంటి చిన్న దేశాలు సైతం ఇందుకు సన్నద్ధం కావాలని అంచనా వేసింది. 2025 నాటికి సింగపూర్‌ ఆర్థికవ్యవస్థకు 12 లక్షల మంది డిజిటల్‌ నైపుణ్యం గల ఉద్యోగులు అవసరమవుతారని తేల్చింది. ప్రస్తుతం ఆ దేశంలో ఉన్న 22 లక్షల మందిలో వీరి వాటా 55% వరకు ఉంటుందని తేలింది. డిజిటల్‌ నైపుణ్య పరంగా ఎదురయ్యే సవాళ్లను ఉద్యోగులు భవిష్యత్‌లో ఎలా ఎదుర్కోనున్నారనే కోణంలో చేపట్టిన ఈ సర్వే వివరాలను ఆన్‌లైన్‌ వార్తాపత్రిక ‘టుడే’లో గురువారం వెల్లడయ్యాయి. 

ఆస్ట్రేలియా, భారత్, ఇండోనేసియా, జపాన్, సింగపూర్, దక్షిణ కొరియాతో కలిపి మొత్తం ఆరు దేశాల్లోని 3 వేల మంది నుంచి వివరాలు సేకరించారు. ఇప్పటికే సింగపూర్‌లోని ప్రతి 10 మంది ఉద్యోగుల్లో ఆరుగురు తమ విధుల్లో డిజిటల్‌ నైపుణ్యాలను వినియోగిస్తున్నారు. ఈ విషయంలో సింగపూర్‌ రెండో స్థానంలో, 64%తో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో నిలిచింది. అడ్వాన్స్‌డ్‌ డిజిటల్‌ స్కిల్స్‌ పరంగా చూస్తే ఆస్ట్రేలియాలోని ప్రతి ఐదుగురిలో ఒకరు..అంటే 22% మంది వినియోగిస్తున్నారు. ఆరు దేశాల్లో ఇదే అత్యధికం. ఆ తర్వాతి స్థానంలో 21%తో దక్షిణ కొరియా ఉంది. 

భారత్‌లోని ఉద్యోగుల్లో 12% మందికే డిజిటల్‌ స్కిల్స్‌ ఉన్నప్పటికీ, అడ్వాన్స్‌డ్‌ డిజిటల్‌ స్కిల్స్‌ కోసం అత్యధికంగా 71% మంది దరఖాస్తు చేసుకోవడం విశేషం. ఈ విషయంలో సింగపూర్‌ 59%తో మూడో స్థానం నిలిచింది. ఈ దేశంలోని ఉద్యోగులు సాంకేతికపరమైన మార్పులకు అనుగుణంగా ఎదిగేందుకు సరాసరిన ఏడు డిజిటల్‌ స్కిల్స్‌ను నేర్చుకోవాల్సి ఉంటుందని సర్వే అంచనా వేసింది. సింగపూర్‌కు భవిష్యత్తులో అవసరమయ్యే 12 లక్షల మందిలో.. ఇప్పటి వరకు ఎలాంటి డిజిటల్‌ నైపుణ్యాలను వినియోగించని వారు, నిరుద్యోగులు/ 2025 నాటికి ఉద్యోగం అవసరమయ్యే వారు, ప్రస్తుతం విద్యార్థులుగా ఉండి ఉద్యోగాల్లో చేరే వారు డిజిటల్‌ నైపుణ్యాలను నేర్చుకోవాల్సి ఉంటుందని తెలిపింది. 

ప్రస్తుతం ఉన్న వారితో కలిపి మొత్తం 2025 నాటికి సింగపూర్‌లోని ఉద్యోగులకు 2.38 కోట్ల డిజిటల్‌ స్కిల్‌ ట్రయినింగ్‌ సెషన్స్‌ నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొంది. అదే భారత్‌లో, 2025 నాటికి 39 కోట్ల ట్రయినింగ్‌ సెషన్స్‌ అవసరమవుతాయని అంచనా వేసింది. 2020–2025 మధ్య భారత్‌తోపాటు, జపాన్, సింగపూర్‌లలోని డిజిటల్‌ స్కిల్డ్‌ సిబ్బందికి అడ్వాన్స్‌డ్‌ క్లౌడ్‌ స్కిల్స్‌లోకు ఎక్కువ డిమాండ్‌ ఉంటుందని వెల్లడించింది. ఈ నైపుణ్యాలను ఉద్యోగులు అందిపుచ్చుకోకుంటే 2025 నాటికి డేటా, క్లౌడ్, సైబర్‌ సెక్యూరిటీ నైపుణ్యం ఉండే సిబ్బంది కొరతను వాణిజ్య సంస్థలు ఎదుర్కోనున్నాయని అంచనా వేసింది.

చదవండి: ధైర్యం చేసి.. నీళ్లలోకి దిగి

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top