నాన్న చనిపోయారు.. కానీ ఆయన గుండె చప్పుడు విన్నారు.. 

Siblings Listen To Their Father Heartbeat 4 Years After His Death - Sakshi

వాషింగ్టన్: అమెరికాలోని కనెక్టికట్ ప్రాంతానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు తమ తండ్రి గుండె చప్పుడు విని భావోద్వేగానికి గురయ్యారు. నాలుగేళ్ల క్రితం తన తండ్రి చనిపోగా ఆయన అవయవాలను దానం చేశారు ఆ బిడ్డలు. ఆ గుండె ఎక్కడ ఉందో వెతుక్కుంటూ వెళ్లిన ఆ అక్కాచెలెళ్లకు తండ్రి గుండెను అమర్చిన వ్యక్తి దొరికారు. వెంటనే ఆ గుండె మీద చెవులను ఆనించి తండ్రి గుండె చప్పుడు విన్నారు.    

మనల్ని ఇష్టపడేవాళ్లు విడిచి వెళ్లినా కూడా వారి జ్ఞాపకాలు మనలను తరచుగా పలకరిస్తూ ఉంటాయి. వారు మన మధ్య ఉంటే బాగుండన్న భావన నిత్యం కలుగుతూ ఉంటుంది. కానీ అవయవదానం చేసిన సందర్భాల్లో వ్యక్తులు మరణించినా వారి అవయవాలు వేరే వాళ్లకి అమరిస్తే అవి సజీవంగానే ఉంటాయి. అలా అవయవదానం చేసిన ఎస్టబెన్ శాంటియాగో(39) కుమార్తెలు తన తండ్రి అవయవాల కోసం వెతుకుతూ చివరికి ఆయన గుండెను కనుగొన్నారు.  

కిసండ్ర శాంటియాగో(22) ఈ వెతుకులాటకు శ్రీకారం చుట్టింది. అలా మొదలైన ఆమె ప్రయత్నం నాలుగేళ్లపాటు సాగి చివరికి తన తండ్రి హృదయాన్ని ఎవరికి అమర్చారో కనిపెట్టింది. వెంటనే తన చెల్లెళ్లను వెంటబెట్టుకుని అక్కడికి వెళ్లి వారు ఆయన గుండెల మీద తల ఆనించి గుండె చప్పుడును విని ఉద్వేగానికి లోనయ్యారు. 

కిసండ్ర శాంటియాగో మాట్లాడుతూ.. మా నాన్న నిజంగా సంతోషించేవారు. మా నాన్న కోమాలోకి వెళ్లి చనిపోయాక ఆయన అవయవాలను దానం చేయాలన్న నిర్ణయం తీసుకోవడం చాలా కష్టమనిపించింది. చివరకు ఎలాగో అంగీకరించాను. ఆ రోజు నుంచి నా గుండె భారంగానే ఉంది. ఈరోజు ఆయన గుండె చప్పుడు విన్నాక అది తేలికైందని చెప్పి కన్నీటి పర్యంతమైంది. ఈ మొత్తం దృశ్యాలను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా విశేషమైన స్పందన వస్తోంది. 

ఇది కూడా చదవండి: దుబాయ్‌లో భారతీయుడి జాక్‌పాట్.. నెలకు రూ.5.59 లక్షలు..

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top