హౌతీల దెబ్బకు అజ్ఞాతంలోకి సౌదీ యువరాజు! | Saudi Crown Prince Goes Into Hiding as Houthi Attacks Intensify Reports | Sakshi
Sakshi News home page

హౌతీల దెబ్బకు అజ్ఞాతంలోకి సౌదీ యువరాజు!

Oct 13 2026 7:01 AM | Updated on Oct 13 2026 7:07 AM

Saudi Crown Prince Goes Into Hiding as Houthi Attacks Intensify Reports

ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన సైనిక వ్యవస్థల్లో ఒకటిగా పేరొందిన సౌదీ అరేబియాకు ఇప్పుడు హౌతీ తిరుగుబాటుదారుల దాడులు తీవ్ర తలనొప్పిగా మారాయి. క్షిపణి దాడులతో రాజధాని రియాద్‌ సహా కీలక ప్రాంతాల్లో భద్రతా పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయి. ఈ పరిణామాల మధ్య సౌదీ యువరాజు, ఆ దేశ అసలు అధికార కేంద్రంగా భావించే మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ (ఎంబీఎస్‌) భద్రతపై ఉత్కంఠ నెలకొంది.

భద్రత కట్టుదిట్టంగా ఉండే ఒక రాజభవనం నుంచి మరో రాజభవనానికి తరలిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. బంకర్లు ఉన్న భవనాల్లో ప్రత్యేక భద్రతా బృందం పర్యవేక్షణలో బిన్‌ సల్మాన్‌ ఉంటున్నట్లు సమాచారం. అయితే, ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్లు వస్తున్న కథనాలపై సౌదీ ప్రభుత్వం అధికారికంగా స్పందించాల్సి ఉంది.

రక్తదానం తర్వాత మాయం!
41 ఏళ్ల మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ చివరిసారిగా మంగళవారం ఒక జాతీయ రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు బహిరంగంగా కనిపించారు. ఆ తర్వాత నుంచే ఆయన అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లిపోయారన్నది ఆ కథనాల సారాంశం!. ఈ నేపథ్యంలో ఆయన కదలికలపై అంతర్జాతీయ స్థాయిలో చర్చ మొదలైంది. వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ కథనం ప్రకారం.. యువరాజు కదలికల గురించి తెలిసిన అధికారులను ఉటంకిస్తూ, ఆయనను అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉన్న రాజభవనాల మధ్య తరలిస్తున్నట్లు పేర్కొంది. ఈ భవనాల్లో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుగా బంకర్లు కూడా ఉన్నట్లు తెలిపింది. యువరాజు భద్రత కోసం ఆయనకు అత్యంత విశ్వసనీయమైన ప్రత్యేక బృందాన్ని నియమించినట్లు వెల్లడించింది.

హౌతీ తిరుగుబాటుదారుల దాడులు తీవ్రం కావడం, సౌదీపై ముప్పు పెరుగుతుండటంతోనే ఈ చర్యలు చేపట్టినట్లు కథనం పేర్కొంది. అయితే, ఆయన ఎక్కడ ఉన్నారు? ఎప్పటికప్పుడు ఎందుకు నివాసం మారుస్తున్నారు? అనే సమాచారం అంత్యంత గోప్యంగా ఉంచారు.

దశాబ్దంలోనే అత్యంత తీవ్రమైన దాడి!
సౌదీ అరేబియాపై హౌతీలు ఇటీవల జరిపిన దాడులు అక్కడి భద్రతా వ్యవస్థకు సవాలుగా మారాయి. శనివారం జరిగిన దాడిని గత దశాబ్ద కాలంలోనే అత్యంత తీవ్రమైన దాడిగా నివేదికలు అభివర్ణించాయి. రాజధాని రియాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంపై కనీసం ఒక హౌతీ క్షిపణి దాడి జరిపింది. ఈ దాడిలో కనీసం 13 మంది మరణించగా, మరో 300 మందికిపైగా గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇరాన్‌ యుద్ధానికి సంబంధించి అమెరికా లేదా గల్ఫ్‌ మిత్రదేశాలపై జరిగిన దాడుల్లో ఇదే అత్యంత ప్రాణాంతకమైన ఘటనగా అధికారులకు వివరించినట్లు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పేర్కొంది.

ఈ దాడి తీవ్రతకు బాధితులు ఎదుర్కొన్న పరిస్థితులు అద్దం పడుతున్నాయి. 28 ఏళ్ల ఈజిప్టు విమాన సహాయకురాలు ఒకరు చేతిని కోల్పోయి తీవ్ర రక్తస్రావంతో మరణించినట్లు కథనం వెల్లడించింది. మరికొందరు కూడా అవయవాలు కోల్పోయినట్లు పేర్కొంది.

ఐదు రోజుల్లో నాలుగుసార్లు!
రియాద్‌లోని కింగ్‌ ఖాలిద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం లక్ష్యంగా వరుస దాడులు జరగడం సౌదీ అధికారులను కలవరపెడుతోంది. గత ఐదు రోజుల్లో ఈ విమానాశ్రయంపై నాలుగుసార్లు దాడులు జరిగినట్లు నివేదికలు తెలిపాయి. వారాంతపు దాడి తర్వాత విమానాశ్రయాన్ని మూసేశారు. కీలక మౌలిక సదుపాయాలపై పదేపదే దాడులు జరగడం వల్ల సౌదీ భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భారీగా ఖర్చు చేసి అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుకున్నప్పటికీ, హౌతీల దాడులను పూర్తిగా అడ్డుకోలేకపోవడం ఆ దేశానికి సవాలుగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో సౌదీ ఇంధన శాఖ మంత్రి ప్రిన్స్‌ అబ్దుల్‌అజీజ్‌ బిన్‌ సల్మాన్‌ తీవ్ర హెచ్చరిక చేశారు. దాడుల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని సౌదీ ప్రతిస్పందన కూడా అంతే తీవ్రంగా ఉంటుందని స్పష్టం చేసినట్లు నివేదిక పేర్కొంది.

రంగంలోకి దిగనున్న ట్రంప్‌?
హౌతీలపై సౌదీ అరేబియా జరుపుతున్న దాడుల్లో తాము కూడా పాల్గొనే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వెల్లడించారు. దీంతో యెమెన్‌ సంక్షోభం మరింత విస్తరించే అవకాశాలపై ఆందోళనలు పెరుగుతున్నాయి. మరోవైపు, సౌదీ అరేబియాకు మక్కా ఒప్పందంలోని మిత్రదేశాలు కూడా మద్దతు ప్రకటించాయి. ఈ పరిణామాలు హౌతీలపై సైనిక ఒత్తిడిని పెంచే దిశగా సాగుతున్నాయి.

కాల్పుల విరమణకు బ్రేక్‌!
సౌదీ అరేబియా, యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారుల మధ్య పోరాటం కొత్తది కాదు. 2015లో యెమెన్‌ అంతర్యుద్ధంలో అక్కడి ప్రభుత్వానికి మద్దతుగా సౌదీ సైనిక జోక్యం చేసుకోవడంతో ఈ పోరు మరింత తీవ్రమైంది. అనంతరం ఇరుపక్షాల మధ్య సుదీర్ఘ ఘర్షణలు కొనసాగాయి. 2022లో కుదిరిన కాల్పుల విరమణతో పరిస్థితులు కొంతమేర అదుపులోకి వచ్చినప్పటికీ, ఆ ఒప్పందం ఈ ఏడాది జూలైలో కుప్పకూలినట్లు నివేదిక పేర్కొంది. అమెరికా–ఇజ్రాయెల్‌, ఇరాన్‌ మధ్య యుద్ధం నేపథ్యంలో ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరగడం కూడా ఈ ఘర్షణలకు ఆజ్యం పోసింది.

సనా విమానాశ్రయంలో ఇరాన్‌ నుంచి వస్తున్న విమానం దిగేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో సౌదీ దళాలు కాల్పులు జరిపాయని ఆరోపిస్తూ హౌతీలు మళ్లీ దాడులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ ఆరోపణల నేపథ్యంలో ఇరుపక్షాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.

మధ్యవర్తిత్వానికి ఇరాన్‌ సిద్ధం?
పశ్చిమాసియాలో ఇరాన్‌కు అత్యంత భారీ ఆయుధ సామర్థ్యం ఉన్న మిత్ర బలగాల్లో హౌతీలు ఒకటిగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో సౌదీ–హౌతీ ఘర్షణలు ప్రాంతీయ రాజకీయాలపైనా ప్రభావం చూపుతున్నాయి. అరేబియా ద్వీపకల్పంలో పరిణామాలపై ఇరాన్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్‌ బఘాయీ తెలిపారు. ఈ పోరాటం వల్ల ఇజ్రాయెల్‌కు మాత్రమే ప్రయోజనం చేకూరుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

ఆదివారం రాత్రి సౌదీ, ఇరాన్‌ విదేశాంగ మంత్రులు కూడా తాజా పరిణామాలపై చర్చించారు. సైనిక చర్యలపైనే పట్టుబట్టి, రాజకీయ పరిస్థితులను విస్మరించడం సరికాదని తాను హెచ్చరించినట్లు ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాఘ్చీ తెలిపారు. సౌదీ, హౌతీల మధ్య చర్చలు ప్రారంభించేందుకు సహకరించడానికి తమ దేశం సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

మొత్తానికి, హౌతీల క్షిపణి దాడులు సౌదీ భద్రతా వ్యవస్థకు సవాలు విసురుతున్న వేళ.. యువరాజు మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ భద్రత, ఆయన బహిరంగంగా కనిపించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. 

ఇదీ చదవండి: ఒక్క దాడి.. ఎన్నో అనుమానాలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement