Russia-Ukraine war: యుద్ధ పాపం పశ్చిమ దేశాలదే

Russia-Ukraine war: Putin defends military action in Ukraine at Russia Victory - Sakshi

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ స్పష్టీకరణ

పశ్చిమ దేశాల చర్యకు ప్రతిచర్యగానే ఉక్రెయిన్‌పై సైనిక చర్య 

మాస్కోలో ‘విక్టరీ డే’ వేడుకల్లో పుతిన్‌ ప్రసంగం

ఉక్రెయిన్‌లో యుద్ధంపై కీలక ప్రకటనేదీ చేయని వైనం

మాస్కో/కీవ్‌: పొరుగుదేశం ఉక్రెయిన్‌పై తాము ప్రారంభించిన సైనిక చర్యను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ మరోసారి సమర్థించుకున్నారు. పశ్చిమ దేశాల విధానాలే తమను ఉక్రెయిన్‌పై యుద్ధానికి పురికొల్పాయని స్పష్టం చేశారు. ఆయా దేశాల చర్యకు ప్రతిచర్యగానే ఈ సైనిక చర్యకు శ్రీకారం చుట్టామన్నారు. రష్యా రాజధాని మాస్కోలోని రెడ్‌ స్క్వేర్‌లో సోమవారం ‘విక్టరీ డే’ వేడుకల్లో పుతిన్‌ పాల్గొన్నారు. మిలటరీ పరేడ్‌ను తిలకించారు.

ఈ సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అయితే, పరిశీలకులు అంచనా వేసినట్లు పుతిన్‌ కీలక ప్రకటనలేదీ చేయలేదు. ఉక్రెయిన్‌పై యుద్ధవ్యూహంలో మార్పు, పూర్తిస్థాయి యుద్ధ ప్రకటన గురించి ప్రస్తావించలేదు. 1945లో నాజీలపై రెడ్‌ ఆర్మీ సాగించిన పోరాటానికి, ఇప్పుడు ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి మధ్య పోలికలు ఉన్నాయని పరోక్షంగా వెల్లడించారు. సరిహద్దుల అవతలి నుంచి తమ మాతృభూమికి ముప్పు పొంచి ఉండడాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమని పుతిన్‌ తేల్చిచెప్పారు.

ఉక్రెయిన్‌పై దండయాత్ర అత్యవసర చర్యేనని ఉద్ఘాటించారు. రష్యాకు ముప్పు రోజురోజుకూ పెరుగుతోందన్నారు.  తాము సరైన సమయంలో, సరైన రీతిలో స్పందించామని అన్నారు. రష్యా భద్రతకు హామీతోపాటు ‘నాటో’ విస్తరణ యోచనను విరమించుకోవాలని కోరామన్నారు. అయినా ఫలితం కనిపించలేదని చెప్పారు.  రష్యా దళాలు సొంతదేశం భద్రత కోసమే ఉక్రెయిన్‌లో వీరోచితంగా పోరాడుతున్నాయని ప్రశంసించారు. రష్యాపై దాడులు చేయడానికి ఉక్రెయిన్‌ గతంలోనే ప్రణాళికలు రచించిందని పుతిన్‌ ఆరోపించారు.  
 

ఉక్రెయిన్‌పై దాడులు ఇక ఉధృతం!
రష్యా  క్షిపణి దాడులను తీవ్రం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని ఉక్రెయిన్‌ సైన్యం సోమవారం తమ ప్రజలను హెచ్చరించింది. రష్యాలోని బెల్గోరాడ్‌ ప్రాంతంలో 19 బెటాలియన్‌ టాక్టికల్‌ గ్రూప్స్‌ సిద్ధంగా ఉన్నాయని పేర్కొంది.

పుతిన్‌కు విజయం అసాధ్యం: జి–7
రష్యా నుంచి చమురు దిగుమతులను పూర్తిగా నిషేధించాలని జి–7 దేశాధినేతలు నిర్ణయానికొచ్చారు. అమెరికా, బ్రిటన్, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్‌ దేశాల అధినేతలు ఆదివారం రాత్రి ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో వర్చువల్‌గా భేటీ అయ్యారు. ఈ యుద్ధంలో పుతిన్‌ విజయం దక్కడం అసాధ్యమని జి–7 దేశాల నాయకులు తేల్చిచెప్పారు.

కాగా, పోలండ్‌లోని రష్యా రాయబారి సెర్గీ అండ్రీవ్‌కు నిరసన సెగ తగిలింది. వార్సాలోని సోవియట్‌ సైనిక శ్మశాన వాటికలో దివంగత రెడ్‌ ఆర్మీ సైనికులకు నివాళులర్పించకుండా అండ్రీవ్‌ను అడ్డుకున్నారు. ఆయనపై  ఎర్రరంగు చల్లారు.

త్వరలో మాకు రెండు ‘విక్టరీ డే’లు: జెలెన్‌స్కీ
త్వరలో తాము రెండు విక్టరీ డేలు జరుపుకోబోతున్నామని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చెప్పారు. ఈ మేరకు సోమవారం ఒక వీడియో సందేశం విడుదల చేశారు. రెండో ప్రపంచ యుద్ధంలో తమ పూర్వీకుల ప్రాణ త్యాగాలను ఎప్పటికీ మర్చిపోలేమని అన్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో ఉక్రెయిన్‌ ప్రజలు విజయం సాధించారని, ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలోనూ కచ్చితంగా నెగ్గుతామని ఉద్ఘాటించారు. తద్వారా త్వరలోనే రెండు విక్టరీ డేలు జరుపుకుంటామన్నారు. కొందరికి(రష్యా) ఒక్క విక్టరీ డే కూడా ఉండబోదని వ్యాఖ్యానించారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top