
రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆశాభావం
యూఏఈ వేదికగా ఉంటుందని వెల్లడి
మాస్కో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో వచ్చే వారం సమావేశమవ్వాలని భావిస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. బహుశా యూఏఈలో శిఖరాగ్రం జరిగే అవకాశముందన్నారు. మూడేళ్లుగా కొనసాగిస్తున్న యుద్ధానికి ముగింపు పలకాలంటూ అమెరికా అధ్యక్షుడు పుతిన్ తీవ్రంగా ఒత్తిళ్లు తెస్తున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.
యూఏఈ అధ్యక్షుడు జాయెద్ అల్ నహ్యాన్‌తో క్రెమ్లిన్‌లో జరిగిన భేటీ అనంతరం పుతిన్ ఈ ప్రకటన చేశారు. ప్రతిపాదన తమదే అయినా, ఇరు దేశాలు ఈ భేటీపై ఆసక్తితో ఉన్నాయన్నారు. చర్చల్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పాల్గొంటారా అన్న ప్రశ్నకు పుతిన్.. ఇందుకు తాను వ్యతిరేకం కాదని గతంలోనూ అనేక పర్యాయాలు చెప్పానన్నారు. అయితే, ఇందుకు కొన్ని పరిస్థితులు అనుకూలించాల్సి ఉందన్నారు. అంతకుముందు, రష్యా విదేశాంగ శాఖ సలహాదారు యూరి ఉషకోవ్ మాట్లాడుతూ.. శిఖరాగ్రం వచ్చే వారం జరిగే అవకాశాలున్నాయని తెలిపారు. ఇందుకు వేదికపై సూత్రప్రాయ అంగీకారం కుదిరినట్లు వెల్లడించారు. తేదీలింకా ఖరారు కాలేదన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కూడా ఈ భేటీలో పాల్గొనే ఛాన్సుందన్న వార్తలను ఉషకోవ్ కొట్టిపారేశారు. పుతిన్, ట్రంప్ భేటీ విజయవంతం, ఫలవంతం కావాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. యుద్ధానికి ముగింపు పలికేందుకు గతంలో జెలెన్‌స్కీ భేటీ ప్రతిపాదన తెచ్చినా పుతిన్ పట్టించుకోలేదు.
తాజాగా, పుతిన్ వ్యాఖ్యలపై అమెరికా అధ్యక్ష భవనం స్పందించలేదు. యుద్ధం ఆపకుంటే ఆర్థికపరమైన కఠిన ఆంక్షలను విధిస్తామని ట్రంప్ చేసిన హెచ్చరికల గడువు శుక్రవారంతో ముగియనుంది. ట్రంప్–పుతిన్ శిఖరాగ్రం తమ వైఖరిని స్పష్టంగా తెలియజేసేందుకు ఒక అవకాశమని రష్యా బుధవారం వ్యాఖ్యానించింది. అరుదైన ఖనిజాల వెలికితీత వంటి అంశాల్లో ఉమ్మడి పెట్టుబడులకు ఆర్థిక అవకాశాలపైనా చర్చలు జరపవచ్చని తెలిపింది.
యుద్ధానికి వ్యతిరేకంగా ఉక్రేనియన్లు
2022తో పోలిస్తే రష్యాతో జరిగే యుద్ధాన్ని సాధ్యమైనంత త్వరగా ముగించాలని ఎక్కువమంది ఉక్రెయిన్ ప్రజలు కోరుకుంటున్నారు. యుద్ధం మొదలైన కొత్తలో చేపట్టిన ఓ సర్వేలో విజయం సాధించేదాకా పోరాడాల్సిందేనంటూ మూడొంతుల మంది గట్టిగా కోరుకున్నారు. తాజాగా ఇటీవల చేపట్టిన సర్వేలో మాత్రం ఇందుకు విరుద్ధమైన ఫలితాలు వచ్చాయి. యుద్ధానికి కొనసాగించాలనుకునే వారి సంఖ్యలో గణనీయంగా తగ్గుదల కనిపించింది. త్వరగా యుద్ధానికి ముగింపు పలికి, రష్యాతో ఒప్పందానికి రావాలని మూడొంతుల మంది కోరుకుంటున్నారని వెల్లడైంది. రష్యా ఆధీనంలోని భాగాలు మినహా మిగతా ప్రాంతాల్లోని 15 ఏళ్లు పైబడిన వెయ్యి మంది నుంచి అభిప్రాయాలను తెలుసుకున్నామని సర్వే నిర్వాహకులు తెలిపారు.