
సర్వనాశనం చేస్తున్న ఇజ్రాయెల్
బూడిద కుప్పలుగా పట్టణాలు
డెయిర్ అల్ బలాహ్: గాజా స్వాదీన ప్రణాళికలను ఇజ్రాయెల్ అత్యంత కర్కశంగా అమలు చేస్తోంది. గత మార్చిలో కాల్పుల విరమణకు తెర దించిన నాటి నుంచీ గాజాపై భారీగా వైమానిక దాడులకు దిగుతున్న ఇజ్రాయెల్ అలా కూలిన భవనాలను కూడా తాజాగా నేలమట్టం చేస్తోంది. దాంతో రెండేళ్ల కిందిదాకా వేలాది మందితో కళకళలాడిన పట్టణాలు ఇప్పుడు బూడిద కుప్పలుగా మారుతున్నాయి. ఇజ్రాయెల్ సైనిక నియంత్రణలో ఉన్న పలు ప్రాంతాల్లో భారీ విధ్వంసం జరిగినట్లు ఉపగ్రహ చిత్రాలు చూపిస్తున్నాయి.
దాడుల వల్ల ఇప్పటికే దెబ్బతిన్న భవనాలతో పాటు చెక్కు చెదరకుండా ఉన్న అనేక నిర్మాణాలను కూడా ఇజ్రాయెల్ సైన్యం నేలమట్టం చేసి ఆ ప్రాంతాలను పూర్తిగా చదును చేస్తోంది. నివాస భవనాలు, పాఠశాలలు అని లేకుండా అన్నింటినీ వరుసబెట్టి కూల్చేస్తోంది. తాము అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగానే పనిచేస్తున్నామని ఇజ్రాయెల్ వాదిస్తోంది.
‘‘పౌర ప్రంతాల్లో హమాస్ ఉగ్ర సంస్థ ఆయుధాలను దాచింది. అందుకే వాటిని సైన్యం కూల్చేస్తోంది’’అని ఇజ్రాయెల్ రక్షణ దళం (ఐడీఎఫ్) అంటోంది. కాల్పుల విరమణ తరువాత గాజాలో 40 ప్రదేశాల్లోని మౌలిక సదుపాయాలను ఇజ్రాయెల్ నేలమట్టం చేసింది. ఈజిప్టు సరిహద్దులో రఫా నగరంలో విధ్వంసం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. రఫాలోని అనేక ప్రాంతాలాను ఇజ్రాయెల్ సైనికులు, కాంట్రాక్టర్లు చదును చేశారు.
ఏప్రిల్ నుంచి గాజాలో జరిగిన విధ్వంసంలో అత్యధికం ఈ ప్రాంతంలోనే చోటుచేసుకుంది. భవనాల కింద బాంబులు పెట్టి మరీ పేలుస్తున్నారు. అనంతరం బుల్డోజర్లతో ఆ ప్రాంతాలను పూర్తిగా తుడిచి పెట్టేస్తున్నారు. రఫా నగరంలోనే అత్యంత శక్తివంతమైన ప్రాంతాల్లో ఒకటైన టెల్ అల్ సుల్తాన్‌లో ఓ పాఠశాలను కూల్చేసిన వీడియోను బీబీసీ విడుదల చేసింది. ఆ ప్రాంతం పూర్తిగా దెబ్బతిన్నట్లు ఉపగ్రహ చిత్రాలు చూపిస్తున్నాయి.
ఇజ్రాయెల్ సరిహద్దు నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖుజాను సైతం ఇజ్రాయెల్ నేలమట్టం చేసింది. యుద్ధానికి ముందు ఈ పట్టణ జనాభా 11 వేలు. ఇక్కడ అత్యిధికం వ్యవసాయ ఆధారిత కుటుంబాలే ఉండేవి. టమాటా, గోధుమలు, ఆలివ్ పంటలకు ప్రసిద్ధి చెందిన నేల. గత మే దాకా బాగానే ఉన్న ఆ పట్టణాన్ని జూన్ మధ్య నాటికి సగానికి సగం ఇజ్రాయెల్ కూల్చేసింది. ఏకంగా 1,200 భవనాలు విధ్వంసమయ్యాయి. అబాసన్ అల్ కబీరా పట్టణానిదీ అదే దుస్థితి! యుద్ధానికి ముందు 27,000 మంది నివసించిన ఈ పట్టణం మేలో బాగానే ఉంది.
జూన్‌కు వచ్చేసరికి అక్కడి ముఖచిత్రమే మారిపోయింది. సగం పట్ట ణం ఆనవాలు లేకుండా పోయింది. ఇజ్రాయెల్‌కు సరిహద్దుకు 7 కి.మీ. దూరంలో ఉన్న కిజాన్ అబు రష్వాన్‌లో కూడా విధ్వంసం జరిగింది. గత మార్చి దాకా పచ్చగా ఉన్న ఈ పట్టణం జూలై 4 నాటికి బూడిద కుప్పగా మిగిలింది. గాజాలో ఇజ్రాయెల్ కూల్చివేతల వేగం నానాటికీ పెరుగుతోంది! అమెరికా నుంచి ఇజ్రాయెల్ సైన్యానికి డజన్ల కొద్దీ డీ9 బుల్డోజర్లు అందినట్టు అక్కడి మీడియా గత వారం తెలిపింది. కూల్చివేతల పనులకు కాంట్రాక్టర్లు కావాలంటూ ఫేస్‌బుక్‌లో పోస్టులు చేసింది. మే నుంచి వారిని యుద్ధ ప్రాతిపదికన నియమించుకుంటోంది.
శిథిలాలపై మానవతా నగరి!
రఫా శిథిలాలపై మానవతా నగరాన్ని నిర్మిస్తామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ ప్రకటించారు. 6 లక్షల మంది పాలస్తీనియన్లకు అక్కడ ఆవాసం కల్పిస్తామని చెప్పారు. ఈ ప్రణాళికలపై తీవ్ర విమర్శలొచ్చాయి. అది మానవతా నగరం కాదని, నిర్బంధ శిబిరమని ఇజ్రాయెల్ మాజీ ప్రధాని ఎముద్ ఓల్మెర్ట్ అన్నారు! శాపాలస్తీనా ప్రజలు కొంతకాలానికి తిరిగొచ్చినా స్వస్థలంలో ఏమీ మిగల్లేదనే నిరాశతో తిరిగి వలస వెళ్లేలా చేయడమే ఇజ్రాయెల్ ఉద్దేశంగా కనిపిస్తోంది. పాలస్తీనా ప్రజలు గాజాకు తిరిగి రాకుండా చేయడమే అసలు ప్రణాళిక అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇటీవల ఆ దేశ ఎంపీల బృందంతో అన్నారు!
– సాక్షి, నేషనల్ డెస్క్