మత గురువు నుంచి తాలిబన్‌ చీఫ్‌గా..

Religious Teacher to Taliban chief Hebatullah Akhundzada - Sakshi

ముల్లా హైబతుల్లా అఖుంద్‌జాదా ప్రస్థానం

కాబూల్‌: ముల్లా హైబతుల్లా అఖుంద్‌జాదా.. కల్లోలిత అఫ్గానిస్తాన్‌ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇస్లాంపై అచంచల విశ్వాసం, షరియా చట్టంపై అపారమైన పరిజ్ఞానమే ఆయనకు అత్యున్నత పదవి దక్కేలా చేసిందని చెప్పొచ్చు. 60 సంవత్సరాల అఖుంద్‌జాదా అఫ్గానిస్తాన్‌లోని కాందహార్‌ ప్రాంతంలో జన్మించారు. పషూ్తన్లలోని నూర్జాయ్‌ అనే బలమైన తెగకు చెందిన ఆయన పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌ ప్రావిన్స్‌లో కచ్లాక్‌ మసీదులో 15 ఏళ్లపాటు మత గురువుగా పనిచేశారు. అనంతరం తాలిబన్‌ ఉద్యమం వైపు ఆకర్షితులయ్యారు. తాలిబన్ల అత్యున్నత మత గురువుగా ఎదిగారు. 1990వ దశకంలో తాలిబన్లలో చేరిన అఖుంద్‌జాదాకు 1995లో తొలిసారిగా పెద్ద గుర్తింపు లభించింది.

2016లో తాలిబన్‌ పగ్గాలు
అఫ్గాన్‌లో తాలిబన్లు అధికారంలోకి వచ్చాక కాందహార్‌లోని తాలిబన్‌ మిలటరీ కోర్టులో అఖుంద్‌జాదాకు కీలక స్థానం దక్కింది. తర్వాత నాంగార్హర్‌ ప్రావిన్స్‌లో మిలటరీ కోర్టు అధినేతగా పదోన్నతి పొందారు. 2001లో అమెరికా సైన్యం దండెత్తడంతో అఫ్గాన్‌లో తాలిబన్ల పాలనకు తెరపడింది. అప్పుడు తాలిబన్‌ సుప్రీంకోర్టు డిప్యూటీ చీఫ్‌గా అఖుంద్‌జాదా అవతరించారు. మత గురువుల మండలికి పెద్ద దిక్కుగా మారారు. 2015లో తాలిబన్‌ అధినేత ముల్లా మన్సూర్‌ తన తదుపరి నాయకుడిగా (వారసుడు) అఖుంద్‌జాదా పేరును ప్రకటించారు. 2016లో తాలిబన్‌ అధినేతగా అఖుంద్‌జాదా పగ్గాలు చేపట్టారు. 2017లో ఆయన పేరు ప్రఖ్యాతలు విస్తరించాయి. అఖుంద్‌జాదా కుమారుడు అబ్దుర్‌ రెహమాన్‌ అలియాస్‌ హఫీజ్‌ ఖలీద్‌(23) అప్పటికే తాలిబన్‌ ఆత్మాహుతి దళంలో సభ్యుడిగా పని చేసేవాడు. ఓ ఉగ్రవాద దాడిలో ఖలీద్‌ మరణించాడు.

కనిపించడం అత్యంత అరుదు
తాలిబన్‌ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్‌ తరహాలోనే అఖుంద్‌జాదా కూడా గోప్యత పాటిస్తుంటారు. అత్యంత అరుదుగా జనం ముందుకు వస్తుంటారు. తాలిబన్లు అఖుంద్‌జాదా ఫొటోను ఇప్పటిదాకా కేవలం ఒక్కటే విడుదల చేశారు. బహిరంగంగా కనిపించకపోయినా, మాట్లాడకపోయినా తాలిబన్లకు ఆయన మాటే శిలాశాసనం. అఖుంద్‌జాదా ప్రస్తుతం కాందహార్‌లో నివసిస్తున్నట్లు సమాచారం. సుప్రీం లీడర్‌గా అఫ్గానిస్తాన్‌ ప్రజలకు ఎలాంటి పరిపాలన అందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top