దౌత్యం విఫలమైతే యుద్ధమే | Ready for war if diplomacy fails: Iran warns US of war | Sakshi
Sakshi News home page

దౌత్యం విఫలమైతే యుద్ధమే

Jul 2 2026 5:45 AM | Updated on Jul 2 2026 5:45 AM

Ready for war if diplomacy fails: Iran warns US of war

అమెరికాకు ఇరాన్‌ హెచ్చరిక

టెహ్రాన్‌: దౌత్యపరమైన పరిష్కారానికే తమ మొదటి ప్రాధాన్యతని, చర్చలు విఫలమైతే మాత్రం యుద్ధానికి తాము సిద్ధమని ఇరాన్‌ స్పష్టం చేసింది. యురేనియం శుద్ధి సహా తమ అణు హక్కుల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని తెలిపింది.  ఒప్పందంలోని కీలక అంశాలన్నీ పూర్తిగా అమలు కానంత వరకు తదుపరి దశకు వెళ్లబోమని పేర్కొంది. ఖతార్‌లో జరగనున్న ప్రత్యేక చర్చల కోసం ఇరు దేశాల అధికారులు సన్నద్ధమవుతున్న తరుణంలో ఇరాన్‌ ఈ హెచ్చరిక చేసింది. ఇరాన్‌ పార్లమెంట్‌ స్పీకర్, చర్చల ప్రధాన ప్రతినిధి అయిన మొహమ్మద్‌ బాఘర్‌ ఘలిబాఫ్‌ ప్రభుత్వ టెలివిజన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

అమెరికాతో చర్చలను కొనసాగిస్తామని, అయితే తమకు ఇచ్చిన హామీలు నెరవేరకపోతే సైనిక ఘర్షణకు కూడా పూర్తిగా సిద్ధంగా ఉన్నామని చెప్పారు.  అణు కార్యక్రమంపై ఇరాన్‌ వైఖరిని పునరుద్ఘాటించిన ఘలిబాఫ్, దేశ అణు హక్కులు, ‘రెడ్‌ లైన్స్‌’ (అతిక్రమించకూడని పరిమితులు) విషయంలో రాజీ లేదని స్పష్టం చేశారు. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ, అణ్వాయుధాల వ్యాప్తి నిరోధక ఒప్పందం పరిధిలోనే ఇరాన్‌ అణు కార్యకలాపాలు సాగుతున్నాయన్నారు. ‘అణ్వాయుధాల వ్యాప్తి నిరోధక ఒప్పందంలో ఇరాన్‌ సభ్యదేశంగా ఉంది. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ పర్యవేక్షణలో పనిచేస్తోంది. యురేనియం శుద్ధిని తన హక్కుగా భావిస్తోంది. ఇరాన్‌ అణు హక్కులు, రెడ్‌ లైన్స్‌ విషయంలో రాజీ ఉండదు, వీటిని ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ శక్తికి చిహ్నలుగా, అమెరికా దుశ్చర్యలకు వ్యతిరేకంగా రక్షణ కవచాలుగా పరిగణిస్తామని ఆయన అన్నారు. 

2015 నాటి ‘జాయింట్‌ కాంప్రహెన్సివ్‌ ప్లాన్‌ ఆప్‌ యాక్షన్‌’ (జేసీపీఓఏ) ఒప్పందం విషయంలో తమకు ఎదురైన అనుభవాన్ని ప్రస్తావిస్తూ, అంతర్జాతీయ హామీల విశ్వసనీయతను ఘలిబాఫ్‌ ప్రశ్నించారు. చర్చలు కొనసాగుతున్నాయని, ‘లెబనాన్‌ సమస్య’, చమురు ఎగుమతులు, హార్ముజ్‌ జలసంధి గుండా నౌకాయానం వంటి ఐదు అంశాలపై స్పష్టత వచి్చ, అవి పూర్తిగా ఖరారయ్యే వరకు ఒప్పంద అమలులో తదుపరి దశకు వెళ్లబోమని స్పష్టం చేశారు. ‘ఒప్పందంలోని ఆర్టీకల్‌ 1 ప్రకారం, లెబనాన్‌లో యుద్ధం ముగుస్తుందని, ఎలాంటి సైనిక చర్యలు ఉండవని, ప్రజల తమ నేలకు తిరిగి వస్తారని, ఆ నేలపై లెబనాన్‌ జాతీయ సార్వబౌమాధికారంమే కొనసాగుతుందని అమెరికా హామీ ఇస్తోంది. ఇది చాలా పెద్ద విజయం.

దీని అమలుకోసమే మేం కృషి చేస్తున్నాం’ అని ఆయన అన్నారు. ఇజ్రాయెల్‌తో లెబనాన్‌ సంబంధాలను సాధారణీకరించడానికి అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ప్రయత్నిస్తున్నారని గాలిబాఫ్‌ ఆరోపించారు. అటువంటి ప్రయత్నాలు అవగాహన ఒప్పందానికి విరుద్ధమన్నారు. ఇరాన్‌ ఒప్పందం లక్ష్యం లెబనాన్‌ స్వాతంత్య్రాన్ని పరిరక్షించడం కూడానని స్పష్టం చేశారు. దేశ చమురు ఎగుమతుల్లో పునరుద్ధరణను కూడా ఆయన ప్రస్తావించారు. అమెరికా దిగ్బంధనం సమయంలో ఇరాన్‌ చమురును ఎగుమతి చేయలేకపోయిందని, అయితే ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత 40 మిలియన్‌ బ్యారెళ్లకు పైగా రవాణా చేసిందని తెలిపారు. మధ్యవర్తిగా ఖతార్‌ పాత్రను పునరుద్ఘాటించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement