
నేరుగా ఉక్రెయిన్ అధ్యక్షుడితో చర్చలకు సిద్ధమైన పుతిన్
వివరాలు వెల్లడించిన అమెరికా
విదేశాంగ మంత్రి రూబియో
జెలెన్‌స్కీ, పుతిన్ భేటీ తర్వాతే త్రైపాక్షిక సమావేశం
వాషింగ్టన్: ఉక్రెయిన్ యుద్ధానికి ఆఖరి గడియలు దగ్గర పడిన సంకేతాలు మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్‌పై ఆక్రమణాగ్రహంతో రగిలిపోతున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇప్పుడు కాస్తంత మెత్తబడినట్లు తెలుస్తోంది. ఈ వాదనకు బలం చేకూరుస్తూ పుతిన్ స్వయంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో చర్చలు జరిపేందుకు అంగీకరించినట్లు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మంగళవారం ప్రకటించారు. మంగళవారం అమెరికాలో ఫాక్స్ న్యూస్ వార్తాసంస్థకు ఇచి్చన ప్రత్యేక ఇంటర్వ్యూలో రూబియో ఈ విషయం వెల్లడించారు.
‘‘జెలెన్‌స్కీతో భేటీకి తాను ఇప్పుడు ఆసక్తి కనబరుస్తున్నట్లు స్వయంగా పుతిన్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఫోన్‌లో చెప్పారు. ఖచి్చతంగా జెలెన్‌స్కీని కలుస్తానని ట్రంప్‌కు పుతిన్ మాటిచ్చారు. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత జెలెన్‌స్కీతో పుతిన్ భేటీకి సమ్మతి తెలపడం శాంతిస్థాపన బాటలో కీలక ముందడుగు. అయితే జెలెన్‌స్కీ, పుతిన్ భేటీ అయ్యాక వెంటనే ఇద్దరు మంచి మిత్రులుగా మారతారని నేను అనుకోవట్లేదు. భేటీ జరిగిందంటే ఏకంగా శాంతి ఒప్పందం కుదిరిందని ఇప్పుడే భావించడం తొందరపాటే అవుతుంది. ఎన్నో అంశాలపై స్పష్టతరావాల్సి ఉంది.
మరెన్నో అంశాలపై విస్తృతస్థాయి చర్చ జరగాల్సి ఉంది. గత మూడున్నరేళ్ల యుద్దకాలంలో రష్యా, ఉక్రెయిన్ ఉన్నతాధికారులు సంయమనంతో మాట్లాడుకున్నదే లేదు. ఈ ధోరణే ఇన్నాళ్లూ రణరంగంలో మరింత రక్తంచిందేలా చేసింది. మరణాలు, మారణహోమాలకు యుద్ధం చిరునామాగా మారింది. కానీ ఇప్పుడు కాస్తంత సుహృద్భావ వాతావరణంలో ఇరు దేశాల ఉన్నతాధికారులు మాటలు కలిపారు. తొలుత పుతిన్, జెలెన్‌స్కీ ముఖాముఖి భేటీ ఉంటుంది. ఇది సత్ఫలితాలనిస్తే ఆ తర్వాత ఇరునేతలకు ట్రంప్ జతకూడుతారు. అప్పుడు త్రైపాక్షిక సమావేశం సాకారమవుతుంది’’అని రూబియో అన్నారు.
ఇరుపక్షాలకు అనువైన చోటే భేటీ: ట్రంప్
జెలెన్‌స్కీ, పుతిన్‌లకు అనువైన ప్రదేశంలోనే త్రైపాక్షిక సమావేశం నిర్వహిస్తామని ట్రంప్ చెప్పారు. ఈ మేరకు ఆయన తన సొంత సోషల్ మీడియా మాధ్యమం ట్రూత్‌సోషల్‌లో ఒక పోస్ట్ పెట్టారు.‘‘సోమవారం మధ్యాహ్నం శ్వేతసౌధానికి విచ్చేసిన విశిష్ట అతిథులతో చక్కని సమావేశం జరిగింది. ఐరోపా సమాఖ్య సభ్యదేశాల అగ్రనేతలతో సంయుక్త భేటీలో ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నాం. త్రైపాక్షిక సమావేశం నిర్వహించాలన్న మా ఉమ్మడి నిర్ణయాన్ని వెంటనే పుతిన్‌కు ఫోన్‌చేసి చెప్పా. ఆయన అందుకు సమ్మతించారు.
త్వరలోనే ఈ భేటీ ఉంటుంది. జెలెన్‌స్కీ, పుతిన్‌కు అనువైన నగరంలోనే తొలుత వాళ్లిద్దరూ సమావేశమవుతారు. ఇది చక్కటి ఫలితాన్నిచ్చాకే నేను వాళ్లతో కలిసి త్రైపాక్షి సమావేశాన్ని నిర్వహిస్తా. ఈ భేటీకి సాకారం చేసేందుకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి రూబియో, నా ప్రత్యేక దూత స్టీవ్ విట్కాఫ్ చెమటోడుస్తున్నారు’’అని ట్రంప్ అన్నారు.