ఉక్రెయిన్‌పై దాడి డాక్యుమెంటరీల ప్రదర్శనకు పుతిన్‌ ఆదేశాలు

Putin Orders Movie Halls To Screen Documentaries Of Ukraine Assault - Sakshi

మాస్కో: సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్‌పై భీకర దాడులు చేస్తూ విధ్వంసాన్ని సృష్టిస్తోంది రష్యా. వేలాది మంది సైనికులను కోల్పోతున్నా వెనక్కి తగ్గటం లేదు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌. ఇప్పటికే సైనిక బలగాల సామర్థ్యాన్ని పెంచుకునేందుకే మొగ్గు చూపిన పుతిన్‌.. తాజాగా జారీ చేసిన ఆదేశాలు చర్చనీయాంశంగా మారాయి. ఉక్రెయిన్‌పై దాడి, నియో-నాజీల భావజాలానికి వ్యతిరేకంగా చేస్తున్న యుద్ధానికి సంబంధించిన డాక్యుమెంటరీలను సినిమా హాళ్లలో ప్రదర్శించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. దాడులు మొదలు పెట్టి ఏడాది కావస్తున్న క్రమంలో ఫిబ్రవరి నాటికి ఈ డాక్యుమెంటరీలను ప్రదర్శించాలని స్పష్టం చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన జారీ చేసింది క్రెమ్లిన్‌. ఫిబ్రవరి 1 నాటికి సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఈ ఆదేశాలను అమలు చేస్తుందని పేర్కొంది. 

ఈ ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్‌లో పాలుపంచుకుని తమ హీరోయిజాన్ని ప్రదర్శించిన వారికి అంకితం చేసే డాక్యుమెంటరీలు తీసేలా పుతిన్‌ ఆదేశించినట్లు క్రెమ్లిన్‌ తెలిపింది. ఆయా సినిమా నిర్మాతలకు సహాయం అందించాలని రక్షణ శాఖకు సూచించినట్లు పేర్కొంది. ఆ దిశగా తీసుకున్న చర్యలపై మార్చి 1 నాటికి నివేదిక సమర్పించాలని రక్షణ మంత్రి సెర్గీ షోయిగూను ఆదేశించారు.  

గత ఏడాది ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై దాడి మొదలు పెట్టి యావత్‌ ప్రపంచాన్ని షాక్‌కు గురి చేశారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌. పశ్చిమ ప్రాంత అనుకూల దేశంలో నిరాయుధీకరణ, నాజీ భావజాలం కట్టడి అంటూ ఈ సైనిక చర్య చేపట్టారు. ఈ దాడి చెపట్టినప్పటి నుంచి రష్యాలోని అధికార టీవీ ఛానళ్లు.. తమ సైనిక బలగాలను పొగుడుతూ పలు కార్యక్రమాలను ప్రదర్శిస్తూ వస్తున్నాయి. మరోవైపు.. స్వతంత్ర మీడియా సంస్థలు మూసివేశారు. జర్నలిస్టులు దేశం దాటి వెళ్లిపోయారు. ఉక్రెయిన్‌పై దాడిని ఎవరైనా విమర్శిస్తే జైలు శిక్ష విధించేలా ఆదేశాలు జారీ చేశారు.

ఇదీ చదవండి: Russia-Ukraine war: ఒక్క క్షిపణితో 400 మంది హతం !

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top