Russia-Ukraine war: ఒక్క క్షిపణితో 400 మంది హతం !

Russia-Ukraine war: Donetsk attack kills dozens of Russian soldiers - Sakshi

డోనెట్స్‌క్‌లో దాడిలో రష్యా సైనికుల్ని చంపామన్న ఉక్రెయిన్‌

కీవ్‌: దురాక్రమణకు దిగిన రష్యా సేనలను క్షిపణి దాడుల్లో అంతమొందించే పరంపర కొనసాగుతోందని ఉక్రెయిన్‌ ప్రకటించింది. డోనెట్స్‌క్‌ ప్రాంతంలో తమ సేనలు జరిపిన భారీ క్షిపణి దాడిలో ఏకంగా 400 మంది రష్యా సైనికులు చనిపోయారని ఉక్రెయిన్‌ పేర్కొంది. ఈ దాడిలో మరో 300 మంది గాయపడ్డారని తెలిపింది. అయితే 63 మంది సైనికులే మరణించారని రష్యా స్పష్టంచేసింది. మకీవ్కా సిటీలో ఆదివారం అర్ధరాత్రి ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఒక పెద్ద భవంతిలో సేదతీరుతున్న రష్యా సైనికులే లక్ష్యంగా ఉక్రెయిన్‌ క్షిపణి దాడి జరిగింది. అమెరికా సరఫరా చేసిన హిమార్స్‌ రాకెట్లను ఆరింటిని ఉక్రెయిన్‌ సేనలు ప్రయోగించగా రెండింటిని నేలకూల్చామని మిగతావి భవనాన్ని నేలమట్టంచేశాయని రష్యా సోమవారం తెలిపింది.

భవనంలోని సైనికులు ఇంకా యుద్ధంలో నేరుగా పాల్గొనలేదని, ఇటీవల రష్యా నుంచి డోనెట్స్‌క్‌కు చేరుకున్నారని, అదే భవనంలో యుద్ధంతాలూకు పేలుడుపదార్థాలు ఉండటంతో విధ్వంసం తీవ్రత పెరిగిందని స్థానిక మీడియా తెలిపింది. మరోవైపు, డోనెట్స్‌క్‌లో దాడి తర్వాత ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌పై రష్యా మరోసారి డ్రోన్లకు పనిజెప్పింది. కీలకమైన మౌలిక వ్యవస్థలపై సోమవారం 40 డ్రోన్లు దాడికి యత్నించగా అన్నింటినీ కూల్చేశామని కీవ్‌ మేయర్‌ విటలీ క్లిష్‌చెకో చెప్పారు.  కీవ్‌ ప్రాంతంలో కీలక మౌలిక వ్యవస్థలు, జనావాసాలపై డ్రోన్‌ దాడులు సోమవారం సైతం కొనసాగాయని కీవ్‌ ప్రాంత గవర్నర్‌ కుబేలా చెప్పారు.
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top