భారత్‌కు ప్రొటీన్‌ ఆధారిత టీకా ఉత్తమం

Protein-based COVID-19 vaccine candidates would be more suitable for India - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌లోని వాతావరణ పరిస్థితులు, ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రొటీన్‌ ఆధారిత కోవిడ్‌ వ్యాక్సిన్‌ ఉత్తమమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భద్రత, ధర, దిగుమతికి, నిల్వకు అందుబాటులో ఉన్న అవకాశాలను బట్టి వ్యాక్సిన్‌ను ఎంపిక చేసుకోవాలని సూచిస్తున్నారు. అమెరికాకు చెందిన నోవావాక్స్‌ సంస్థ అభివృద్ధి చేస్తున్న కరోనా టీకాను అధిక ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేస్తేనే ప్రభావవంతంగా పని చేస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

ప్రస్తుతం ఫైజర్‌–బయోఎన్‌టెక్, మోడెర్నా వంటి సంస్థలు కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధిలో ముందంజలో ఉన్నాయి. తమ వ్యాక్సిన్‌లు 90 శాతానికి పైగానే ప్రభావవంతంగా పని చేస్తున్నట్లు ఆయా సంస్థలు ప్రకటించాయి. అమెరికాకు చెందిన మోడెర్నా అభివృద్ధిచేస్తున్న టీకాను అత్యల్ప ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాల్సిన అవసరం లేదని, ఇండియాలోని వాతావరణ పరిస్థితులకు ఈ టీకా సరిపోతుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. నోవావాక్స్‌ టీకా భారత్‌లో బాగా పని చేస్తుందని చెబుతున్నారు.

ఫైజర్‌ టీకా సురక్షితం
కరోనా వైరస్‌ను అరికట్టడానికి తాము అభివృద్ధి చేస్తున్న టీకా సురక్షితమేనని 95 శాతం ప్రభావవంతంగా పని చేస్తున్నట్లు చివరి దశ ప్రయోగాల్లో తేటతెల్లమైందని ఫైజర్‌ కంపెనీ బుధవారం వెల్లడించింది. జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్‌ అనే సంస్థతో కలిసి ఫైజర్‌ కరోనా టీకాను అభివృద్ధిచేస్తున్న విషయం తెల్సిందే. 65 ఏళ్ల వయసుపైబడిన వారికి కరోనా ముప్పు అధికం. వీరిలో ఫైజర్‌ టీకా దాదాపు 95 శాతం ప్రభావవంతంగా పని చేస్తున్నట్లు తేలింది. అమెరికాలో తమ వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగం కోసం అతి త్వరలో దరఖాస్తు చేయనున్నట్లు ఫైజర్‌ తెలిపింది. తమ వ్యాక్సిన్‌కు సంబంధించిన పూర్తి డేటాను అమెరికాతోపాటు ప్రపంచ దేశాల్లోని వ్యాక్సిన్‌ నియంత్రణ సంస్థలకు అందజేస్తామని ఫైజర్, బయోఎన్‌టెక్‌ సంయుక్తంగా వెల్లడించాయి.

కోవాగ్జిన్‌ మూడో దశ
ఈ నెల 20 నుంచి హరియాణాలో కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ మూడో దశ ట్రయల్స్‌ ప్రారంభం కానున్నాయి. మూడో దశ ప్రయోగ మొదటి వాలంటీర్‌గా ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి అనిల్‌ విజ్‌ వ్యాక్సిన్‌ ట్రయల్‌ను స్వీకరించనున్నారు. ఆయనతో పాటు మరో 25 సెంటర్లలో 26 వేల మంది వాలంటీర్లు వ్యాక్సిన్‌ ట్రయల్‌ను స్వీకరించనున్నారు. భారత్‌లో ఎక్కువ మంది ట్రయల్స్‌లో పాల్గొంటున్న వ్యాక్సిన్‌ తయారీదారు కోవాగ్జిన్‌ కావడం గమనార్హం. ఈ వ్యాక్సిన్‌ను భారత్‌ బయోటెక్‌.. ఐసీఎంఆర్‌తో  సంయుక్తంగా తయారు చేస్తోంది. తమ వ్యాక్సిన్‌ మొదటి, రెండో దశ ట్రయల్స్‌ విజయవంతంగా పూర్తయ్యాయని వ్యాక్సిన్‌ తయారీ దారులు ఇటీవల వెల్లడించడం తెల్సిందే.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top