మూడోసారి పోటీ చేయను: ట్రంప్‌ | President Donald Trump Rules Out Running For Third Term In 2028 | Sakshi
Sakshi News home page

మూడోసారి పోటీ చేయను: ట్రంప్‌

May 6 2025 5:03 AM | Updated on May 6 2025 5:03 AM

President Donald Trump Rules Out Running For Third Term In 2028

వాన్స్, రూబియో నా వారసులు 

మాగా ఉద్యమం కొనసాగుతుంది

వాషింగ్టన్‌: మూడో దఫా అధ్యక్ష బరిలోకి దిగకూడదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయించుకున్నాన్నారు. మళ్లీ పోటీ చేసే ప్రసక్తే లేదని అధికారికంగా ప్రకటించారు. ఆదివారం ఎన్‌బీసీ మీట్‌ ది ప్రెస్‌ మోడరేటర్‌ క్రిస్టెన్‌ వెల్కర్‌ ఇంటర్వూలో ఆయన మాట్లాడారు. రెండో విడత అనంతరం వైట్‌హౌస్‌ను వీడనున్నట్లు ధ్రువీకరించారు. తాను మొదలు పెట్టిన మేక్‌ అమెరికా గ్రేట్‌ అగైన్‌ (ఎంఏజీఏ) ఉద్యమం మాత్రం కొనసాగుతుందన్నారు. 

దానికి ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో వారసులని ప్రకటించారు. తాను పదవి నుంచి దిగిపోయాక వారికి అమెరికా సమాజం భారీగా మద్దతిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ‘‘వాన్స్‌ అద్భుతమైన, తెలివైన వ్యక్తి. రూబియో గొప్ప వ్యక్తి’’అని ప్రశంసించారు. 2028లో రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యరి్థగా వాన్స్‌కు అవకాశం ఉంటుందా అన్న ప్రశ్నకు బదులిస్తూ, ‘‘ఆ విషయంలో ప్రస్తుత ఉపాధ్యక్షునికి కచ్చితంగా సానుకూలత ఉంటుంది. అతను గొప్పవాడైతే కచ్చితంగా అవకాశం  దక్కుతుందనే అనుకుంటున్నా’’అని బదులిచ్చారు. రూబియోను సైతం ట్రంప్‌ ప్రశంసించారు. 

ట్రంప్‌ రెండో హయాంలో పాలన వ్యవహారాల్లో రూబియో గణనీయ పాత్ర పోషిస్తున్నారు. రూబియో పనితీరు, ఇతర ఫెడరల్‌ ఏజెన్సీలతో ఆయన సమన్వయం చేసుకుంటున్న తీరు తదితరాలను ట్రంప్‌ ప్రస్తావించారు. గతంలో హెన్రీ కిస్సింజర్‌ కూడా ఏకకాలంలో పలు ఉన్నత పదవులను సమర్థంగా నిర్వహించారని గుర్తు చేశారు. అయితే తన వారసుడిని ఇప్పుడే ఎంపిక చేయడం తొందరపాటేనని అభిప్రాయపడ్డారు. ఐక్యతే రిపబ్లికన్‌ పార్టీ బలమని చెప్పుకొచ్చారు.  ఒక వ్యక్తి రెండు కంటే ఎక్కువసార్లు అధ్యక్షుడు కావడాన్ని అమెరికా రాజ్యాంగం నిషేధిస్తోంది. 

అయినా మూడోసారీ అధ్యక్షుడు కావాలని ఉందని ట్రంప్‌ ఇటీవల పలుమార్లు చెప్పారు. 2028లో మళ్లీ పోటీ చేసేందుకు రిపబ్లికన్‌ సభ్యుల నుంచి తనకిప్పటికే ప్రోత్సాహం లభించిందని కూడా చెప్పుకున్నారు. తాను ఉపాధ్యక్ష పదవికి, వాన్స్‌ అధ్యక్ష పదవికి పోటీ చేసి, నెగ్గాక వాన్స్‌ తప్పుకుని తాను తిరిగి పగ్గాలు చేపట్టే అవకాశం కూడా ఉందని ట్రంపే చెప్పారు. దీనిపై పలు విమర్శలూ వచ్చాయి. చర్చోపచర్చలు జరిగాయి. ట్రంప్‌ సొంత ఆన్‌లైన్‌ సంస్థ ఇప్పటికే ‘ట్రంప్‌ 2028’పేరుతో టోపీలు, టీ షర్టులను మార్కెట్లోకి తీసుకొచ్చింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement