ఈజిప్టుకు చేరుకున్న ప్రధాని మోదీ

PM Narendra Modi Arrives In Egypt - Sakshi

కైరో: అమెరికాలో పర్యటన ముగించుకున్న ప్రధాని మోదీ శనివారం ఈజిప్టులో రెండు రోజుల పర్యటనకు గాను కైరో చేరుకున్నారు. కైరో విమానాశ్రయంలో మోదీకి ఈజిప్టు ప్రధానమంత్రి మొస్తాఫా మద్‌బౌలీ ఆలింగనంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం మోదీ సైనిక దళాల గౌరవ వందనం స్వీకరించారు.

ఆయనకు బస ఏర్పాటు చేసిన హోటల్‌ వద్ద..భారత సంతతి ప్రజలు త్రివర్ణ పతాకాలు చేబూని, మోదీ..మోదీ.. వందేమాతరం అంటూ నినాదాలు చేశారు. చీర ధరించిన ఈజిప్టు మహిళ ఒకరు హిందీ సినిమా షోలే లోని ‘యే దోస్తీ హమ్‌ నహీ ఛోడేంగే’పాట పాడుతూ మోదీకి స్వాగతం పలికారు. ఆ గీతం వినగానే ఆశ్చర్యానికి లోనైన మోదీ ఆమెను ప్రశంసించారు. తనకు హిందీ పెద్దగా తెలియదని, భారత్‌కు ఎప్పుడూ వెళ్లలేదని ఆమె చెప్పారు.

మీరు ఈజిప్షియన్‌ అయినా అచ్చు భారతీయ మహిళ మాదిరిగానే ఉన్నారని మోదీ ప్రశంసించారు. కాగా, భారత ప్రధాని ఒకరు ఈజిప్టులో పర్యటించడం 26 ఏళ్లలో ఇదే ప్రథమం. వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకునేందుకు ఇరు దేశాలు ఆసక్తితో ఎదురు చూస్తున్న వేళ జరుగుతున్న ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఆదివారం మోదీ ఈజిప్టు అధ్యక్షుడు ఎల్‌సిసితో భేటీ అవుతారు.

ప్రధాని మద్‌బౌలీ కేబినెట్‌ సభ్యులతో మోదీ రౌండ్‌టేబుల్‌ సమావేశం ఉంటుంది. ఈజిప్టు గ్రాండ్‌ ముఫ్తి డాక్టర్‌ షౌకి ఇబ్రహీం అబ్దెల్‌ కరీం అల్లాం సహా పలువురు ప్రముఖులతో ప్రధాని చర్చలు జరుపుతారు. ఆదివారం ప్రధాని మోదీ కైరోలోని చారిత్రక అల్‌–హకీం మసీదును సందర్శిస్తారని ఈజిప్టులో భారత్‌ రాయబారి అజిత్‌ గుప్తె తెలిపారు. భారత్‌లోని దావూది బోహ్రా తెగ ముస్లింలు ఈజిప్టుకు చెందిన వారే. 11వ శతాబ్దంలో ఈజిప్టును పాలించిన ఫతిమిద్‌ వంశస్తులు అల్‌ హకీం మసీదును నిర్మించారు. బోహ్రా ముస్లింలు, ఈజిప్టు ప్రభుత్వంతో కలిసి చేపట్టిన మసీదు పునరుద్ధరణ పనులు ఇటీవలే పూర్తయ్యాయి.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top