పపువా న్యూ గినియా విషాదం.. | Sakshi
Sakshi News home page

పపువా న్యూ గినియా విషాదం..

Published Tue, May 28 2024 5:27 AM

Papua New Guinea tells the UN that a landslide buried more than 2000 people

మృతుల సంఖ్య 2 వేలపైనే.. 

మెల్‌బోర్న్‌: దక్షిణ పసిఫిక్‌ ద్వీప దేశం పపువా న్యూ గినియా శుక్రవారం కొండచరియలు విరిగి పడిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఎంగా ప్రావిన్స్‌లోని యంబాలి గ్రామంలో చోటుచేసుకున్న ఘటనలో 670 మంది వరకు చనిపోయి ఉంటారని మొదట ఐరాస విభాగం అంచనా వేసింది. అయితే, మట్టిదిబ్బల కింద రెండు వేలమందికి పైగానే గ్రామస్తులు సజీవ సమాధి అయి ఉంటారని పపువా న్యూ గినియా ప్రభుత్వం లెక్కగట్టింది.

 ఈ మేరకు ఐరాసకు సమాచారం పంపింది. ఈ విషాద సమయంలో తమను ఆదుకోవాలంటూ అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేసింది. అయితే, ఐరాస వలసల విభాగం మాత్రం నేలమట్టమైన 150 నివాసాలను పరిగణనలోకి తీసుకునే మృతుల సంఖ్య 670గా నిర్ణయించామని, ప్రభుత్వ గణాంకాలపై మాట్లాడబోమని తెలిపింది. మృతుల సంఖ్యను 2 వేలుగా ఏ ప్రాతిపదికన నిర్ణయించారని ప్రధాని జేమ్స్‌ మరాపేను మీడియా ప్రశ్నించగా ఆయన బదులివ్వలేదు. కాగా, దేశంలో దశాబ్దాలుగా జనగణన జరగలేదు.  

సైన్యం కాపలా మధ్య.. 
గ్రామంలోని 200 మీటర్ల ప్రాంతంలో ఉన్న నివాసాలను 6 నుంచి 8 మీటర్ల మేర భారీ రాళ్లు, చెట్లు, మట్టి భూస్థాపితం చేశాయి. స్థానికులే తమ వ్యవసాయ పరికరాలైన పార, గొడ్డలి వంటి వాటితో వాటిని తొలగిస్తున్నారు. ఇప్పటి వరకు ఆరు మృతదేహాలను మాత్రమే వెలికి తీయగలిగారు. స్థానిక కాంట్రాక్టర్‌ పంపించిన బుల్డోజర్‌తో ఆదివారం నుంచి పని చేయిస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement