కరాచీ: పాకిస్తాన్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. కరాచీ నుంచి పెషావర్‌కు బయలుదేరిన ప్రయాణికుల ఎక్స్‌ప్రెస్ రైలు, పంజాబ్ ప్రావిన్స్‌లోని షేర్ షా సమీపానికి చేరుకోగానే ఒక్కసారిగా పట్టాలు తప్పింది. ఈ పెను ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా 30 మంది తీవ్రంగా గాయపడ్డారు.
భారీ కుదుపుతో రైలుకు చెందిన 14 బోగీలు ట్రాక్ పైనుంచి పక్కకు ఒరిగిపోవడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే బోగీలు చెల్లాచెదురై, ప్రయాణికుల హాహాకారాలు, ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది.
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే రైల్వే యంత్రాంగం, ఎమర్జెన్సీ రెస్క్యూ సిబ్బంది, పారామెడికల్ బృందాలు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. బోగీల శిథిలాల నుంచి మృతదేహాలను వెలికితీసి, తీవ్ర గాయాలపాలైన 30 మందిని తక్షణ చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.
దేశాధినేతల దిగ్భ్రాంతి
ఈ విషాద ఘటనపై పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్య సదుపాయాలు అందించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండి: Russia: ఎలుగుబంట్ల ఊచకోత: 9 నెలల్లో 3,500 హతం!


