Russia: ఎలుగుబంట్ల ఊచకోత: 9 నెలల్లో 3,500 హతం! | Russia Kills 3500 Bears In Nine Months As Food Shortages And Climate Change Drive Them Into Human Settlements | Sakshi
Sakshi News home page

Russia: ఎలుగుబంట్ల ఊచకోత: 9 నెలల్లో 3,500 హతం!

Oct 13 2026 9:56 AM | Updated on Oct 13 2026 11:22 AM

Russia 3500 bears killed 2026

మాస్కో: రష్యాలో 2026 ప్రారంభం నుంచి అక్టోబర్ మొదటి వారం వరకు అంటే తొమ్మిది నెలల వ్యవధిలో సుమారు 3,500 ఎలుగుబంట్లను అధికారులు హతమార్చారు. సైబీరియా నుంచి దేశంలోని సుదూర తూర్పు (ఫార్ ఈస్ట్) ప్రాంతాల వరకు ఈ ఘటనలు భారీగా నమోదయ్యాయి. అధికారిక గణాంకాల ప్రకారం ఒక్క సైబీరియాలోనే దాదాపు 2,200 ఎలుగుబంట్లు, ఫార్ ఈస్ట్ ప్రాంతంలో 1,100కి పైగా ఎలుగుబంట్లను చంపారు. సైబీరియాలోని క్రాస్నోయార్స్క్ రీజియన్‌లో అత్యధికంగా 898 ఎలుగుబంట్లను చంపగా, ఇర్కుట్స్క్‌లో 414, తువాలో 263, ఖకాసియాలో 204 ఎలుగుబంట్లు హతమయ్యాయి. అదే విధంగా ఫార్ ఈస్ట్ ప్రాంతంలోని బుర్యాతియాలో 356, కమ్చట్కాలో 207 ఎలుగుబంట్లను చంపినట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి.

ఈ ఏడాది రష్యాలోని పలు ప్రాంతాల్లో ఎలుగుబంట్లు మానవ ఆవాసాల్లోకి ప్రవేశించి ప్రజలపై విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డాయి. ఈ దాడుల్లో కొందరు పౌరులు ప్రాణాలు కోల్పోవడంతో, మానవ భద్రతకు తీవ్ర ముప్పుగా పరిణమించిన ఎలుగుబంట్లను ఏరివేయాలని అధికారులు నిర్ణయించి కాల్చిచంపారు. ప్రధానంగా అడవుల్లో సహజ సిద్ధంగా దొరికే పండ్లు, బెర్రీలు తగినంతగా లభించకపోవడం, వాతావరణ మార్పులు, తీవ్ర కరువు పరిస్థితుల వల్ల ఆహార కొరత ఏర్పడి అవి గ్రామాలు, పట్టణాల వైపు వస్తున్నాయి. జనావాసాల సమీపంలో బహిరంగంగా పారబోసే వ్యర్థాలు, ఆహార అవశేషాలు వీటిని ఆకర్షిస్తున్నాయి.

ప్రస్తుతం రష్యాలో గోధుమ రంగు ఎలుగుబంట్ల (బ్రౌన్ బేర్స్) సంఖ్య భారీగా పెరిగింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం దేశంలో వీటి జనాభా దాదాపు 3.08 లక్షలకు చేరగా, గత 30 ఏళ్ల కాలంలోనే ఈ సంఖ్య రెట్టింపు కంటే ఎక్కువైంది. ఈ నేపథ్యంలో మానవులకు, వన్యప్రాణులకు మధ్య జరుగుతున్న ఈ ఘర్షణలను నివారించేందుకు వేట నిబంధనలను సవరించడంతో పాటు వాటి జనాభాను నియంత్రించే ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. అయితే కేవలం ఎలుగుబంట్లను చంపడమే పరిష్కారం కాదని, అడవుల పర్యావరణ సమతుల్యతను కాపాడుతూనే వ్యర్థాల నిర్వహణ సరిగ్గా చేపట్టడం, ప్రజలకు రక్షణ మార్గదర్శకాలు అందించడం అత్యవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి: రామ్‌లీలా వివాదం: ముగ్గురి దారుణ హత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement