పిలిభిత్: ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ జిల్లా అమరియా పట్టణంలో రామ్‌లీలా ఉత్సవాల ఖర్చుల లెక్కల విషయంలో తలెత్తిన వివాదం రక్తపాతానికి దారితీసింది. కమిటీ సమావేశంలో జరిగిన ఘర్షణలో దుండగులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతులను అంకిత్ గుప్తా, ఆయన సోదరుడు మోహిత్ గుప్తా, 15 ఏళ్ల కునాల్ శ్రీవాస్తవగా గుర్తించారు.
సోమవారం రాత్రి సుమారు 9:30 గంటల సమయంలో రామ్‌లీలా కమిటీ సమావేశం జరిగింది. ఉత్సవాల పాత లెక్కలు, నిధుల లావాదేవీల ఒప్పందాలపై రెండు వర్గాల మధ్య మాటామాటా పెరిగి తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో వివాదం హింసాత్మకంగా మారి ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు.
గొడవ ముదరడంతో లైసెన్స్డ్ రైఫిల్, ఇతర ఆయుధాలతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అంకిత్ గుప్తా, కునాల్ శ్రీవాస్తవ సంఘటనా స్థలంలోనే మృతి చెందగా, తీవ్ర గాయాలపాలైన మోహిత్ గుప్తా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
సమాచారం అందుకున్న ఎస్పీ సుకీర్తి మాధవ్ ఆధ్వర్యంలో పోలీసులు రంగంలోకి దిగి ప్రధాన నిందితుడితో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలం నుంచి ఒక లైసెన్స్డ్ రైఫిల్, అక్రమ ఆయుధం, కర్రలను స్వాధీనం చేసుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం భారీగా బలగాలను మోహరించి, ఫోరెన్సిక్ ఆధారాలతో కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: మైసూరు జంబూ సవారీ చూడాలంటే.. జేబుకు చిల్లే..


