కరాచీలోని 'గుల్ షాపింగ్ ప్లాజా'లో శనివారం(జనవరి 17) సంభవించిన భారీ అగ్నిప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. సంఘటన స్థలంలో వరుసగా ఐదో రోజు కూడా సహాయక చర్యలు కొనసాగాయి. సహయక సిబ్బంది గురువారం పదుల సంఖ్యలో శిథిలాల నుంచి మృతదేహాలను వెలికితీశారు. దీంతో ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 67కు చేరింది.
ఒకే చోట 30 మంది..
సహాయక చర్యల్లో భాగంగా గుల్ షాపింగ్ ప్లాజా మెజానైన్ అంతస్తులోని 'దుబాయ్ క్రాకరీ' అనే షాప్ షట్టర్లు తెరిచిన సిబ్బంది షాకయ్యారు. ఒకే చోట 30 మృతదేహాలు లభ్యమయ్యాయి. మంటల నుంచి తప్పించుకోవడానికి వీరంతా షాపు లోపలికి వెళ్లి తలుపులు వేసుకున్నారని, అయితే బయట దట్టంగా అలుముకున్న పొగ కారణంగా ఊపిరాడక లోపలే ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు.
అయితే ఈ విషాధ సంఘటనలో మరణించిన వారిని గుర్తించడం అధికారులకు పెద్ద సవాల్‌గా మారింది. ఇప్పటివరకు లభ్యమైన 61 మృతదేహాలలో, కేవలం 12 మంది మాత్రమే గుర్తించినట్లు సింధ్ పోలీస్ సర్జన్ డాక్టర్ ఒకరు తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
అదేవిధంగా ఈ భవనంలో భద్రత లోపాలు అధికారులు గుర్తించారు. భవనంలో మొత్తం 16 ఎగ్జిట్ గేట్లు ఉండగా, ప్రమాద సమయంలో 14 గేట్లు మూసివేసి ఉండటం వల్ల ప్రాణనష్టం పెరిగిందని ప్రాథమిక విచారణలో తేలింది. ఇంకా దాదాపు 85 మందికి పైగా ఆచూకీ లభ్యం కాలేదు. కాగా మృతుల కుటుంబాలకు సింధ్ ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ. కోటి (10 మిలియన్లు) పరిహారం ప్రకటించింది.


