
న్యూఢిల్లీ: భారతదేశ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులలో ఒకడైన మసూద్ అజార్ ఎక్కడున్నాడనే విషయంపై పాక్ మరోమారు కల్లబొల్లి కబుర్లు చెప్పింది. అజార్ గురించి తమకేమీ తెలియదని వివరించే ప్రయత్నం చేసింది. కాగా భారత్.. ఆపరేషన్ సింధూర్ నిర్వహిస్తున్న సమయంలో అజార్‌తో పాటు అతని సంస్థ జైష్-ఎ-ముహమ్మద్ ప్రధాన కార్యాయాన్ని టార్గెట్ చేసింది. తాజాగా పాక్ సంకీర్ణ నేత బిలావల్ భుట్టో జర్దారీ ఉగ్రవాది మసూద్ అజార్‌కు సంబంధించిన సమాచారంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
మసూద్ అజార్ 2001లో భారత పార్లమెంటుపై దాడి, 26/11 ముంబై దాడులు, 2016 పఠాన్‌కోట్ దాడి, 2019లో జరిగిన పుల్వామా దాడిలో పాల్గొన్నాడు. 2019లో ఐక్యరాజ్యసమితి.. అజార్‌ను ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించింది. 1999లో కాందహార్ హైజాక్ తర్వాత ప్రయాణీకులకు బదులుగా అతన్ని విడుదల చేశారు. కాగా అజార్, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌లను అప్పగించాలని భారతదేశం ఎప్పటినుంచో పాకిస్తాన్‌ను డిమాండ్ చేస్తూ వస్తోంది. పాక్‌లో మసూద్ అజార్ తలదాచుకుంటున్నాడనే ఆధారాలు ఉన్నప్పటికీ పాకిస్తాన్ తనకేమీ తెలియదంటూ కల్లబొల్లి మాటలు చెబుతోంది.
తాజాగా అల్ జజీరాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) అధినేత బిలావల్ భుట్టో జర్దారీ మాట్లాడుతూ.. జైష్ ఎ మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ ఎక్కడ ఉన్నాడో పాకిస్తాన్‌కు తెలియదని, అతను ఇక్కడే ఉన్నాడని భావిస్తున్న భారత్.. అతనిని అరెస్టు చేయాలని అనుకుంటోందని అన్నారు. సయీద్ స్వేచ్ఛగా ఉన్నాడా? అని ఆయనను మీడియా అడగగా.. దీనికి ఖచ్చితంగా అవునని సమాధానం చెప్పలేమని, అతను పాకిస్తాన్ అదుపులో లేడని, తాము అతనిని అరెస్టు చేయలేకపోయామని, ఎక్కడున్నాడో కూడా గుర్తించలేకపోయామని కూడా భుట్టో అన్నారు. అయితే అతని గత చరిత్రను అనుసరించి చూస్తే, ప్రస్తుతం మసూద్ అజార్ ఆఫ్ఘనిస్తాన్‌లో తలదాచుకున్నడని భావిస్తున్నామని అన్నారు.
పహల్గామ్ దాడి, ఆపరేషన్ సిందూర్‌ల అనంతరం భుట్టో చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ పలు ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. వాటిలో మురిద్కేలోని లష్కరే తోయిబా ప్రధాన కార్యాలయం, బహవల్‌పూర్‌లోని జైషే-ఏ-మహ్మద్ ప్రధాన కార్యాలయం ఉన్నాయి. కాగా భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంపై పీపీపీ చీఫ్ స్పందిస్తూ, పాకిస్తాన్‌కు సింధు నీటిని నిరాకరిస్తే యుద్ధానికి దిగుతామని హెచ్చరించారు. సింధు నది తమదేనని ఆయన అన్నారు.