
ఢిల్లీ: ఉద్రిక్తతలను పెంచే ఉద్దేశ్యం భారత్‌కు లేదని.. పాక్ నిర్ణయించుకుంటే మాత్రం ప్రతీకారం తీర్చుకుంటామంటూ భారత భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తేల్చి చెప్పారు. అమెరికా, బ్రిటన్, సౌదీ అరేబియా, జపాన్ ఎన్‌ఎస్‌ఏలతో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. రష్యా, ఫ్రాన్స్ దేశాల ప్రతినిధులతో దోవల్ చర్చించారు. ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం దాడులు జరిపిన సంగతి తెలిసిందే.
ఈ విషయంపై ఇతర దేశాల మద్దతు కూడగట్టే క్రమంలో అమెరికా, బ్రిటన్, సౌదీ అరేబియా, జపాన్, రష్యా, ఫ్రాన్స్ దేశాల భద్రతా సలహాదారులు, కార్యదర్శులతోచర్చించారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్‌పై తీసుకున్న చర్యలు.. ఆపరేషన్ నిర్వహించడానికి గల కారణాలను ఆ దేశాల ప్రతినిధులకు వివరించారు.
కాగా, పహల్గాం దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట పీవోకేతో పాటు పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ వైమానిక దాడులు జరిపింది. మొత్తం 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ దాడిలో దాదాపు 30 మంది ఉగ్రవాదులు మృతి చెందారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని కోట్లి, ముజఫరాబాద్, పంజాబ్‌లోని బహవల్‌పూర్‌తో పాటు లాహోర్ లోని ఒక ప్రదేశంపై భారత్ క్షిపణి దాడులు జరిపింది. ఈ సందర్భంగా ‘ఎయిర్ టు సర్ఫేస్’ మిసైళ్లను ప్రయోగించారు.
దాడి అనంతరం ‘న్యాయం జరిగింది.. జైహింద్’ అంటూ భారత్ సైన్యం ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. ఇవి సర్జికల్ స్ట్రైక్స్ కాదు. భారత భూభాగంనుంచే అత్యంత కచ్చితత్వంతో చేసిన దాడులని వెల్లడించింది. పహల్గాందాడిలో ఉగ్రవాదులు పురుషులను మాత్రమే ఎంచుకుని కాల్చి చంపి ఎందరో మహిళల నుదుటి సిందూరం తుడిచేసిన కారణంగానే ఆపరేషన్‌కు ‘సిందూర్’ అని నామకరణం చేశారు. మసూద్ అజర్, హఫీజ్ సయీద్ ప్రధాన స్థావరాలు లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని తెలుస్తోంది. భారత దాడి అనంతరం పాకిస్తాన్‌లో ఎమర్జెన్సీ ప్రకటించారు. విమానాశ్రయాలు మూసివేశారు.