
అగ్రరాజ్యపు ప్రముఖ నగరంలో జరిగిన కాల్పుల ఘటన ప్రపంచాన్ని నివ్వెర పోయేలా చేసింది. న్యూయార్క్ మిడ్‌టౌన్ మాన్‌హటన్ ప్రాంతంలోని ఓ బహుళ అంతస్తుల భవనంలోకి తుపాకీతో ప్రవేశించిన దుండగుడు రెచ్చిపోయాడు. ఈ కాల్పుల్లో ఓ పోలీస్ అధికారి సహా నలుగురు మృతి చెందారు. అయితే.. ఉద్యోగులు సమయస్ఫూర్తితో చాకచక్యంగా వ్యవహరించి ఉండకపోతే పెను ప్రాణ నష్టమే సంభవించి ఉండేదని తెలుస్తోంది.
345 పార్క్ అవెన్యూలో.. పలు ప్రముఖ సంస్థల కార్యకలాపాలు జరుగుతున్నాయి. అక్కడి కాలమానం ప్రకారం.. సోమవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో కాల్పుల ఘటన చోట చేసుకుంది. ఆ సమయంలో కాల్పుల శబ్దాలు విన్న మిగతా ఉద్యోగులు.. బయట ఏం జరుగుతుందో అనే ఆందోళనకు గురయ్యారు. వెంటనే తేరుకుని తలుపులను బిగించుకున్నారు. సోఫాలు, కుర్చీలు, చేతికి దొరికిన ఫర్నీచర్‌ను తలుపులకు అడ్డుగా పెట్టుకున్నారు. కొంత మంది తమ డెస్కులను లాక్కెళ్లి అడ్డంగా పెట్టారు.
BREAKING: Photo from inside the Blackstone office pic.twitter.com/8DeVVbX5CD
— Exec Sum (@exec_sum) July 29, 2025
మేము పని ముగించుకుని బయలుదేరేందుకు సిద్ధమవుతున్న సమయంలో, పబ్లిక్ అడ్రస్ ద్వారా ‘shelter in place’ అని హెచ్చరించారు అని షాద్ సాకిబ్ అనే ఉద్యోగి తెలిపారు. జెస్సికా చెన్ అనే ఉద్యోగి మాట్లాడుతూ.. మేము ప్రెజెంటేషన్ చూస్తున్న సమయంలో, ఒక్కసారిగా కాల్పుల శబ్దాలు వినిపించాయి. వెంటనే టేబుళ్లను తలుపు దగ్గర బారికేడ్ చేశాం అని తెలిపింది. ‘‘ఇది భయంకరమైన అనుభం.. దాడి చేస్తూ అతను(దుండగుడు)పైకి వెళ్లాడు. ప్రాణాలు అరచేతపట్టుకుని వణికిపోయాం’’ అని ఓ మహిళా ఉద్యోగి తెలిపారు. మరో 9/11 దాడి జరుగుతుందేమోనని వణికిపోయాం అని మరికొందరు చెప్పడం గమనార్హం.
దుండగుడు ఎవరంటే..
కాల్పుల్లో పోలీస్ అధికారి సహా నలుగురిని దుండగుడు హతమార్చాడు. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆ తర్వాత 33వ అంతస్తులోకి వెళ్లిన దుండగుడు.. తనను తాను కాల్చుకుని చనిపోయాడు. దుండగుడిని లాస్ వెగాస్ నెవెడాకు చెందిన షేన్ తమురా(27)గా గుర్తించారు. గ్రెనాడా హిల్స్ హై స్కూల్‌లో ఫుట్‌బాల్ ప్లేయర్‌గా ఉన్నాడు. లాస్ వెగాస్‌లోనే ఒక క్యాసినోలో సెక్యూరిటీ గార్డుగా పనిచేశాడు. 2022 జూన్ 14న గన్ లైసెన్స్ పొందాడు.
దాడి సమయంలో AR-15 రైఫిల్, బుల్లెట్ రెసిస్టెంట్ వెస్ట్ ధరించి ఉంచడం గమనార్హం. నిందితుడికి సంబంధించిన నెవాడా నంబర్ ప్లేట్ ఉన్న BMW కారులో రైఫిల్, రివాల్వర్, మందులు, మ్యాగజైన్లు లభించాయి. న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ప్రకటన ప్రకారం.. తమురాకు మానసిక సమస్యలు ఉన్నాయి. అయితే ఈ భవనాన్ని లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడ్డాడనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
సూపర్ హీరో దిదారుల్ ఇస్లాం
షేన్ తమురా జరిగిన కాల్పుల్లో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు మృతి చెందారు. చనిపోయిన వ్యక్తి.. ఎన్‌వైపీడీ పోలీస్ అధికారి దిదారుల్ ఇస్లాం. దుండగుడిని అడ్డుకునే క్రమంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. అయితే మూడేళ్ల కిందటి దాకా ఈయన బంగ్లాదేశ్ శరణార్థి. విధుల్లో చేరినప్పటి నుంచి నిబద్ధతతో పని చేస్తున్నారు. ఈయనకు భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. ప్రస్తుతం భార్య 8 నెలల గర్భవతిగా ఉంది. దిదారుల్ నిజమైన న్యూయార్కర్. దేవుడిని నమ్మే వ్యక్తి. ఆయన రియల్ హీరో అంటూ న్యూయార్క్ మేయర్ ఎరిక్ అడమ్స్ ఓ ప్రకటన విడుదల చేశారు. దిదాఉల్ నగరాన్ని రక్షించేందుకు ప్రాణ త్యాగం చేశారు. ఆయన సేవలను ఎప్పటికీ గౌరవిస్తాం అని NYPD కమిషనర్ జెస్సికా టిష్ తెలిపారు. తాజా ఘటన.. ఈ సంవత్సరం అమెరికాలో జరిగిన 254వ సామూహిక కాల్పుల ఘటనగా కావడం గమనార్హం.