McDonald's: ముప్పై ఏళ్ల బంధానికి ముగింపు.. రష్యా నుంచి మెక్‌డొనాల్డ్స్‌ నిష్క్రమణ

McDonalds To Exit Russian Market Permanently - Sakshi

మాస్కో: అమెరికా ఫాస్ట్‌ ఫుడ్‌ దిగ్గజం మెక్‌డొనాల్డ్స్‌ కీలక ప్రకటన చేసింది. రష్యా మార్కెట్‌ నుంచి పూర్తిస్థాయిలో శాశ్వతంగా నిష్క్రమిస్తున్నట్లు సోమవారం ప్రకటించేసింది. ముప్ఫై ఏళ్ల బంధానికి ముగింపు పలుకుతున్నట్లు ఓ ప్రకటనలో మెక్‌డొనాల్డ్స్‌ కార్పొరేషన్‌ వెల్లడించింది.

ఉక్రెయిన్‌ పరిణామాల తర్వాత ఆంక్షల నేపథ్యంలో.. రష్యా ఒంటరి అయిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పాశ్చాత్య దేశాలకు చెందిన బోలెడు కంపెనీలు రష్యాను వీడాయి. తాజాగా ఫ్రెంచ్‌ ఆటోమేకర్‌ రెనాల్డ్‌ తమ రష్యా ఆస్తుల్ని.. మాస్కో​ ప్రభుత్వానికి అప్పజెప్తున్నట్లు ప్రకటించింది కూడా. ఈ తరుణంలో.. మెక్‌డొనాల్డ్స్‌ మార్చి నెలలోనే రష్యా వ్యాప్తంగా ఉన్న 850 రెస్టారెంట్‌లను మూసేసింది.

దీంతో 62 వేల మందికి పని లేకుండా పోయింది. అయితే ఈ సంక్షోభ పరిణామంపై తాజాగా సోమవారం మరో ప్రకటన విడుదల చేసింది. రష్యా మార్కెట్‌ నుంచి పూర్తిగా వైదొలుగుతున్నట్లు పేర్కొంది. అంతేకాదు.. అక్కడి మార్కెట్‌ను స్థానిక ఫుడ్‌ ఫ్రాంచైజీలకు అమ్మేయనున్నట్లు తెలిపింది. అంతేకాదు ఇకపై మెక్‌డొనాల్డ్స్‌ అనే బ్రాండ్‌ రష్యాలో కనిపించబోదని స్పష్టం చేసింది. ఉద్యోగులకు, సప్లయర్లకు ఈ నిర్ణయం కష్టతరంగానే ఉండొచ్చని తెలిపింది.

32 ఏళ్లుగా మెక్‌డొనాల్డ్స్‌ ఫ్రాంచైజీలు రష్యాలో కొనసాగుతూ వస్తున్నాయి. ఒకానొక టైంలో అక్కడి ఫుడ్‌ ఫ్రాంచైజీలను మెక్‌డొనాల్డ్స్‌ డామినేట్‌ చేసింది కూడా.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top