breaking news
McDonalds Corporation
-
Russia: రష్యాకు మెక్‌డొనాల్డ్స్ గుడ్‌బై
మాస్కో: అమెరికా ఫాస్ట్ ఫుడ్ దిగ్గజం మెక్‌డొనాల్డ్స్ కీలక ప్రకటన చేసింది. రష్యా మార్కెట్ నుంచి పూర్తిస్థాయిలో శాశ్వతంగా నిష్క్రమిస్తున్నట్లు సోమవారం ప్రకటించేసింది. ముప్ఫై ఏళ్ల బంధానికి ముగింపు పలుకుతున్నట్లు ఓ ప్రకటనలో మెక్‌డొనాల్డ్స్ కార్పొరేషన్ వెల్లడించింది. ఉక్రెయిన్ పరిణామాల తర్వాత ఆంక్షల నేపథ్యంలో.. రష్యా ఒంటరి అయిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పాశ్చాత్య దేశాలకు చెందిన బోలెడు కంపెనీలు రష్యాను వీడాయి. తాజాగా ఫ్రెంచ్ ఆటోమేకర్ రెనాల్డ్ తమ రష్యా ఆస్తుల్ని.. మాస్కో ప్రభుత్వానికి అప్పజెప్తున్నట్లు ప్రకటించింది కూడా. ఈ తరుణంలో.. మెక్‌డొనాల్డ్స్ మార్చి నెలలోనే రష్యా వ్యాప్తంగా ఉన్న 850 రెస్టారెంట్లను మూసేసింది. దీంతో 62 వేల మందికి పని లేకుండా పోయింది. అయితే ఈ సంక్షోభ పరిణామంపై తాజాగా సోమవారం మరో ప్రకటన విడుదల చేసింది. రష్యా మార్కెట్ నుంచి పూర్తిగా వైదొలుగుతున్నట్లు పేర్కొంది. అంతేకాదు.. అక్కడి మార్కెట్‌ను స్థానిక ఫుడ్ ఫ్రాంచైజీలకు అమ్మేయనున్నట్లు తెలిపింది. అంతేకాదు ఇకపై మెక్‌డొనాల్డ్స్ అనే బ్రాండ్ రష్యాలో కనిపించబోదని స్పష్టం చేసింది. ఉద్యోగులకు, సప్లయర్లకు ఈ నిర్ణయం కష్టతరంగానే ఉండొచ్చని తెలిపింది. 32 ఏళ్లుగా మెక్‌డొనాల్డ్స్ ఫ్రాంచైజీలు రష్యాలో కొనసాగుతూ వస్తున్నాయి. ఒకానొక టైంలో అక్కడి ఫుడ్ ఫ్రాంచైజీలను మెక్‌డొనాల్డ్స్ డామినేట్ చేసింది కూడా. -
బ్లూచిప్స్ వీక్- యూఎస్ మార్కెట్లు డౌన్
ప్రధానంగా బ్లూచిప్ స్టాక్స్ నష్టపోవడంతో మంగళవారం యూఎస్ మార్కెట్లు నీరసించాయి. డోజోన్స్ 205 పాయింట్లు(0.8 శాతం) బలహీనపడి 26,379కు చేరగా.. ఎస్అండ్పీ 21 పాయింట్ల(0.7 శాతం) వెనకడుగుతో 3,218 వద్ద ముగిసింది. ఇక నాస్డాక్ మరింత అధికంగా 134 పాయింట్లు(1.3 శాతం) క్షీణించి 10,402 వద్ద నిలిచింది. రెండు రోజులపాటు నిర్వహించిన పాలసీ సమీక్షా నిర్ణయాలను నేడు కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ ప్రకటించనుంది. కరోనా వైరస్ విస్తృతి నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థకు దన్నుగా ఫెడ్ సరికొత్త ప్యాకేజీపై స్పందించవచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. జూన్‌లో నిరుద్యోగిత పెరగడం, జులైలో వినియోగ విశ్వాస సూచీ డీలాపడటం వంటి అంశాల నేపథ్యంలో ఫెడ్ నిర్ణయాలకు ప్రాధాన్యత ఏర్పడినట్లు నిపుణులు పేర్కొన్నారు. ప్యాకేజీ ఇలా కోవిడ్-19 ప్రభావంతో సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలకు దన్నుగా రిపబ్లికన్స్ ట్రిలియన్ డాలర్ల సహాయక ప్యాకేజీని ప్రతిపాదిస్తున్నారు. దీనిలో భాగంగా నిరుద్యోగులకు 1200 డాలర్ల చొప్పున ప్రత్యక్ష చెల్లింపులకు ప్రతిపాదించారు. ఇదే విధంగా చిన్నతరహా బిజినెస్‌లకు రుణాలకింద 60 బిలియన్ డాలర్లు విడుదల చేయాలని సూచించారు. ఈ బాటలో స్కూళ్లకు 100 బిలియన్ డాలర్లు కేటాయించారు. అయితే ప్యాకేజీ అంశంపై రిపబ్లికన్స్, డెమక్రాట్ల మధ్య చర్చలు అంత త్వరగా కొలిక్కివచ్చే అవకాశంలేదని విశ్లేషకులు పెదవి విరుస్తుండటం గమనార్హం! ఫలితాల ఎఫెక్ట్ ఈ బుధ, గురువారాలలో టెక్నాలజీ దిగ్గజాలు యాపిల్, అల్ఫాబెట్, అమెజాన్, ఫేస్బుక్ క్యూ2(ఏప్రిల్-జూన్) ఫలితాలు ప్రకటించనున్నాయి. ఆటో దిగ్గజం టెస్లా ఇంక్ 4 శాతం పతనంకాగా.. యాపిల్, నెట్‌ఫ్లిక్స్ 1.5 శాతం చొప్పున డీలాపడ్డాయి. దీంతో నాస్డాక్ నీరసించినట్లు విశ్లేషకులు తెలియజేశారు. కాగా.. క్యూ2లో ఫలితాలు నిరాశపరచడంతో డైవర్సిఫైడ్ దిగ్గజం 3ఎం కంపెనీ 5 శాతం పతనంకాగా.. సేమ్ స్టోర్ అమ్మకాలు నీరసించడంతో ఫాస్ట్‌ఫుడ్ చైన్ కంపెనీ మెక్‌డొనాల్డ్స్ కార్ప్ 2.5 శాతం క్షీణించింది. అయితే ఫార్మా దిగ్గజం ఫైజర్ ఇంక్ షేరు 4 శాతం జంప్‌చేసింది. కోవిడ్-19కు వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో పూర్తిఏడాదికి పటిష్ట గైడెన్స్‌ను ప్రకటించడం ప్రభావం చూపినట్లు నిపుణులు పేర్కొన్నారు. -
ఏ ఉద్యోగమూ తక్కువ కాదు!
ప్రేరణ ఆన్లైన్ కొనుగోళ్ల వెబ్సైట్ అమెజాన్ డాట్ కామ్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, అమెరికన్ హాస్యనటుడు జే లెనో, మెక్‌డోనాల్డ్స్ కార్పొరేషన్ ముఖ్య కార్యనిర్వహణాధికారి(సీఈఓ) జాక్ స్కిన్నర్ల మధ్య ఉన్న సారూప్యం ఏమిటో తెలుసా? వారు తమ కెరీర్‌ను మెక్‌డోనాల్డ్స్ రెస్టారెంట్లో ప్రారంభించారు. ప్రారంభంలో వారు అందులో చిన్నచిన్న ఉద్యోగాలు చేసుకుంటూ పొట్టపోసుకున్నారు. మనదేశంలో అలాంటి పరిస్థితిని ఊహించగలమా? ఇక్కడ చాలామందికి చిన్న ఉద్యోగాలంటే ఏమాత్రం ఇష్టం ఉండదు. తమ స్థాయికి తగ్గ కొలువులే కావాలని కోరుకుంటారు. సవాళ్లను ఎదుర్కోవాలంటే భయపడతారు. జీవితం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోవాలని అనుకుంటారు. జెఫ్ బెజోస్, జే లెనో, జాక్ స్కిన్నర్ల నుంచి భారత్‌లోని యువతరం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ఎదురుచూపులకు స్వస్తి పలకండి నేటి యువత తమకు ‘సరైన’ ఉద్యోగమే రావాలని కోరుకుంటున్నారు. వస్తున్న ఉద్యోగాలు వారికి నచ్చడం లేదు. అవి చాలా తక్కువ స్థాయి జాబ్లని, అందులో ఎక్కువ జీతం రాదనేది వారి ఫిర్యాదు. కాబట్టి పెద్ద కొలువు కోసమే ఎదురు చూస్తున్నారు. కెరీర్ ప్రారంభంలోనే ఆశించిన జాబ్ రావాలంటే చాలా కష్టం. నేడు విజయవంతమైన వ్యక్తులెందరో ప్రారంభంలో దిగువ స్థాయి ఉద్యోగాలు చేసుకుంటూ పైకొచ్చినవారే. అలాంటి ఉద్యోగాలే వారి ఉన్నతికి తోడ్పడ్డాయి. కాబట్టి ఎదురుచూపులకు ఇకనైనా స్వస్తి పలకండి. మీకు వచ్చిన ఏదో ఒక ఉద్యోగంలో వెంటనే చేరిపోండి. బద్ధకాన్ని వదిలి, పని ప్రారంభించండి. పనిలో నిరాసక్తత వద్దు బర్గర్లు సరఫరా చేసే రెస్టారెంట్లో ఎక్కువ కాలం పనిచేయాలంటే ఎవరికైనా విసుగు అనిపిస్తుంది. చాలా ఉద్యోగాల్లోనూ ఇలాంటి పరిస్థితే ఉంటుంది. నేటి యువతీ యువకులు చాలా త్వరగా బోర్ ఫీలవుతుంటారు. వెంటనే మార్పును కోరుకుంటారు. లాంగ్‌టర్మ్‌లో సక్సెస్ సాధించాలంటే క్రమశిక్షణ ఎంతో ముఖ్యం. అప్పగించిన పనిని సమర్థంగా పూర్తిచేయగలగాలి. నిరాసక్తత కలగకుండా చూసుకోవాలి. మెక్ డోనాల్డ్స్‌లో పనిచేసేటప్పుడు జెఫ్ బెజోస్ ప్రతిరోజూ కనీసం 300 కోడిగుడ్లను పగలగొట్టి, బర్గర్లు తయారు చేయాల్సి వచ్చేది. అయినా బెజోస్ ఎక్కడా నిరాశ చెందలేదు. ఇచ్చిన పనిని ఉత్సాహంగా చేసేవాడు. తర్వాత రోజూ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది లావాదేవీలను కొనసాగించే అమెజాన్ డాట్ కామ్ వెబ్‌సైట్‌ను ప్రారంభించాడు. ఈ వెబ్సైట్ విజయం వెనుక మెక్‌డొనాల్డ్స్‌లో నేర్చుకున్న పని అనుభవం అతడికి ఎంతగానో ఉపయోగపడింది. చిన్నచిన్న పనులను సైతం సమర్థంగా పూర్తిచేయగల లక్షణం వెలకట్టలేనిది. కస్టమర్ చెప్పిందే రైట్! ఒక సంస్థలో మీరు నిర్వర్తిస్తున్న పాత్ర ఎలాంటిదైనా కావొచ్చు. వినియోగదారులను మెప్పించడమే అన్నింటికంటే ప్రధానం. వినియోగదారులకు సేవ చేసే విషయంలో చాలామందికి అహంభావం అడ్డొస్తూ ఉంటుంది. జీవితంలో ఎదగాలంటే అహంభావాన్ని పూర్తిగా వదిలించుకోవాలి. సేల్స్ జాబ్‌లో ఉన్నవారు, ఫాస్టుఫుడ్ ఔట్లెట్లలో పనిచేసేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడూ మీ మాటే చెల్లుబాటు కావాలనుకుంటే కుదరదు. విజయం.. ఒక్కరోజులో అసాధ్యం! జీవితంలో కోరుకున్న విజయం సాధించాలంటే నిరంతర శ్రమ, బాధ్యతలను భుజానికెత్తుకోవడం, గట్టి పట్టుదల వంటి లక్షణాలు అవసరం. సక్సెస్ వచ్చేవరకూ పట్టువిడవక పనిచేయాలి. ఇన్స్టంట్ సక్సెస్ రావాలని కోరుకుంటే నిరాశ తప్పదు. జాక్ స్కిన్నర్ మెక్ డొనాల్డ్స్ రెస్టారెంట్లో కౌంటర్ వెనుక 30 ఏళ్లు పనిచేశాడు. అనంతరం అదే సంస్థకు గ్లోబల్ సీఈఓగా ఎదిగాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఆయన కనీసం కాలేజీకి కూడా వెళ్లలేదు. చేతులకు బురద అంటుకోనివ్వండి బడా కార్పొరేట్ వ్యాపారవేత్తలు సైతం చిన్నచిన్న పనులు చేసేందుకు ఏమాత్రం సిగ్గుపడరు. భారత్‌లోని ఓ భారీ రిటైల్ మార్కెట్ చైన్ గ్రూప్ కంపెనీ సీఈఓ తమ స్టోర్లలో ఎలాంటి పనులైనా సంతోషంగా చేస్తుంటారు. ఆటోమొబైల్ కంపెనీల యజమానులు కూడా కార్లను మరమ్మత్తు చేస్తుంటారు. చేతులకు గ్రీజ్ మరకలు అంటుకున్నా తమ పనిలోనే ఆనందం పొందుతుంటారు. మెక్ డొనాల్డ్స్‌లో ఉద్యోగంలో ఉన్నప్పుడు జే లెనో అన్ని రకాల పనులు చేసేవారు. అవసరాన్ని బట్టి స్వయంగా చీపురు చేతబట్టి రెస్టారెంట్‌ను శుభ్రం చేసేవారు. కాబట్టి చేతులకు బురద అంటుకున్నా ఫర్వాలేదు, వెంటనే పనిలోకి దిగండి. టీమ్ వర్క్‌తో అద్భుతాలే! మీరు ఏదైనా సంస్థలో ఉద్యోగంలో చేరితే.. మీరొక్కరే అన్ని పనులూ చేయలేరు. అక్కడ ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యత అప్పగిస్తారు. యాజమాన్యం ఎలాంటి బాధ్యతను అప్పగించినా నిబద్ధతతో పూర్తి చేయాలి. బృందమంతా కలిసి పనిచేస్తేనే సంస్థ విజయం సాధిస్తుంది. మీరు కెరీర్ ప్రారంభించబోయే ముందు జెఫ్ బెజోస్, జే లెనో, జాక్ స్కిన్నర్లను ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. మీరు చేరబోయే సంస్థ, చేసే ఉద్యోగం, వచ్చే జీతం చాలా తక్కువే కావొచ్చు. కానీ, అక్కడ నేర్చుకునే అనుభవం ఎంతో గొప్పది. భావి జీవితానికి అది ఎంతగానో ఉపయోగపడుతుంది. -‘కెరీర్స్’ 360 సౌజన్యంతో