
మెక్‌ఈవెన్ (యూఎస్): అమెరికాలోని టెన్సెసీ రాష్ట్రంలో శుక్రవారం ఉదయం (స్థానిక కాలమా నం ప్రకారం) మందుగుండు తయారుచేసే ఓ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పలువురు (దాదాపు 19 మంది) మర ణించినట్లు, చాలామంది గల్లంతైనట్లు తెలిసింది. అయితే, మరణాల సంఖ్యపై అధికారుల నుంచి స్పష్టమైన ప్రకటన రాలేదు.
హిక్‌మాన్ కౌంటీలోని అక్యురేట్ ఎనర్జిటిక్ సిస్టమ్స్ అనే సంస్థ కర్మాగారంలో ఉదయం 7.45 గంటల సమయంలో పేలుడు సంభవించింది. వెంటనే అక్కడికి వెళ్లిన సహాయ సిబ్బంది ఫ్యాక్టరీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా మళ్లీ పేలుళ్లు సంభవించాయి. దీంతో సహాయక చర్యలు చేపట్టలేక పోయారు. ‘పేలుడు జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో పలువురు ఉన్నట్లు తెలిసింది. కానీ ఎంతమంది ఉన్నారనేది తెలియదు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాం. అక్కడ పనిచేసేవారి కుటుంబాలను సంప్రదిస్తున్నాం’అని హంప్‌ష్రేస్ కౌంటీ షెరిఫ్ క్రిస్ డేవిస్ తెలిపారు.
