హర్మూజ్‌ జల సంధిలో భారత్‌ నౌకను సీజ్‌ చేశాం : ఇరాన్‌ | masked Iranian commandos seized India bound ship in Hormuz | Sakshi
Sakshi News home page

హర్మూజ్‌ జల సంధిలో భారత్‌ నౌకను సీజ్‌ చేశాం : ఇరాన్‌

Apr 23 2026 4:55 PM | Updated on Apr 23 2026 7:41 PM

masked Iranian commandos seized India bound ship in Hormuz

టెహ్రాన్‌: అమెరికా-ఇరాన్‌ల మధ్య శాంతి ఒప్పందం చర్చలపై ప్రతిష్టంభన నెలకొన్న వేళ హర్మూజ్‌ జలసంధిలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. గల్ఫ్‌ దేశాల నుంచి వస్తున్న వాణిజ్య నౌకలను ఇరాన్‌ అడ్డుకుంటూ, స్వాధీనం చేసుకుంటున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. 

బుధవారం ఇరాన్‌ నౌకాదళం రెండు వాణిజ్య నౌకలను స్వాధీనం చేసుకుంది. వాటిలో ఒకటి భారత్‌కు చెందిన నౌక కూడా ఉంది.  ఈ నౌక దుబాయ్‌ నుంచి బయలుదేరి గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు వెళ్లాల్సి ఉంది. అంతలోనే ఇరాన్‌ కమాండోలు గన్‌బోట్ల ద్వారా భారత్‌ నౌకను అదుపులోకి తీసుకున్నారు. ఎస్‌ఎస్‌ఈ పేరుతో పనామా జెండాతో వెళ్తున్న మరో ఫ్రాన్స్‌ నౌకను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ రెండు నౌకలను ఇరాన్‌ తీరానికి తీసుకెళ్లారు.

ఇరాన్‌ విడుదల చేసిన వీడియోలో ముసుగులు ధరించిన కమాండోలు తుపాకులతో నౌకపైకి ఎక్కి తనిఖీలు చేపట్టిన దృశ్యాలు చూడొచ్చు.  నౌకపై కాల్పులు జరిపి, గ్రెనేడ్లు విసరడంతో బ్రిడ్జ్‌ (కమాండ్‌ సెంటర్‌) దెబ్బతింది. అయితే సిబ్బందికి ఎటువంటి గాయాలు కాలేదు.

ఈ ఘటనకు ముందు అమెరికా మెరైన్లు రెండు ఇరాన్‌ జెండా కింద నడుస్తున్న నౌకలను స్వాధీనం చేసుకోవడంతో, ఇరాన్‌- అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అమెరికా అధికారులు ఇరాన్‌ ‘మస్కిటో ఫ్లీట్’ అనే చిన్న, వేగవంతమైన పడవలను ఉపయోగిస్తున్నారని ఆరోపించారు.

భారత్‌కు వెళ్తున్న వాణిజ్య నౌకల భద్రతపై ఆందోళనలు పెరుగుతున్నాయి. హర్మూజ్‌ జలసంధి అంతర్జాతీయ వాణిజ్యంలో కీలక మార్గం కావడంతో, ఇలాంటి దాడులు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement