భారత్‌కు కొత్త టెన్షన్‌.. ట్విస్ట్‌ ఇచ్చిన మహమ్మద్‌ ముయిజ్జు!

Maldives president Mohamed Muizzu Key Comments Over India - Sakshi

మాలె: మాల్దీవుల నూతన అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు కీలక వ్యాఖ్యలు చేశారు. తమ దేశం మాల్దీవుల్లో ఉన్న సైనికులను భారత్‌ ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ క్రమంలోనే తమ ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా బలమైన తీర్పునిచ్చారని, దానిని భారత్‌ గౌరవిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. 

అయితే, మాల్దీవుల కొత్త అధ్యక్షుడిగా ముయిజ్జు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈనేపథ్యంలో శనివారం కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు ఆయనతో మర్యాపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భారత సైనికులను ఉపసంహించుకోవాలని కోరినట్లు అధ్యక్ష కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఎన్నికల సందర్భంగా మాల్దీవుల నుంచి ఇండియన్‌ మిలిటరీని తిరిగి పంపిస్తామని ముయిజు అక్కడి ప్రజలకు హామీ ఇచ్చారు. ఆయన గెలుపు నేపథ్యంలో ఆ హామీని అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. 

కాగా, హిందూ మహాసముద్రంలో కీలకమైన పొరుగుదేశం కావడంతోపాటు, అక్కడ అనేకమంది భారతీయులు నివసిస్తుండటం గురించి రిజిజు ప్రస్తావించారు. అందువల్ల నిర్మాణాత్మక సంబంధాలను పెంచుకునేందుకు, దేశాల ప్రజల మధ్య సంబంధాల బలోపేతానికి ఎదురుచూస్తున్నామని చెప్పారు. కాగా, హిందూ మహాసముద్రంలో చైనా ఆధిపత్యం పెరుగుతున్న నేపథ్యంలో దానిని అడ్డుకోవడానికి మాల్దీవులు చాలా అవసరం. ఈనేపథ్యంలో 70 మంది సైనికులను భారత్‌ అక్కడ మోహరించింది. అక్కడి నుంచి రాడార్లు, నిఘా విమానాలను నిర్వహిస్తున్నది. దీంతోపాటు ఎకనమిక్‌ జోన్‌కు భారత యుద్ధ నౌకలు గస్తీ కాస్తున్నాయి.

ఇదిలా ఉండగా.. మాల్దీవులు ఎన్నికల సందర్భంగా తాను అధికారంలోకి వస్తే అక్కడ ఉన్న భారత్‌ బలగాలను వెనక్కి పంపిస్తానని మయిజ్జు ఎన్నికల సమయంలో హమీ ఇచ్చారు.  ఈ నేపథ్యంలో ఆయన అధికారం చేపట్టిన తర్వాతి రోజునే చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. మరోవైపు.. చైనా అనుకూలవాదిగా పేరొందిన మాజీ అధ్యక్షుడు యామీన్‌కు మయిజ్జు సన్నిహితుడు కావడం గమనార్హం. 2013లో అధికారంలోకి వచ్చిన యామీన్‌ గయూమ్‌ భారత్‌ వ్యతిరేక ప్రచారాన్ని ప్రారంభించి చైనాకు దగ్గరయ్యాడు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top