ట్రంప్‌కు కీలెరిగి వాత!  | India Retaliatory Tariffs on US Imports | Sakshi
Sakshi News home page

ట్రంప్‌కు కీలెరిగి వాత! 

Jan 18 2026 3:53 AM | Updated on Jan 18 2026 5:13 AM

India Retaliatory Tariffs on US Imports

అమెరికాపై 30% టారిఫ్‌లు 

మోదీ సర్కారు నిశ్శబ్ద నిర్ణయం

తృణధాన్యాలు అన్నింటికీ వర్తింపు

గత నవంబర్‌ నుంచే అమల్లోకి

సెనేటర్ల లేఖతో వెలుగులోకి

టారిఫ్‌లను బూచిగా చూపి ప్రపంచ దేశాలన్నింటినీ బెదరిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు భారత్‌ కీలెరిగి వాత పెట్టింది! ‘నీవు నేరి్పన విద్యయే...’అన్నట్టుగా అమెరికాపై ప్రతీకార టారిఫ్‌లు విధించి దెబ్బకు దెబ్బ తీసింది. అది కూడా ట్రంప్‌లా నానా హడావుడీ చేయకుండా, నిశ్శబ్దంగానే పని కానిచ్చేసింది. మూడున్నర నెలలుగా వాటిని వసూలు చేస్తోంది కూడా! 

భారత్‌పై ట్రంప్‌ గతేడాది టారిఫ్‌ల మోత మోగించడం తెలిసిందే. రోజుకో రకంగా అన్నట్టుగా మారుస్తూ వచ్చి, చివరికి వాటిని 25 శాతానికి ఖరారు చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఆపడం లేదంటూ మరో 25 శాతం వడ్డించి 50 శాతానికి చేర్చారు! ఇక్కడే భారత్‌ సైలెంటుగా పావులు కదిపింది. అమెరికా నుంచి దిగుమతయ్యే తృణధాన్యాలపై 30 శాతం టారిఫ్‌లు విధించేసింది! గత అక్టోబర్‌ 30న ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 

నవంబర్‌ 1 నుంచే ఆ టారిఫ్‌లు అమల్లోకి కూడా వచ్చాయి!! అమెరికా నుంచి దిగుమతి అవుతున్న పప్పులు, ముఖ్యంగా బఠాణీలకు ఇది వర్తిస్తోంది. ఈ విషయంలో మోదీ సర్కారు వ్యూహాత్మకంగా వ్యవహరించింది. టారిఫ్‌ల విధింపుపై అధికారిక ప్రకటన వంటిదేమీ చేయలేదు. అంతేగాక దానికి పెద్దగా ప్రచారం కూడా కల్పించకుండా జాగ్రత్త పడింది. 

తీవ్ర నష్టం: సెనేటర్లు  
నార్త్‌ డకోటా, మొంటానా రాష్ట్రాలకు చెందిన సెనేటర్లు కెవిన్‌ క్రేమర్, స్టీవ్‌ డెయిన్స్‌ శుక్రవారం ట్రంప్‌కు రాసిన లేఖతో అమెరికా తృణధాన్యాలపై భారత్‌ టారిఫ్‌ల అంశం వెలుగులోకి వచ్చింది. తమ రాష్ట్రాల్లో విస్తారంగా సాగయ్యే పప్పులు, ముఖ్యంగా తృణధాన్యాలకు ఈ టారిఫ్‌లు పెద్ద భారంగా మారాయంటూ లేఖలో వారు వాపోయారు. భారతీయులే వాటిని ప్రపంచంలోనే అత్యధికంగా వినియోగిస్తారని గుర్తు చేశారు. 

అలాంటి తృణధాన్యాలపై 30 శాతం దిగుమతి సుంకం సరికాదంటూ ఆవేదన వెలిబుచ్చారు. వాటిని తొలగించేలా ప్రధాని మోదీతో సంప్రదింపులు జరపాల్సిందిగా ట్రంప్‌ను వారు కోరారు. ఈ పరిణామంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘టారిఫ్‌ల రంకెలు వస్తున్న అమెరికాకు దాని భాషలోనే భారత్‌ సైలెంటుగా దీటైన సమాధానమిచ్చింది’, ‘మౌనంగానే దెబ్బకు దెబ్బ కొట్టాం’అంటూ పోస్టులతో హోరెత్తిస్తున్నారు.

 ప్రపంచవ్యాప్తంగా పప్పులు, తృణధాన్యాల వినియోగంలో భారత్‌ వాటాయే 27 శాతంగా ఉంది. ట్రంప్‌ తొలి టర్ములో కూడా భారత్‌ ఇలాగే అమెరికాలో సాగయ్యే పప్పులపై సుంకాలు విధించిందని, అప్పుడు కూడా ఈ అంశాన్ని తామే ఆయన దృష్టికి తెచ్చామని సెనేటర్లు గుర్తు చేసుకున్నారు.

 దాంతో వాటిని తొలగించాలని కోరుతూ 2020 భారత పర్యటన సందర్భంగా మోదీకి ట్రంప్‌ స్వయంగా లేఖ అందజేసి మరీ సమస్యను పరిష్కరించినట్టు వారు చెప్పారు. జనరలైజ్డ్‌ సిస్టమ్‌ ఆఫ్‌ ప్రిఫరెన్సెస్‌ జాబితా నుంచి 2019లో భారత్‌ను తొలగించడంతో మరుసటేడే అమెరికా నుంచి దిగుమతయ్యే పప్పులు, తృణధాన్యాలపై భారత్‌ సుంకాలు వేసింది. 

చర్చలకు విఘాతమే! 
అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కొద్ది నెలలుగా అటూ ఇటూ ఊగిసలాడుతున్న విషయం తెలిసిందే. నిజానికి అది పూర్తిగా కొలిక్కి వచ్చిందని, కేవలం ట్రంప్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌ చేయని కారణంగానే పెండింగ్‌లో పడిందని అమెరికా ఇటీవలే పేర్కొనడం తెలిసిందే. దాంతో ఇరు దేశాల సంబంధాలు కొద్ది రోజులుగా దిగజారుతూ వస్తున్నాయి. 

దానికి తోడు పప్పులు, తృణధాన్యాలపై భారత్‌ టారిఫ్‌తో పీటముడి మరింత బిగుసుకోవచ్చని భావిస్తున్నారు. ఎందుకంటే భారత వ్యవసాయ, పాడి మార్కెట్లలో మరింతగా చొచ్చుకొచ్చేందుకు అమెరికా చిరకాలంగా ప్రయతి్నస్తూ వస్తోంది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద చర్చల్లో కూడా ప్రధానంగా ఈ దిశగా నిబంధనల సడలింపుకు పట్టుబడుతోంది. మోదీ సర్కారు మాత్రం అందుకు ససేమిరా అంటోంది.

    – సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement