breaking news
Grain imports
-
ట్రంప్‌కు కీలెరిగి వాత!
టారిఫ్‌లను బూచిగా చూపి ప్రపంచ దేశాలన్నింటినీ బెదరిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు భారత్ కీలెరిగి వాత పెట్టింది! ‘నీవు నేరి్పన విద్యయే...’అన్నట్టుగా అమెరికాపై ప్రతీకార టారిఫ్‌లు విధించి దెబ్బకు దెబ్బ తీసింది. అది కూడా ట్రంప్‌లా నానా హడావుడీ చేయకుండా, నిశ్శబ్దంగానే పని కానిచ్చేసింది. మూడున్నర నెలలుగా వాటిని వసూలు చేస్తోంది కూడా! భారత్‌పై ట్రంప్ గతేడాది టారిఫ్‌ల మోత మోగించడం తెలిసిందే. రోజుకో రకంగా అన్నట్టుగా మారుస్తూ వచ్చి, చివరికి వాటిని 25 శాతానికి ఖరారు చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఆపడం లేదంటూ మరో 25 శాతం వడ్డించి 50 శాతానికి చేర్చారు! ఇక్కడే భారత్ సైలెంటుగా పావులు కదిపింది. అమెరికా నుంచి దిగుమతయ్యే తృణధాన్యాలపై 30 శాతం టారిఫ్‌లు విధించేసింది! గత అక్టోబర్ 30న ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. నవంబర్ 1 నుంచే ఆ టారిఫ్‌లు అమల్లోకి కూడా వచ్చాయి!! అమెరికా నుంచి దిగుమతి అవుతున్న పప్పులు, ముఖ్యంగా బఠాణీలకు ఇది వర్తిస్తోంది. ఈ విషయంలో మోదీ సర్కారు వ్యూహాత్మకంగా వ్యవహరించింది. టారిఫ్‌ల విధింపుపై అధికారిక ప్రకటన వంటిదేమీ చేయలేదు. అంతేగాక దానికి పెద్దగా ప్రచారం కూడా కల్పించకుండా జాగ్రత్త పడింది. తీవ్ర నష్టం: సెనేటర్లు నార్త్ డకోటా, మొంటానా రాష్ట్రాలకు చెందిన సెనేటర్లు కెవిన్ క్రేమర్, స్టీవ్ డెయిన్స్ శుక్రవారం ట్రంప్‌కు రాసిన లేఖతో అమెరికా తృణధాన్యాలపై భారత్ టారిఫ్‌ల అంశం వెలుగులోకి వచ్చింది. తమ రాష్ట్రాల్లో విస్తారంగా సాగయ్యే పప్పులు, ముఖ్యంగా తృణధాన్యాలకు ఈ టారిఫ్‌లు పెద్ద భారంగా మారాయంటూ లేఖలో వారు వాపోయారు. భారతీయులే వాటిని ప్రపంచంలోనే అత్యధికంగా వినియోగిస్తారని గుర్తు చేశారు. అలాంటి తృణధాన్యాలపై 30 శాతం దిగుమతి సుంకం సరికాదంటూ ఆవేదన వెలిబుచ్చారు. వాటిని తొలగించేలా ప్రధాని మోదీతో సంప్రదింపులు జరపాల్సిందిగా ట్రంప్‌ను వారు కోరారు. ఈ పరిణామంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘టారిఫ్‌ల రంకెలు వస్తున్న అమెరికాకు దాని భాషలోనే భారత్ సైలెంటుగా దీటైన సమాధానమిచ్చింది’, ‘మౌనంగానే దెబ్బకు దెబ్బ కొట్టాం’అంటూ పోస్టులతో హోరెత్తిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పప్పులు, తృణధాన్యాల వినియోగంలో భారత్ వాటాయే 27 శాతంగా ఉంది. ట్రంప్ తొలి టర్ములో కూడా భారత్ ఇలాగే అమెరికాలో సాగయ్యే పప్పులపై సుంకాలు విధించిందని, అప్పుడు కూడా ఈ అంశాన్ని తామే ఆయన దృష్టికి తెచ్చామని సెనేటర్లు గుర్తు చేసుకున్నారు. దాంతో వాటిని తొలగించాలని కోరుతూ 2020 భారత పర్యటన సందర్భంగా మోదీకి ట్రంప్ స్వయంగా లేఖ అందజేసి మరీ సమస్యను పరిష్కరించినట్టు వారు చెప్పారు. జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ జాబితా నుంచి 2019లో భారత్‌ను తొలగించడంతో మరుసటేడే అమెరికా నుంచి దిగుమతయ్యే పప్పులు, తృణధాన్యాలపై భారత్ సుంకాలు వేసింది. చర్చలకు విఘాతమే! అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కొద్ది నెలలుగా అటూ ఇటూ ఊగిసలాడుతున్న విషయం తెలిసిందే. నిజానికి అది పూర్తిగా కొలిక్కి వచ్చిందని, కేవలం ట్రంప్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేయని కారణంగానే పెండింగ్‌లో పడిందని అమెరికా ఇటీవలే పేర్కొనడం తెలిసిందే. దాంతో ఇరు దేశాల సంబంధాలు కొద్ది రోజులుగా దిగజారుతూ వస్తున్నాయి. దానికి తోడు పప్పులు, తృణధాన్యాలపై భారత్ టారిఫ్‌తో పీటముడి మరింత బిగుసుకోవచ్చని భావిస్తున్నారు. ఎందుకంటే భారత వ్యవసాయ, పాడి మార్కెట్లలో మరింతగా చొచ్చుకొచ్చేందుకు అమెరికా చిరకాలంగా ప్రయతి్నస్తూ వస్తోంది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద చర్చల్లో కూడా ప్రధానంగా ఈ దిశగా నిబంధనల సడలింపుకు పట్టుబడుతోంది. మోదీ సర్కారు మాత్రం అందుకు ససేమిరా అంటోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ధాన్యం కొనుగోళ్లలో సిద్దిపేట డివిజన్ టాప్
సిద్దిపేట జోన్: ధాన్యం సేకరణలో భాగంగా జిల్లా యంత్రాంగం ప్రవేశపెట్టిన వినూత్న ప్రయోగానికి సత్ఫలితాలు లభించాయి. ప్రభుత్వ రంగ సంస్థలకు దీటుగా రబీలో ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు జిల్లా అధికారులు వ్యవసాయ పరపతి సంఘాలను (పీఏసీఎస్) రంగంలోకి దింపారు. దీంతో ఈ యేడు రబీలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు పోటీ పడి పెద్ద ఎత్తున ధాన్యాన్ని కొనుగోలు చేశాయి. జిల్లా పౌర సరఫరాల శాఖ రికార్డుల ప్రకారం ఈ యేడు సేకరించిన ధాన్యంలో అర్ధభాగం పరపతి సంఘాలదే కావడం విశేషం. దీంతో జిల్లాలోని 105 సొసైటీల్లో అత్యుత్తమంగా కొనుగోలు చే సిన ఐదు పీఏసీఎస్ సొసైటీలను ప్రభుత్వం గుర్తించింది. వాటిలో సిద్దిపేట డివిజన్‌కు చెందిన సిద్దిపేట, దుబ్బాక, నంగునూరు పీఏసీఎస్ సొసైటీలు వరుసగా మూడు నుంచి ఐదు స్థానాలు ఆక్రమించడం విశేషం. సుమారు రూ. 6 కోట్ల విలువైన ధాన్యం లావాదేవీలను కొనసాగించడం విశేషం. ధాన్య సీమగా పేరొందిన మెతుకు సీమలో వ్యవసాయ ఆధారిత ప్రాంతాలు పుష్కలం. ప్రతి యేటా లక్షలాది క్వింటాళ్ల ధాన్యం దిగుమతి కావడం సహజం. ముఖ్యంగా మధ్యతరహా ప్రాజెక్టుగా గుర్తింపు పొందిన ఘనపూర్, సింగూరు ప్రాజెక్టుల పరీవాహక ప్రాంతాలన్ని వరి సిరులతో కళకళలాడుతుంటాయి. గత సంవత్సరం ఎఫ్‌సీఐ, సివిల్ సప్లై ద్వారా కొనుగోలు ప్రక్రియను నిర్వహించిన జిల్లా అధికారులు సానుకూల ఫలితాలు మరింత మెరుగ్గా వచ్చేందుకు తొలిసారిగా క్షేత్రస్థాయిలో పీఏసీఎస్‌లను రంగంలోకి దించింది. ఎక్కడికక్కడా రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసి ప్రభుత్వ మద్దతు ధరను అందించేందుకు పీఏసీఎస్ సొసైటీలకు పూర్తి అధికారాలను కట్టబెట్టింది. ఈ క్రమంలో జిల్లాలోని 105 సొసైటీలకు సంబంధిత ఆదేశాలను జారీ చేసింది. ఈ లెక్కన రబీలో పౌరసరఫరాల శాఖ జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల నుంచి 69 వేల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా వాటిలో సొసైటీలు 34 వేల టన్నులు సేకరించడం విశేషం. వాటిలో అత్యధికంగా మెదక్ సొసైటీ కొనుగోలు చేయగా ద్వితీయ స్థానంలో కొల్చారం మండలం రంగంపేట సొసైటీ నిలిచింది. వాటి తర్వాత స్థానాలను సిద్దిపేట డివిజన్ పరిధిలోని దుబ్బాక, సిద్దిపేట, గంగాపూర్లు కైవసం చేసుకున్నాయి. జిల్లా సహకార సంఘం రికార్డుల ప్రకారం దుబ్బాక పీఏసీఎస్ సొసైటీ 350 మంది రైతుల నుంచి 18,050 క్వింటాళ్లను సేకరించి 26 రోజుల్లోనే రూ. 2,42,77,250 డబ్బులను రైతులకు చెల్లించింది. అదే విధంగా సిద్దిపేట సొసైటీ 361 రైతుల నుంచి 25 రోజుల్లో 16,186 క్వింటాళ్లను కొనుగోలు చేసి వాటికి సంబంధించి రూ. 2, 17,70,412లు చెల్లించింది. అదే విధంగా చిన్నకోడూరు మండలం గంగాపూర్ సొసైటీ 368 మంది రైతుల నుంచి 45 రోజుల్లో రూ. 14,200 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ. 1,90,99,000 రైతులకు చెల్లించి రికార్డు స్థాయిలో నిలిచాయి. ఈ యేడు పూర్తి స్థాయిలో సొసైటీలకు కొనుగోలు ప్రక్రియను అప్పగించి మరింత మెరుగైన ఫలితాలు సాధించేం దుకు ప్రణాళికను రూపొందించినట్లు సమాచారం.


