ఖేర్‌సన్‌: కీలక విలీన ప్రాంతం నుంచి రష్యా బలగాల ఉపసంహరణ

Major Set Back For Russia Over Forces back From Kherson - Sakshi

మాస్కో: ఉక్రెయిన్‌పై రష్యా ఆక్రమణలో కీలక పరిణామం చోటుచేసుకుంది!. ఉక్రెయిన్‌ కీలక నగరం, ప్రస్తుతం రష్యా స్వాధీనంలో ఉన్న ఖేర్‌సన్‌ నుంచి రష్యా బలగాలు వెనక్కి మళ్లాయి. ఈ మేరకు రష్యా రక్షణ శాఖ మంత్రి సెర్గేయ్‌ షోయిగు స్వయంగా ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. 

ఖేర్‌సన్‌ సమీపాన ఉన్న నిప్రో నది వెంట ఉన్న రష్యా బలగాలను వెనక్కి పిలిపించుకుంది రష్యా. మాస్కోకు ఈ పరిణామం ఎదురుదెబ్బ కాగా, ఈ ప్రభావంతో ఉక్రెయిన్‌ యుద్ధం మరో మలుపు తిరగవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే రష్యా ప్రకటనపై ఉక్రెయిన్‌ మరోలా స్పందించింది. 

ఖేర్‌సన్‌లో ఇంకా రష్యా బలగాలు ఉన్నాయని, ఆ ప్రాంతానికి మరిన్ని రష్యన్‌ బలగాలు చేరుకుంటున్నాయని ఆరోపించింది. ఖేర్‌సన్‌లో ఉక్రెయిన్‌ జెండా ఎగిరేంత వరకు.. రష్యా బలగాల ఉపసంహరణ ప్రకటనకు అర్థమే లేదని ఉక్రెయిన్‌ అధ్యక్ష భవన సలహాదారు మైఖాయిలో పోడోల్యాక్‌ ప్రకటించారు. 

ఉక్రెయిన్‌ దురాక్రమణ మొదలయ్యాక.. ఖేర్‌సన్‌ను వెంటనే రష్యా బలగాలు ఆక్రమించుకున్నాయి. అప్పటి నుంచి ఉక్రెయిన్‌ బలగాలను ఎదుర్కొనేందుకు ఈ ప్రాంతాన్ని స్థావరంగా మార్చుకున్నాయి రష్యా బలగాలు. ఇక సెప్టెంబర్‌లో రష్యాలో విలీనం అయినట్లుగా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రకటించిన నాలుగు ప్రాంతాల్లో ఖేర్‌సన్‌ కూడా ఉంది.  పైగా ఈ ప్రాంతం నుంచే అణుదాడులు జరగవచ్చనే ఊహాగానాలు తెర మీదకు వచ్చాయి.

ఈ తరుణంలో.. అంతటి కీలక ప్రాంతం నుంచి రష్యా తన సైన్యం ఉపసంహరణ ప్రకటన ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తమ సైనికుల ఆరోగ్యాన్ని పరిగణనలోకి తీసుకోవడంతో పాటు అక్కడి పౌరుల భద్రత దృష్ట్యా బలగాలను వెనక్కి తీసుకోవాలని రష్యా భావించిందట!. ఈ మేరకు రక్షణ మంత్రి షోయిగు.. రష్యా యుద్ధ పర్యవేక్షకుడు జనరల్‌ సెర్గేయ్‌ సురోవికిన్‌ మధ్య జరిగిన చర్చల సారమే.. బలగాల ఉపసంహరణగా తెలుస్తోంది. మరోవైపు ఈ పరిణామాల నడుమే ఉక్రెయిన్‌ బలగాలు ఖేర్‌సన్‌ను పూర్తిస్థాయిలో తమ ఆధీనంలోకి తెచ్చుకునే దిశగా ముందుకు వెళ్తుండడం గమనార్హం.

ఇదీ చదవండి: 165 కిలోమీటర్లు కాలినడక నడిచి మరీ ఆ పని 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top