ప్రపంచంలోని దోమలన్నింటినీ అంతం చేస్తే ఏమవుతుంది?... శాస్త్రవేత్తల సమాధానం ఇదే..

kill all the mosquitoes in the world effects on humans - Sakshi

దోమలు అన్ని ప్రాంతాలలోనూ కనిపిస్తాయి.దోమలు కుట్టడం వలన సాధారణ జ్వరం మొదలుకొని ప్రాణాంతక వ్యాధులు సైతం సోకుతాయి. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 3,500 దోమల ప్రజాతులు ఉన్నాయి. వీటిలో చాలా ప్రజాతులు దోమలు మనిషిని కుట్టవు. ఈ తరహా దోమలు పండ్లు, మొక్కల రసాలను తాగి జీవిస్తుంటాయి. కేవలం ఆరు ప్రజాతుల దోమలే మనుషుల రక్తాన్ని తాగుతాయి. ఇవి పలు వ్యాధులను కూడా వ్యాపింపజేస్తాయి. మన దేశంలో దోమల కారణంగా ఏటా 10 లక్షల మంది మరణిస్తున్నారు.

దోమలు కుట్టడం వలన వచ్చే వ్యాధులలో మలేరియా, డెంగ్యూ,ఎల్లో ఫీవర్‌ మొదలైనవి ఉన్నాయి. వీటి కారణంగా ప్రపంచవ్యాప్తంగా లక్షలమంది మరణిస్తున్నారు. ఒకవేళ ప్రపంచంలోని దోమలన్నింటినీ మట్టుబెడితే ఏం జరుగుతుందో తెలుసా? దీని పరిణామాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా దోమలను చంపేందుకు కెమికల్స్‌ వాడుతుంటారు. అయితే ఈ కెమికల్స్‌ వలన దోమలకన్నా అధికంగా మనుషులకే ముప్పు ఏర్పడుతోంది.

దీనిని గుర్తించిన శాస్త్రవేత్తలు ఎటువంటి కెమికల్స్‌ సాయంలేకుండా దోమలను తరిమికొట్టే ఉపాయాలను కనుగొనే పనిలో పడ్డారు. దీనిలో చాలా దేశాలు విజయం సాధించాయి. మనిషిని కుట్టే ఆడ దోమల జీన్‌లో మార్పులు తీసుకువచ్చి జెనెటికల్లీ మోడిఫైడ్‌ దోమలను సిద్ధం చేశారు. దోమలు గుడ్లను పెడతాయి. అయితే వాటినుంచి పిల్లలు బయటకు వచ్చేలోగానే తల్లిదోమలు మృతిచెందుతాయి. సుమారు మూడు లక్షల దోమలను కెమన్‌ ద్వీపంలో 2009-2010 కాలాల మధ్య వదిలివేశారు. ఈ ప్రయోగం వలన దోమల జనాభాలో 96 శాతం వరకూ తగ్గింది. ఇటువంటి ప్రయోగం బ్రెజిల్‌ లోనూ మంచి ఫలితాలను ఇచ్చింది.

శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం మూడు రకాల దోమలను నాశనం చేయగలిగితే పది లక్షలమంది మనుషులను కాపాడవచ్చు. అలాగే జెనిటికల్లీ మాడిఫైడ్‌ మస్కిటో ప్రయోగం కూడా ఇప్పటివరకూ ఎటువంటి దుష్పరిమాణాలను చూపలేదు. అయితే దోమలను పూర్తిస్థాయిలో నాశనం చేస్తే ‍ప్రకృతి అందించిన ఫుడ్‌ చైన్‌కు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. దోమలు పూలలో పరపరాగ సంపర్కం ఏర్పడేందుకు సహకారం అందిస్తాయి. ఫలితంగానే పూలు పండ్లుగా మారుతాయి. దోమలు కొన్ని ప్రాణులకు ఆహారం వంటివి. కప్పలు, బల్లులు, తొండలు మొదలైనవి దోమలను తిని బతుకుతాయి. ఇవి ఉండటం వలన ప్రకృతి సమతుల్యత దెబ్బతినకుండా ఉంటుంది. అందుకే దోమలను మొత్తంగా అంతం చేసేబదులు వాటిలో ప్రమాదకరమనవాటిని మాత్రం అంతం చేయాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top