‘అలాంటి వ్యక్తికి నేనేం సందేశం ఇవ్వగలను’

Kamala Harris Uncle Message For Her Ahead Of Swearing Ceremony - Sakshi

కమలా హారిస్‌ అంకుల్‌ భావోద్వేగం

న్యూఢిల్లీ: ‘‘తను ఉపాధ్యక్షురాలిగా ఎదగడంలో నేనెలాంటి సాయం చేయలేదు. తన స్వశక్తిని నమ్ముకుని అత్యున్నత పదవిని చేపట్టబోతున్నది. అలాంటి వ్యక్తికి నేను ఏం సందేశం ఇవ్వగలను. ఒక్కటి మాత్రం చెప్పగలను. శ్యామల(కమలా హారిస్‌ తల్లి) నీకు ఏం నేర్పించిందో అదే పాటించు. ఇప్పటి వరకు ఎంతో బాగా సాగిపోయింది. ఇకపై కూడా ఇలాగే నీ ప్రయాణం కొనసాగాలని ఆకాంక్షిస్తున్నా’’ అంటూ అమెరికా వైస్‌ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన కమలా హారిస్‌ అంకుల్‌ జి. బాలచంద్రన్‌ ఉద్వేగానికి లోనయ్యారు. కమల సాధించిన విజయం తమకు గర్వకారణమని పేర్కొన్నారు. కాగా డెమొక్రటిక్‌ పార్టీ సభ్యురాలు, భారత- జమైకా మూలాలున్న కమలా హారిస్‌ మరికొన్ని గంటల్లో అగ్రరాజ్య ఉపాధ్యక్షురాలిగా పదవీ స్వీకార ప్రమాణం చేయబోతున్న విషయం తెలిసిందే.(చదవండి: తుపాకీ నీడలో బాధ్యతలు చేపట్టనున్న బైడెన్‌!)

ఆసియా- ఆఫ్రికా మూలాలు
తమిళనాడుకు చెందిన శ్యామల గోపాలన్- జమైకన్‌ సంతతికి చెందిన డొనాల్డ్‌ హ్యారిస్‌లకు మొదటి సంతానంగా కమల జన్మించారు. తండ్రి స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో ఎకనమిక్స్‌ ప్రొఫెసర్‌. తల్లి పీహెచ్‌డీ చేసి బ్రెస్ట్‌ కేన్సర్‌ చికిత్సకు పరిశోధనలు చేశారు. కమల సోదరి మాయ పబ్లిక్‌ పాలసీ సలహాదారుగా ఉన్నారు. కాగా కమల 1986లో హోవర్డ్‌ వర్సిటీలో రాజనీతి శాస్త్రం, ఆర్థిక శాస్త్రంలతో బీఏ పూర్తి చేశారు. అనంతరం హాస్టింగ్స్‌ కాలేజ్‌ నుంచి లా డిగ్రీ పొందారు. 1990 నుంచి 1998 వరకు ఆక్లాండ్‌లో డెప్యూటీ డిస్ట్రిక్ట్‌ అటార్నీగా పనిచేశారు. గ్యాంగ్‌ దాడులు, లైంగిక వేధింపులు, డ్రగ్స్‌ వినియోగం.. తదితర కేసులను సమర్ధవంతంగా వాదించి, మంచి ఖ్యాతి గడించారు.

అనంతరం 2004లో డిస్ట్రిక్ట్‌ అటార్నీగా, 2010లో కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా ఎన్నికయ్యారు. ఈ పదవి సాధించిన తొలి మహిళగా, తొలి ఇండో-ఆఫ్రో అమెరికన్‌గా చరిత్ర సృష్టించారు. న్యాయవాది డగ్లస్‌ ఎమ్‌హాఫ్‌తో ఏడేళ్ల క్రితం కమలకు వివాహం జరిగింది. కాగా 2016లో డెమొక్రాటిక్‌ పార్టీ నుంచి సెనేట్‌కు ఎన్నికైన కమలా హారిస్‌.. సెనేట్‌లో సెలెక్ట్‌ కమిటీ ఆన్‌ ఇంటలిజెన్స్, జ్యూడీషియరీ కమిటీల్లో సభ్యురాలిగా సేవలందించారు. ఇక అధ్యక్ష అభ్యర్థిత్వ ఎన్నికల్లో తనకు పోటీదారు అయిన జో బైడెన్‌, ఆమెను రన్నింగ్‌మేట్‌గా ప్రకటించడంతో సరికొత్త చరిత్రకు పునాది పడింది. ఈ క్రమంలో విజయం సాధించిన కమలా హారిస్‌ అమెరికా చరిత్రలోనే తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టనున్నారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top