‘జాన్సన్‌’ టీకా ప్రయోగానికి బ్రేక్

Johnson and Johnson Covid -19 vaccine trial was called off in the final stages - Sakshi

న్యూ బ్రన్స్‌విక్‌: జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ ప్రయోగం చివరి దశలో అర్ధాంతరంగా నిలిపివేశారు. వ్యాక్సిన్‌ ప్రయోగంలో పాల్గొన్న వ్యక్తి అనారోగ్యం పాలయ్యారు. అయితే అనారోగ్యానికి కారణం వ్యాక్సిన్‌ సంబంధితమేనా అనేదానిపై కంపెనీ పరిశీలిస్తోంది. అనారోగ్యం పాలవడం, ప్రమాదాలు జరగడం, కొన్నిసార్లు దుర్ఘటనలు జరగడం, ఏ వ్యాక్సిన్‌ అభివృద్ధిలో నైనా ఊహించిన పరిణామాలేనని, ప్రత్యేకించి, భారీ స్థాయిలో అధ్యయనాలు జరుపుతున్నప్పుడు ఇవి మామూలేనని  కంపెనీ పేర్కొంది. అమెరికాలో వ్యాక్సిన్‌ ప్రయోగాలు చివరి దశలో ఉండగా, ఇలా సాంకేతిక సమస్యలు తలెత్తటంతో వ్యాక్సిన్‌ ప్రయోగం నిలిచిపోవడం ఇది రెండోసారి.

భారీ స్థాయిలో జరిగే వైద్యపరమైన అధ్యయనాల్లో తాత్కాలిక విరామాలు సర్వసాధారణం. ఔషధాన్ని పరీక్షించే సమయంలో ఏవైనా తీవ్ర, అనూహ్య అనారోగ్య పరిణామాలు సంభవిస్తే కంపెనీలు వాటిని పరిశోధించాల్సి ఉంటుంది. పదివేల మందిపై ఇటువంటి వ్యాక్సిన్‌ ప్రయోగాలు జరిపితే, వారిలో కొందరికి అనారోగ్య సమస్యలు తలెత్తడం యాధృచ్చికమే. వ్యాక్సిన్‌ ప్రయోగించిన మహిళకు తీవ్రమైన న్యూరోలాజికల్‌ సమస్యలు ఉత్పన్నమవడంతో, ఆస్ట్రాజెనికా, ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలు సంయుక్తంగా తయారు చేస్తోన్న కోవిడ్‌ వ్యాక్సిన్‌ చివరి దశ ప్రయోగాన్ని సైతం అమెరికాలో నిలిపివేశారు. అయితే వేరే ప్రాంతంలో ఈ ప్రయోగాన్ని కొనసాగిస్తున్నారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top