Russia Ukraine War: భారత్‌ వణుకుతోంది.. బైడెన్‌ సంచలన వ్యాఖ్యలు

Joe Biden Calls India Shaky In Russia Confrontation Over Ukraine War - Sakshi

ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య విరామం లేకుండా కొనసాగుతోంది. రష్యా దాడితో ఉక్రెయిన్‌ అల్లకల్లోలంగా మారుతోంది. కోట్ల సంపద సర్వ నాశనం అవుతోంది. సైనికులు, అమాయక పౌరులు యుద్ధ భూమిలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఉక్రెయిన్‌  మళ్లీ కోలుకోడానికి దశాబ్దాలు పట్టేలా కన్పిస్తోంది. మరోవైపు ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో చాలా దేశాలు ఉక్రెయిన్‌కే మద్ధతుగా నిలుస్తున్నాయి. ఉక్రెయిన్‌కు మానవతా సాయం అందిస్తూనే.. మరోవైపు రష్యాపై నిషేధం విధిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఉక్రెయిన్‌, రష్యా యుద్ధం విషయంలో తటస్థ వైఖరి అనుసరిస్తున్న భారత్‌పై అమెరికా మరోసారి తమ అక్కసుని వెళ్లగక్కింది. రష్యాకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడంలో భారత్‌ వణుకుతోందంటూ జో బైడెన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ మేరకు వాషింగ్టన్‌లో అమెరికన్‌ సీఈఓల రౌండ్‌టేబుల్ సమావేశంలో బైడెన్‌ మాట్లాడుతూ.. రష్యాపై చర్యలు తీసుకునేందుకు భారత్‌ ఎందుకో జంకుతోందని వ్యాఖ్యానించారు. రష్యాకు వ్యతిరేకంగా కూటమి కట్టే విషయంలో భారత్‌ తీసుకునే నిర్ణయాల్లో అస్థిరత కనిపిస్తోందని అన్నారు. రష్యాపై భారత్‌ కఠిన ఆంక్షలు, నిషేధాజ్ఞలను జారీ చేయడంలో కొంతవరకు వణుకుతోందని పేర్కొన్నారు. అమెరికా మిత్రదేశాలన్నీ ఐక్యంగా రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయని.. ఢిల్లీ మాత్రం అస్థిరంగా, బలహీనంగా ఉందని పేర్కొన్నారు.
చదవండి: రష్యా చెప్పేదానిని నమ్మలేం.. అది అంత ఈజీ కాదు: అమెరికా

క్వాడ్‌లో భారత్ మాత్రమే రష్యాపై కఠినంగా లేదని.. మిగతా జపాన్, ఆస్ట్రేలియా, తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయని జో బైడెన్‌ తెలిపారు. కాగా క్వాడ్‌లో భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. ఇందులో భారత్ మినహాయిస్తే- మిగిలిన మూడు రష్యాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయి. జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా ఇదివరకే రష్యాపై ఆంక్షలను విధించాయి. అయితే రష్యాతో సుదీర్ఘకాలంగా బలమైన స్నేహ సంబంధాలను కలిగి ఉన్న భారత్ తటస్థ వైఖరిని అవలంభిస్తోంది. అలాగనీ అటు యుద్ధాన్ని కూడా సమర్థించడం లేదు. శాంతియుత చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని చెబుతోంది.
చదవండి: భాష రాక ఉక్రేనియన్ల గోస.. 7 భాషల్లో సాయం.. అంధుడికి సలాం!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top