
బల్గేరియాకు చెందిన సుప్రసిద్ధ కాలజ్ఞాని బాబా వంగా గురించి అందరికీ తెలిసే ఉంటుంది!. అంధురాలైన ఆమె భవిష్యత్తులో ఏం జరగనుంది? అనే చాలా విషయాలు చెప్పినవి చెప్పినట్లే జరగడంతో ఆమె కాలజ్ఞానానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కింది. సరిగ్గా.. ఈవిడలాగే జపాన్‌లోనూ ఒకావిడ ఉంది. ఆమె పేరు రియో టాట్సుకి(Ryo Tatsuki). ఆమె చెప్పిన ఓ విషయంతో వచ్చే నెలలో ఏకంగా ప్రయాణాలే రద్దు చేసుకుంటున్నారు అక్కడి ప్రజలు.
జపనీస్ కాలజ్ఞాని రియో టాట్సుకి (Japanese fortune teller Ryo Tatsuki) 2025, జూలై 5న విపత్తు సంభవించబోతోందని అంచనా వేశారు. భూకంపాలు, సునామీ వచ్చే ప్రమాదం ఉందని జనాల్ని హెచ్చరించారు. ఆమె భవిష్యవాణిపై నమ్మకం కలిగిన జపాన్ ప్రజలు తమ ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నారు.
‘న్యూ బాబా వంగా’గా పేరొందిన రియో టాట్సుకి అంచనాల దరిమిలా పలువురు త్వరలో జపాన్- ఫిలిప్పీన్స్ మధ్య సముద్రగర్భ విభజన కారణంగా భారీ భూకంపం లేదంటే సునామీ సంభవించవచ్చని చెప్పుకుంటున్నారు. టాట్సుకి అంచనాలకు శాస్త్రీయ ఆధారం లేకపోయినా, 2011లో జపాన్‌లో సంభవించిన తోహోకు భూకంపం, సునామీలు ఆమె గత అంచనాలను నిజం చేశాయని అంటున్నారు. నాటి భూకంపంలో ఏకంగా 18వేల మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.
బ్లూమ్‌బెర్గ్ ఇంటెలిజెన్స్ తెలిపిన వివరాల ప్రకారం.. హాంకాంగ్ నుండి సగటు బుకింగ్‌లు ఏడాదికి 50 శాతం మేరకు తగ్గాయి. జూన్- జూలై మధ్య కాలంలో బుకింగ్‌లు 83శాతం వరకు తగ్గాయి. ఏప్రిల్-మే హాలీడేస్ సమయంలో 50శాతం మేరకు బుకింగ్‌ల తగ్గుదల ఉందని హాంకాంగ్‌లోని ఒక ట్రావెల్ ఏజెన్సీ(Travel agency) తెలిపింది.
మరోవైపు రియో టాట్సుకి అంచనాలు నిరాధారమని జపాన్ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా టాట్సుకి అంచనాలను పక్కన పెడితే, ప్రభుత్వ టాస్క్ ఫోర్స్ ఇటీవల జపాన్ పసిఫిక్ తీరంలో త్వరలో భారీ భూకంపం సంభవించనున్నదని, దీని కారణంగా 2 లక్షల 98 వేల మంది వరకు మరణించే అవకాశం ఉన్నదని హెచ్చరించింది.
చెప్పినవి చెప్పినట్లే జరిగాయి
1995 కోబ్ భూకంపం: టాట్సుకి ఈ భూకంపాన్ని ముందుగానే ఊహించారు.
2011 తోహోకు భూకంపం, సునామీ: టాట్సుకి ఈ విపత్తును ముందుగానే అంచనా వేశారు. నాటి ఈ విపత్తులో 22 వేలకు పైగా మరణాలు సంభవించాయి. దీనిపై టాట్సుకి అంచనా నిజం కావడంతో ఆమెపై జపనీయులకు మరింత నమ్మకం పెరిగింది.
టాట్సుకి రాసిన పుస్తకం ‘ది ఫ్యూచర్ ఐ సా’లో 2020లో ఓ వైరస్ జపాన్‌తో పాటు ప్రపంచాన్ని వణికిస్తుందని చెప్పారామె. అది కోవిడ్-19నేనని అక్కడి ప్రజలు బలంగా నమ్ముతారు.
ఇది కూడా చదవండి: ‘ఒక్కగానొక్క కొడుకయ్యా.. మీకు దణ్ణం పెడతా’