రష్యా బలగాలకు ఊహించని ట్విస్ట్‌.. ఉక్రెయిన్‌కు ఆ దేశం నుంచి ఫుల్‌ సపోర్ట్‌..

Japan Will Send The Ukrainian Military Basic Supplies - Sakshi

టోక్యో:  ఉక్రెయిన్‌లో రష్యా బలగాలు రెచ్చిపోయి దాడులు జరుపుతున్నాయి. రష్యా దాడుల్లో ఉక్రెయిన్‌ సామాన్య పౌరులు సైతం మృత్యువాతపడుతున్నారు. ఉక్రెయిన్‌ సైన్యం వెనక్కి తగ్గకపోవడంతో రష్యా సైనికులు వేల సంఖ్యలో మరణించినట్టు ఆ దేశం పేర్కొంది. రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్‌కు పలు దేశాలు అండగా నిలుస్తున్నాయి. ఇప్పటికే రొమేనియా.. ఉక్రెయిన్‌కు భారీ ఆర్థిక సాయంతో పాటుగా దాడుల్లో గాయపడిన వారికి వైద్య సాయం అందిస్తామని తెలిపింది. అలాగే తాగునీరు, బుల్లెట్‌ఫ్రూప్‌ జాకెట్లు, హెల్మెట్లు, చమురును అందిచనున్నట్టు పేర్కొంది. 

తాజాగా ఉక్రెయిన్‌కు సాయంగా రక్షణ సామగ్రి పంపుతూ జపాన్‌ అసాధారణ నిర్ణయం తీసుకుంది. సంక్షోభంలో ఉన్న దేశాలకు రక్షణ సామగ్రిని అందజేయొద్దన్న స్వీయ నియమాన్ని పక్కన పెట్టి మరీ బుల్లెట్‌ఫ్రూప్‌ జాకెట్లు, హెల్మెట్లు, టెంట్లు, జనరేటర్లు, ఆహారం, దుస్తులు, మందులు వంటివి పంపింది.   

మరోవైపు.. రాజధాని కీవ్, ఖర్కీవ్‌ నగరాలు రష్యా దాడులతో అట్టుడుకుతున్నాయి. శుక్రవారమంతా ఎడతెరిపి లేని బాంబు పేలుళ్లతో దద్దరిల్లిపోయాయి. కీవ్‌లో అయితే కనీసం ప్రతి 10 నిమిషాలకు ఒక పేలుడు జరిగిందని సమాచారం. రాజధానిని ఆక్రమించేందుకు 15 వేలకు పైగా అదనపు బలగాలు తాజాగా రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. నగరానికి వాయవ్యంగా క్షిపణి దాడులు, యుద్ధ ట్యాంకుల బీభత్సం తీవ్రంగా ఉందని ఉక్రెయిన్‌ చెబుతోంది. రేవు పట్టణం మారిపోల్‌లోనూ, పలు ఇతర నగరాల్లోనూ అదే పరిస్థితి నెలకొంది.

తిప్పికొడుతున్న ఉక్రెయిన్‌..

చెర్నిహివ్, మైకోలెయివ్‌ వంటి పలు నగరాల్లో రష్యా దాడిని ఉక్రెయిన్‌ సైన్యాలు సమర్థంగా తిప్పికొడుతున్నాయి. అలాగే రేవు పట్టణం ఒడెసాలోనూ రష్యా సైన్యాన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి. నౌకలపై నుంచి నగరంపైకి రష్యా దాడులకు దిగుతోంది. రష్యా సైనికులకు ఆహారం, నిత్యావసరాలు అందకుండా చేస్తూ వారిని నీరసింపజేసే వ్యూహాన్ని ఉక్రెయిన్‌ ఎక్కడికక్కడ అమలు చేస్తోంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top