
ఆహారం కోసం అలమటిస్తున్న పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ దాడులు
గాజాలో 48 మంది మృతి, 300 మందికి గాయాలు
డెయిర్ అల్ – బలాహ్: వ్యూహాత్మకంగా కాల్పుల విరమణ పాటిస్తామని ఇటీవల ప్రకటించిన ఇజ్రాయెల్.. గాజాలో వ్యూహాత్మకంగానే దాడులు చేస్తోంది. గాజా స్ట్రిప్‌లోని జికిమ్ క్రాసింగ్ వద్ద ఆహారం కోసం ఎదురుచూస్తున్న వారిపై బుధవారం ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఈ దాడుల్లో 48 మంది మరణించారు. 300 మందికి పైగా గాయపడ్డారు. తమ ఆస్పత్రికి 35 మృతదేహాలు వచ్చాయని అల్–షిఫా హాస్పిటల్ డైరెక్టర్ మొహమ్మద్ అబూ సలి్మయా తెలిపారు.
కాల్పుల స్థలం నుంచి గాయపడిన వారిని చెక్క బండ్లలో దూరంగా తీసుకెళ్తున్న, అలాగే పిండి సంచులను మోసుకెళ్తున్న జనసమూహం మీడియా ఫుటేజీలో కనిపించాయి. 100 మందికి పైగా గాయాలతో తమ ఆస్పత్రికి వచ్చారని అల్–సరయా ఫీల్డ్ హాస్పిటల్ తెలిపింది. కొన్ని మృతదేహాలను ఇతర ఆసుపత్రులకు తరలించామని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని గాజా ఆరోగ్య శాఖ అత్యవసర సేవల ఛీఫ్ ఫేర్స్ అవద్ తెలిపారు.
నిరాకరించిన ఇజ్రాయెల్..
అయితే దాడులను ఇజ్రాయెల్ తోసిపుచ్చింది. తన దళాలను సమీపించే వ్యక్తులపై మాత్రమే ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరిక కాల్పులు జరిపిందని తెలిపింది. ఇక జీహెచ్‌ఎఫ్ సహాయ కేంద్రాల వద్దకు వచి్చన జన సమూహాన్ని వారించడానికి సాయుధ కాంట్రాక్టర్లు పెప్పర్ స్ప్రే ఉపయోగించడం, కాల్పులతో హెచ్చరికలు మాత్రమే చేశారని చెబుతోంది. కాల్పుల వల్ల ప్రాణ నష్టం జరిగిందేమో తమకు తెలియదని ఐడీఎఫ్ స్పష్టం చేసింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను ఇంకా పరిశీలిస్తున్నామని పేర్కొంది.
అంతంత మాత్రంగా సహాయం..
రోజుకు కొన్ని గంటల పాటు వ్యూహాత్మక కాల్పుల విరమణ అమలు చేస్తామని ఇజ్రాయెల్ ప్రకటించినప్పటికీ.. మానవతా సహాయం సరఫరాకు అడ్డంకులు మాత్రం అలాగే ఉన్నాయి. స్ట్రిప్‌లోకి ప్రవేశించే సహాయాన్ని అందించడంలో ఐక్యరాజ్యసమితి ఇప్పటికీ ఇబ్బంది పడుతోంది. ఇజ్రాయెల్ సైన్యం నియంత్రణలో ఉన్న మండలాల్లో చాలా ట్రక్కులను దింపుతోంది. ఇక మరోవైపు ఇజ్రాయెల్ మద్దతుగల జీహెచ్‌ఎఫ్ నిర్వహిస్తున్న ప్రత్యామ్నాయ సహాయ వ్యవస్థ వల్ల హింస పెరుగుతోంది. విమానాల ద్వారా అంతర్జాతీయ సహాయాన్ని పడేయడం కూడా తిరిగి ప్రారంభమైంది. కానీ.. చాలా పార్శిళ్లు పాలస్తీనియన్లు ఖాళీ చేసిన ప్రాంతాల్లో, మరికొన్ని మధ్యధరా సముద్రంలో పడిపోయాయి. ఆ తడిసిన పిండి సంచులను తెచ్చుకోవడానికి కూడా ప్రజలు ఈత కొడుతూ వెళ్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
పోషకాహార లోపంతో మరణాలు..
మరోవైపు పోషకాహార లోపంతో ఒక చిన్నారితో సహా మరో ఏడుగురు పాలస్తీనియన్లు బుధవారం మరణించారు. గాజాలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి పిల్లలు పోషకాహార లోపంతో మొత్తం 89 మంది మరణించారు. జూన్ చివరి నుంచి పోషకాహార లోపం సంబంధిత కారణాలతో గాజా అంతటా 65 మంది పాలస్తీనియన్ పెద్దలు కూడా మరణించారని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే.. గాజాలో ఆకలి చావులు లేవని ఇజ్రాయెల్ చెబుతోంది. గాజాలో ఆకలిపై దృష్టి పెట్టడం హమాస్‌తో కాల్పుల విరమణ ప్రయత్నాలను బలహీనపరుస్తుందని చెబుతోంది. ఈ గందరగోళం మధ్యనే.. అమెరికా మిడిల్ ఈస్ట్‌రాయబారి ఇజ్రాయెల్‌కు వెళుతున్నారు. గాజాలో కాల్పుల విరమణ, హమాస్ చెరలో ఉన్న బం«దీల విడుదలపై ఇజ్రాయెల్‌తో చర్చలు నిర్వహించనున్నారు.