ఇంధన కేంద్రాలే టార్గెట్‌ | Israel South Pars strikes push Iran conflict into energy war | Sakshi
Sakshi News home page

ఇంధన కేంద్రాలే టార్గెట్‌

Mar 19 2026 5:04 AM | Updated on Mar 19 2026 5:09 AM

Israel South Pars strikes push Iran conflict into energy war

ఇరాన్‌లో అతిపెద్ద సహజ వాయువు క్షేత్రంపై భీకర దాడి  

గల్ఫ్‌ దేశాల్లోని ఇంధన కేంద్రాలపై విరుచుకుపడిన ఇరాన్‌   

కువైట్, బహ్రెయిన్, ఖతార్, యూఏఈపై క్షిపణులతో దాడి  

సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలంటూ చమురు కేంద్రాల కారి్మకులకు సూచన

అంతర్జాతీయ మార్కెట్‌లో108 డాలర్లకు చేరిన బ్యారెల్‌ ముడిచమురు 

అమెరికాపై ఒత్తిడి పెంచే వ్యూహాన్ని అమలు చేస్తున్న ఇరాన్‌  

ఇరాన్‌లోని కోర్టు సముదాయంపై భారీ దాడి... 8 మంది మృతి 

ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ వైమానిక దాడుల్లో ఇద్దరు బలి

దుబాయ్‌/టెహ్రాన్‌: పశ్చిమాసియాలో చమురు, సహజ వాయువు కేంద్రాలే యుద్ధ క్షేత్రాలుగా మారిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఇంధన ధరలు మండిపోతున్నప్పటికీ ఇరాన్, అమెరికా–ఇజ్రాయెల్‌ వెనక్కి తగ్గడం లేదు. యుద్ధం బుధవారం 19వ రోజుకు చేరుకుంది. ఇరాన్‌లో అతిపెద్ద సహజ వాయువు క్షేత్రమైన ‘సౌత్‌ ఫార్స్‌’పై ఇజ్రాయెల్‌ సైన్యం భీకర దాడికి దిగింది. ఇక్కడ నిత్యం 100 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల నేచురల్‌ గ్యాస్‌ ఉత్పత్తి అవుతోంది. 

ఇజ్రాయెల్‌ దాడిలో భారీగా నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఇరాన్‌ సైతం గల్ఫ్‌ అరబ్‌ దేశాల్లోని ఇంధన కేంద్రాలపై విరుచుకుపడింది. సౌదీ అరేబియాలో చమురు క్షేత్రాలు అధికంగా ఉన్న తూర్పు ప్రావిన్స్‌పై భారీగా క్షిపణులు ప్రయోగించింది. కువైట్, బహ్రెయిన్, ఖతార్, యూఏఈపైనా క్షిపణులు, డ్రోన్లతో నిప్పుల వర్షం కురిపించింది. ఆయా దేశాల్లో ఆయిల్, గ్యాస్‌ మౌలిక సదుపాయాలను, పెట్రోకెమికల్‌ కేంద్రాలను ధ్వంసం చేయడం తథ్యమని హెచ్చరించింది. 

వాటి శాటిలైట్‌ ఫొటోలు విడుదల చేసింది. అక్కడ పనిచేస్తున్న కారి్మకులు, స్థానికులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించింది. పశ్చిమాసియా తాజా పరిణామాలతో అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ ముడిచమురు ధర 108 డాలర్లకు చేరుకుంది. యుద్ధం మొదలైన తర్వాత ఏకంగా 40 శాతం పెరిగింది. పెట్రో ఉత్పత్తుల ధరలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యస్థలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఇంధన ధరలు పెరుగుతున్న కొద్దీ అమెరికాపై ఒత్తిడి పెరగడం తథ్యమని, తద్వారా యుద్ధం నుంచి అమెరికా సైన్యం నుంచి విరమించుకొనే అవకాశం ఉందని ఇరాన్‌ అంచనా వేస్తోంది.  

ఇజ్రాయెల్‌లో రైల్వే స్టేషన్‌పై దాడి  
ఇజ్రాయెల్‌లోని టెల్‌ అవీవ్‌లో రైల్వే స్టేషన్‌పై ఇరాన్‌ సైన్యం దాడికి పాల్పడింది. దాంతో దేశవ్యాప్తంగా రైల్వే సేవలు నిలిచిపోయాయి. ఈ దాడిలో ప్రాణనష్టం జరగలేదు. పౌర మౌలిక సదుపాయాలను నేరుగా టార్గెట్‌ చేయడం సంచలనాత్మకంగా మారింది. సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని దౌత్య కార్యాయాలపైనా ఇరాన్‌ దాడికి పాల్పడింది. ఇరాన్‌ ప్రయోగించిన రెండు డ్రోన్లను సౌదీ అరేబియా సైన్యం కూలి్చవేసింది. ఇక్కడ అమెరికా ఎంబీసీతోపాటు ఇతర దేశాల దౌత్యకార్యాలయాలు ఉన్నాయి. రియాద్‌లో బుధవారం సాయంత్రం భారీగా పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లోని అమెరికా ఎంబసీసై రెండో రోజు బుధవారం కూడా దాడి జరిగింది. ఇరాక్‌లోని అమెరికా స్థావరాలపై నిత్యం దాడులు జరుగుతున్నాయి.  

ఇరాన్‌లో స్వీడన్‌ పౌరుడికి ఉరి   
ఇరాన్‌ దక్షిణ ఫార్స్‌ ప్రావిన్స్‌లోని లారెస్తాన్‌ కౌంటీలో ఉన్న కోర్టు సముదాయంపై భారీ దాడి జరిగింది. ఈ ఘటనలో కనీసం 8 మంది మరణించారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇరాన్‌లో ఇప్పటిదాకా 1,300 మందికిపైగా బలయ్యారు. ఇజ్రాయెల్‌ నిఘా సంస్థ మొస్సాద్‌కు గూఢచారిగా పని చేస్తున్నాడన్న ఆరోపణలతో ఓ వ్యక్తిని ఇరాన్‌ ప్రభుత్వం ఉరితీసింది. ఇరాన్‌లోని కీలక ప్రాంతాల సమాచారాన్ని మొస్సాద్‌కు చేరవేస్తున్నాడని అతడిపై ఆరోపణలు వచ్చాయి. 

అతడు స్వీడన్‌ జాతీయుడని తెలిసింది. తమ పౌరుడికి ఉరిశిక్ష విధించడాన్ని స్వీడన్‌ విదేశాంగ శాఖ ఖండించింది. లెబనాన్‌లో హెజ్‌»ొల్లా మిలిటెంట్లను అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ సైన్యం దాడులు కొనసాగిస్తోంది. బుధవారం రాజధాని బీరూట్‌లో అపార్టుమెంట్లపై క్షిపణులు ప్రయోగించింది. ఈ దాడుల్లో పది మందికిపైగా జనం మరణించారు. మిలిటెంట్‌ కార్యకలాపాల కోసం హెజ్‌»ొల్లా పెద్ద ఎత్తున ధనం నిల్వ చేసుకున్న అపార్ట్‌మెంట్‌ను నేలమట్టం చేశామని ఇజ్రాయెల్‌ వెల్లడించింది.  

5 వేల పౌండ్ల బంకర్‌ బస్టర్‌ బాంబులు  
హార్మూజ్‌ జలసంధి సమీపంలో ఇరాన్‌ మిస్సైల్‌ కేంద్రాలను ధ్వంసం చేయడానికి అమెరికా సైన్యం 5 వేల పౌండ్ల(2,268 కిలోలు) బంకర్‌ బస్టర్‌ బాంబులను ప్రయోగించింది. ఈ విషయాన్ని యూఎస్‌ సెంట్రల్‌ కమాండ్‌ వెల్లడించింది. ఈ ప్రాంతంలో ఇరాన్‌ యాంటీ–షిప్‌ క్రూయిజ్‌ మిస్సైళ్లు విదేశీ నౌకలకు ముప్పుగా మారాయని, అందుకే శక్తివంతమైన బాంబులు ప్రయోగించినట్లు స్పష్టంచేసింది.   

ఇరాన్‌ మంత్రి ఖతీబ్‌ మృతి  
ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇరాన్‌ నిఘా వ్యవహారాల మంత్రి ఇస్మాయిల్‌ ఖతీబ్‌ మరణించారు. మంగళవారం రాత్రి దాడుల్లో అతడు హతమైనట్లు ఇజ్రాయెల్‌ రక్షణ శాఖ మంత్రి కట్జ్‌ ప్రకటించారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఆశ్చర్యకరమైన విషయాలు చూస్తారంటూ పేర్కొన్నారు. ఖతీబ్‌ మరణాన్ని ఇరాన్‌ అధికారిక టీవీ చానల్‌ సైతం ధ్రువీకరించింది. ఇది దారుణ హత్యాకాండ అని ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ స్పందించారు. ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్‌ సైన్యం ఇజ్రాయెల్‌తోపాటు గల్ఫ్‌ దేశాలపై దాడులకు దిగింది. ఇజ్రాయెల్‌లోని టెల్‌ అవీవ్‌ సమీపంలో ఇద్దరు మరణించారు. మంగళవారం ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇరాన్‌ అత్యున్నత అధికారులు అలీ లారిజానీ, ఘోలమ్‌ రెజా సులేమానీ మరణించిన సంగతి తెలిసిందే. లారిజానీ మృతిపట్ల ఇరాన్‌ ఇస్లామిక్‌ రెవల్యూషనరీ గార్డ్‌ కోర్‌(ఐఆర్‌జీసీ) రగిలిపోతోంది. సెంట్రల్‌ ఇజ్రాయెల్‌పై బహుళ వార్‌హెడ్లతో కూడిన క్షిపణులు ప్రయోగించింది.  

2.6 లక్షల మంది భారతీయులు వెనక్కి 
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధం మొదలయ్యాక అక్కడి నుంచి ఫిబ్రవరి 28వ తేదీన తర్వాత ఇప్పటిదాకా 2.6 లక్షల మంది భారతీయులు స్వదేశానికి తిరిగి వచ్చారని భారత విదేశాంగ శాఖ బుధవారం ప్రకటించింది. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ)లోని వేర్వేరు నగరాల్లోని విమానాశ్రయాల నుంచి భారతీయుల తరలింపు కోసం 70 విమానాలు నడుస్తున్నట్లు విదేశాంగ శాఖ అదనపు కార్యదర్శి(గల్ఫ్‌) అసీమ్‌ ఆర్‌.మహాజన్‌ చెప్పారు. యూఏఈ పరిధి నుంచి భారతీయులను రప్పించడంపై యూఏఈ అధ్యక్షుడు షేక్‌మొహమ్మెద్‌ బిన్‌ జయేద్‌ అల్‌ నహ్యాల్‌లో ప్రధాని మోదీ మంగళవారం టెలిఫోన్‌ సంభాషణ జరిపారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌దీర్‌ జైశ్వాల్‌ వెల్లడించారు. యుద్ధం మొదలయ్యాక ఇరునేతలు మాట్లాడుకోవడం ఇది రెండోసారి.

చిక్కుకున్న లక్షల టన్నుల చమురు, ఎల్పీజీ  
న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధం కారణంగా లక్షల టన్నుల మేర ముడిచమురు సహా పలు రకాల సరుకులు భారత్‌కు రాకుండా పర్షియన్‌ గల్ఫ్‌ సముద్రజలాల్లో నౌకల్లో చిక్కుకుపోయాయి. ఈ వివరాలను భారత నౌకాయాన మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి రాజేశ్‌ కుమార్‌ సిన్హా బుధవారం వెల్లడించారు. ‘‘16.7 లక్షల టన్నుల ముడిచమురు, 3.2 లక్షల టన్నుల ఎల్పీజీ, దాదాపు 2 లక్షల టన్నుల ద్రవరూప సహజవాయువు 22 భారతీయ జెండా ఉన్న సరుకు రవాణా నౌకల్లో ఉండిపోయాయి. ఈ నౌకలన్నీ పర్షియన్‌ గల్ఫ్‌ నుంచి హార్మూజ్‌ గుండా భారత్‌కు రావాల్సి ఉంది. యుద్ధం కారణంగా ప్రయాణం మొదలుపెట్టలేక గల్ఫ్‌లోనే ఉండిపోయాయి. 22 నౌకల్లోని 611 మంది భారతీయ నావికులు క్షేమంగానే ఉన్నారు. అన్ని దేశాలకు సంబంధించి దాదాపు 500 నౌకలు పర్షియన్‌ గల్ప్‌లో ఆగిపోయాయి. వీటిల్లో 108 చమురు, 166 చమురు ఉత్పత్తులు, 104 రసాయన ఉత్పత్తుల ట్యాంకర్లు, 52 రసాయన ట్యాంకర్లు, 53 ఇతర రకాల నౌకలు, కొన్ని డ్రెడ్జర్‌లు, ఖాళీ నౌకలు ఉన్నాయి’’అని సిన్హా పేర్కొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement