
టెల్‌అవీవ్: గాజాను పూర్తిగా ఆక్రమించుకోవాలన్న వివాదాస్పద నిర్ణయాన్ని ఇజ్రాయెల్ కేబినెట్ ఆమోదించింది. శుక్రవారం జరిగిన రక్షణ కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై సుమారు 10 గంటలపాటు సుదీర్ఘ చర్చ జరిగింది. గాజాపై పూర్తి స్థాయి నియంత్రణ సాధించడమే తన లక్ష్యమని ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ తెలిపారు. ఆయన కార్యాలయం ఇందుకు సంబంధించి విడుదల చేసిన ప్రకటనలో ఆక్రమణ అనే మాటను వాడనప్పటికీ, వాస్తవానికి ఈ ప్రణాళిక ఉద్దేశం అదేనని తెలుస్తోంది.
ఒక వైపు హమాస్ చెరలోని బందీల భద్రతపై బాధిత కుటుంబాలు, మరో వైపు మరింత మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయే ప్రమాదముందని అంతర్జాతీయంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ నెతన్యాహూ ప్రభుత్వం ఈ ప్రణాళికను ముందుకు తెచ్చింది. గాజాలో మూడొంతుల ప్రాంతం ఇప్పటికే ఇజ్రాయెల్ ఆర్మీ నియంత్రణలో ఉంది. అయితే, తాజా ప్రణాళిక ఇజ్రాయెల్‌ను అంతర్జాతీయంగా ఏకాకిగా మార్చే ప్రమాదముందని విశ్లేషకులు భావిస్తున్నారు.
గాజాను పూర్తిగా ఆధీనంలోకి తెచ్చేందుకు కొన్ని నెలలపాటు పట్టే ఈ కార్యక్రమం ఎప్పుడు మొదలవుతుందనే విషయంలో స్పష్టత లేదు. అయితే, అక్టోబర్ 7వ తేదీ నాటికి గాజా సిటీని ఖాళీ చేయించాలని డెడ్‌లైన్ పెట్టుకుంది. నగరంలో ఆహార పంపిణీ నిలిపివేయడం, అక్కడి వారిని బలవంతంగా ఖాళీ చేయిండం ఈ ప్రణాళికలో భాగాలు. ఇందుకోసం వేలాది మంది అదనపు బలగాలను రంగంలోకి దింపాల్సి ఉంటుంది. ఇప్పటికే గాజాలో కరవు కాటకాలు, ఆకలి చావులకు కారణమవుతోందంటూ ఇజ్రాయెల్‌పై ఆగ్రహంతో ఉన్న పలు దేశాలు తాజా ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నాయి.
పలు దేశాల ఖండన..
ఇజ్రాయెల్‌ది తప్పుడు నిర్ణయమని యూకే ప్రధాని స్టార్మర్ పేర్కొన్నారు. ఇజ్రాయెల్ సైనిక అవసరాలు తీర్చే రెండో అతిపెద్ద సరఫరాదారు జర్మనీ కూడా..మిలటరీ పరికరాలను ఇకపై విక్రయించబోమని స్పష్టం చేసింది. నెతన్యాహూ మాత్రం ఈ విషయంలో మనస్సు మార్చుకునే ఉద్దేశంతో లేరు. ఇజ్రాయెలీలు సైతం హమాస్‌తో ఒప్పందం కుదుర్చుకుని బందీలను త్వరగా బయటకు తీసుకురావాలనే కోరుకుంటున్నారు. అయితే, షరతులు పెట్టకుండా హమాస్‌పై ఒత్తిడి తెచ్చి, బందీలను విడుదల చేయించడమే లక్ష్యంగా నెతన్యాహూ గాజా పూర్తి నియంత్రణ అనే బెదిరింపునకు దిగారని భావిస్తున్నారు. దీనిని ట్రంప్ యంత్రాంగం సైతం వ్యతిరేకించలేదు.
అతివాద పార్టీలతో ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్న నెతన్యాహూ అధికారంలో కొనసాగేందుకే ఈ సంక్షోభాన్ని వాడుకుంటున్నారన్న విశ్లేషణలూ ఉన్నాయి. ఇప్పటికే గాజాలోని 8 లక్షల మంది పాలస్తీనియన్లను బలవంతంగా ఉత్తరం నుంచి దక్షిణానికి, తిరిగి ఉత్తరాదికి ఖాళీ చేయిస్తూ, క్షేత్రస్థాయిలో దాడులు, వైమానిక నిఘాలతో ఆర్మీ అసహనంతో ఉంది. గాజాను నియంత్రణలోకి తెచ్చుకోవడమంటే మరింత ఊబిలోకి దిగడమేనని ఆర్మీ వర్గాలు అంటున్నాయి.