
జెరూసలేం: గాజాలోని పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ ఆర్మీ భీకర వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో గత 24 గంటల వ్యవధిలో మహిళలు, చిన్నారులు సహా 150 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని గాజా ఆరోగ్య విభాగం తెలిపింది. దాడుల్లో వందలాదిగా గాయపడ్డారని పేర్కొంది. గురువారం నుంచి కొనసాగుతున్న భీకర దాడుల్లో మొత్తం 250 మంది మృత్యువాతపడ్డారని ఆరోగ్య విభాగం వివరించింది.
శనివారం అర్ధరాత్రి నిరాశ్రయులకు ఆశ్రయం కల్పిస్తున్న పలు నివాసాలు, శిబిరాలపై వైమానిక దాడులు జరపడంతో ఖాన్‌యూనిస్, ఉత్తర గాజా, జబాలియాలోని శరణార్థి శిబిరంలో మొత్తం 100 మంది మృతి చెందినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 100 మందిలో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది ప్రాణాలు కోల్పోగా.. ఏడుగురు చిన్నారులు మరణించినట్లు అధికారులు పేర్కొన్నారు.
2023 అక్టోబర్ 7వ తేదీ నుంచి మొదలైన ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటి వరకు 53 వేల మందికి పైగా చనిపోయినట్లు ఆరోగ్య విభాగం వెల్లడించింది. వీరిలో అత్యధికులు మహిళలు, చిన్నారులేనని వివరించింది. క్షతగాత్రుల సంఖ్య లక్షల్లోనే ఉంటుందని పేర్కొంది. ఉత్తర, మధ్య గాజాలోని వారిని నివాసాలు, టెంట్లు విడిచిపెట్టి వెళ్లాలని హెచ్చరికలు చేస్తూ భీకర దాడులు కొనసాగిస్తున్న ఇజ్రాయెల్ ఆర్మీ కీలకమైన మరో ఆపరేషన్‌కు తెరతీసింది.
లక్షిత ప్రాంతాలను స్వాధీనం చేసుకునే ఆపరేషన్ ‘గిడియన్ చారియట్స్’ను తమ సైన్యం పూర్తి సామర్థ్యంతో కొనసాగిస్తుందని రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ వెల్లడించారు. మరికొద్ది రోజుల్లోనే వేలాదిగా ఇజ్రాయెల్ బలగాలు గాజాలో ప్రవేశించి ఆపరేషన్ మొద లుపెట్టనున్నాయి. ఇజ్రాయెల్ మిలటరీ ఆపరేషన్ ప్రకటనతో హమాస్ కాస్తంత వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. ఎటువంటి ముందస్తు షరతులు లేకుండా అన్ని అంశాలపైనా చర్చలకు సిద్ధమని ప్రకటించింది. ఖతార్ రాజధాని దోహాలో ఇజ్రాయెల్‌తో చర్చలకు హాజరవుతామని తెలిపింది. అయితే, పాలస్తీనా ఖైదీల విడుదల, గాజా నుంచి ఇజ్రాయెల్ సైన్యం సంపూర్ణ ఉపసంహరణ తమ కీలక డిమాండ్లని స్పష్టం చేసింది.