వాషింగ్టన్: ‘లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులు ఆపాలి’.. ఇరాన్ చేస్తున్న ప్రధాన డిమాండ్లలో ఇది ఒకటి. అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప‍్పందం కుదిరినప్పటికీ లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు ఆపలేదు. లెబనాన్‌లో తాజా యుద్ధం మార్చి 2న మొదలైంది. ఇరాన్ మద్దతుతో లెబనాన్ సాయుధ గ్రూపు హిజ్బుల్లా ఇజ్రాయెల్‌పై కాల్పులు జరిపింది.
దీంతో లెబనాన్‌లో ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. 2,000 మందికి పైగా మృతి చెందగా, అందులో 165 మంది పిల్లలు, 250 మహిళలు ఉన్నారు. ఇప్పుడు ఎట్టకేలకు ఇజ్రాయెల్-లెబనాన్ చర్చలు జరిపాయి. ప్రస్తుతం ఇరు దేశాల ప్రతినిధులు అమెరికాలో ఉన్నారు.
లెబనాన్, ఇజ్రాయెల్ మూడు దశాబ్దాల తర్వాత తొలిసారి దౌత్య చర్చలు నిర్వహించాయి. ఇజ్రాయెల్, లెబనాన్‌కు మధ్య దౌత్య సంబంధాలు లేవు. చివరిసారిగా ప్రత్యక్ష చర్చలు 1993లో జరిగాయి. ఇజ్రాయెల్, ఇరాన్ మద్దతు ఉన్న హెజ్బొల్లా మధ్య ఘర్షణను ముగించాలనే లక్ష్యంతో అమెరికాలో ఇప్పుడు ఈ సమావేశం జరిగింది. ఈ చర్చలకు మధ్యవర్తిత్వం చేసిన అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మాట్లాడుతూ.. ఇది చరిత్రాత్మక అవకాశమని చెప్పారు. హెజ్బొల్లా ప్రభావం లేకుండా చేసేందుకు ఇదో అవకాశమని అన్నారు.
అమెరికా చేసిన ప్రకటన ప్రకారం.. లెబనాన్, ఇజ్రాయెల్ పక్షాలు ప్రత్యక్ష చర్చలు ప్రారంభించేందుకు అంగీకరించాయి. ఇజ్రాయెల్ అన్ని ప్రభుత్వేతర ఉగ్రవాద గ్రూపులను నిరాయుధీకరణ చేయాలని కోరింది. అంటే ఇందులో హెజ్బొల్లా కూడా వస్తుంది.
లెబనాన్ కాల్పుల విరమణ కోరింది. మానవతా సంక్షోభాన్ని ఎదుర్కొనే చర్యలు తీసుకోవాల్సి ఉందని చెప్పింది. లెబనాన్‌లో హిజ్బుల్లాను నిరాయుధీకరణ చేయడం, ఆ గ్రూపు లేకుండా చేయడమే తమ లక్ష్యమని ఇజ్రాయెల్ తెలిపింది. గాజా యుద్ధం కొనసాగిన సమయంలో (2023, 2024లో) కూడా హిజ్బుల్లాతో ఇజ్రాయెల్ పోరాడింది.
అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ పిగాట్ మాట్లాడుతూ.. చర్చల తర్వాత విడుదల చేసిన ప్రకటనలో ఇజ్రాయెల్, లెబనాన్ రెండు పక్షాలు హెజ్బొల్లా ప్రభావాన్ని తగ్గించే దిశగా పని చేయడానికి అంగీకరించాయి. హెజ్బొల్లా దాడుల నుంచి తనను తాను రక్షించుకునే ఇజ్రాయెల్ హక్కుకు అమెరికా మద్దతు తెలిపిందని ఆయన చెప్పారు.


