ఈ వారాంతంలోనే ఒప్పందంపై సంతకాలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడి
వాషింగ్టన్: ఇరాన్‌పై యుద్ధం ముగిసిపోయిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చిచెప్పారు. శాంతి ఒప్పందం ఖరారు చేసుకోవడానికి అత్యంత చేరువలోకి వచ్చామని అన్నారు. ఒప్పందంపై ఈ వారాంతంలోనే సంతకాలు జరుగుతాయని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. యూరప్‌లో సంతకాలు జరిగే అవకాశం ఉందన్నారు. గురువారం మధ్యాహ్నం వైట్‌హౌస్ ఓవల్ ఆఫీసులో ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ఇరాన్‌తో శాంతి ఒప్పందంపై సంతకాల కార్యక్రమానికి తమ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ హాజరవుతారని అంచనా వేస్తున్నామని తెలిపారు.
ఇరాన్‌తో తాజా చర్చలకు సంబంధించి ఖతార్, యూఏఈ, సౌదీ అరేబియా, బహ్రెయిన్, కువైట్, పాకిస్తాన్‌లతో సహా మధ్యప్రాచ్య దేశాల నాయకులతో మాట్లాడినట్లు పేర్కొన్నారు. ఇరాన్‌తో ఒప్పందాన్ని స్టాక్ మార్కెట్ కూడా అనుకూలంగా భావిస్తోందని చెప్పారు. ఒప్పందం ఖరారైన తర్వాత హార్మూజ్ జలసంధి తిరిగి తెరుచుకుంటుందని వివరించారు. ఇది చాలా బలమైన, సమగ్రమైన అవగాహన ఒప్పందమని, కచ్చితంగా కార్యరూపం దాల్చబోయే విషయమని వ్యాఖ్యానించారు. ‘‘చాలా తక్కువ మంది మాత్రమే తట్టుకోగలిగే తీవ్రమైన దెబ్బలను వారు(ఇరాన్) ఎదుర్కొన్నారు. అందుకే శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని నాకంటే వారే ఎక్కువగా కోరుకుంటున్నారు’’అని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
మా డిమాండ్‌కు ఇరాన్ అంగీకారం
అనంతరం.. గవర్నర్ పదవికి పోటీ చేస్తున్న జార్జియా లెఫ్టినెంట్ గవర్నర్ బర్ట్ జోన్స్‌కు మద్దతుగా నిర్వహించిన ఆన్‌లైన్ ర్యాలీలో ట్రంప్ ప్రసంగించారు. ఈ రోజు (గురువారం) ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించామని ప్రకటించారు. ఎప్పటికీ అణ్వాయుధాన్ని కలిగి ఉండకూడదన్న తమ డిమాండ్‌కు ఇరాన్ అంగీకరించిందని ఉద్ఘాటించారు. ఇరాన్ వద్ద ప్రాణాంతక ఆయుధాలు ఉండకూడదని, అదే తమ అసలు ఉద్దేశమని వివరించారు. ‘‘వారు(ఇరాన్) అణ్వాయుధాన్ని కొనుగోలు చేయరు లేదా ఏ విధంగానూ దానిని అభివృద్ధి చేయరు. వారి వద్ద అణ్వాయుధం ఉండదు’’అని ట్రంప్ వెల్లడించారు. ఇరాన్‌పై దాడులు ఆపాలని అమెరికా సైన్యానికి ట్రంప్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందంపై జెనీవాలో సంతకాలు జరుగుతాయని ప్రచారం సాగుతోంది.
అలాంటిదేమీ లేదు: ఇరాన్
శాంతి ఒప్పందం కుదిరినట్లేనని, ఈ వారాంతంలో సంతకాలు జరుగుతాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనను ఇరాన్ ఖండించింది. ఒప్పందం ఇంకా ఖరారు కాలేదని పేర్కొంది. ఇరుపక్షాలు ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. ఒప్పందం కుదిరిందన్న వార్తలు కేవలం ఊహాగానాలేనని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ తెలిపారు.


