హెలికాఫ్టర్‌ క్రాష్‌.. ఇరాన్‌ అధ్యక్షుడి దుర్మరణం | Iran Helicopter Crash, Iran President Ebrahim Raisi Death Latest News | Sakshi
Sakshi News home page

Iran President Ebrahim Raisi Death: హెలికాఫ్టర్‌ క్రాష్‌.. ఇరాన్‌ అధ్యక్షుడు రైసీ దుర్మరణం

Published Mon, May 20 2024 9:16 AM

Iran Helicopter Crash Ebrahim Raisi Death Latest News

టెహ్రాన్‌: హెలికాఫ్టర్‌ ప్రమాదంలో ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అకాల మరణం చెందారు. రైసీతో పాటు ఆ విదేశాంగ మంత్రి హొస్సేన్‌ అమీరబ్దొల్లహియన్, ఇతర ఉన్నతాధికారులు సైతం మృతి చెందారు. అజర్‌బైజాన్‌-ఇరాన్‌ సరిహద్దులోని జోల్ఫా పట్టణం దగ్గరగా ఉన్న పర్వత ప్రాంతంలో పూర్తిగా కాలిపోయిన స్థితిలో హెలికాఫ్టర్‌ను గుర్తించిన ఇరాన్‌ బలగాలు.. ఈ ప్రమాదంలో ఎవరూ బతికే అవకాశాలు లేవని ప్రకటించాయి.

భారత కాలమానం ప్రకారం.. ఈ ఉదయం అతి కష్టం మీద హెలికాఫ్టర్‌ కూలిన ప్రాంతానికి చేరుకున్న సహాయక బృందాలు.. హెలికాఫ్టర్‌ పూర్తిగా కాలి ధ్వంసం అయినట్లు ప్రకటించాయి. క్రాష్‌ సైట్‌లో పరిస్థితి ఏమాత్రం బాగోలేదని..  ఈ ప్రమాదంలో ఎవరూ ప్రాణాలతో బయటపడే అవకాశం లేదని ఇరాన్‌ రెడ్‌ క్రెసెంట్‌ చీఫ్‌ పిర్హోస్సేన్‌ కూలివండ్‌ ప్రకటించారు.

అంతకు ముందు టర్కీకి చెందిన డ్రోన్లు.. హెలికాఫ్టర్‌ కూలిన ప్రాంతానికి చేరుకున్నాయి. డ్రోన్‌ విజువల్స్‌ ద్వారా ఇరాన్‌ బలగాలకు సాయం అందించాయి.

ఆదివారం అజర్‌బైజాన్‌ సరిహద్దులో ఇరు దేశాలు సంయుక్తంగా నిర్మించిన రెండు డ్యామ్‌లను ఆ దేశ అధ్యక్షుడు ఇల్హమ్‌ అలియేవ్‌తో కలిసి రైసీ ప్రారంభించారు. మూడు హెలికాఫ్టర్ల కాన్వాయ్‌తో తిరిగి ప్రారంభమైన ఆయన కాన్వాయ్‌లో కాసేపటికే ఇబ్బంది తలెత్తింది. ప్రతికూల వాతావరణం కారణంగా.. ప్రయాణం మొదలైన అరగంట తర్వాత రైసీ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్‌ ప్రమాదానికి గురైంది. అయితే మిగతా రెండు మాత్రం సురక్షితంగా గమ్యానికి చేరుకున్నాయి.

ప్రమాదం జరిగిన వెంటనే హెలికాఫ్టర్‌ కూలిన స్థలాన్ని గుర్తించేందుకు ఇరాన్‌ బలగాలు తీవ్రంగా యత్నించాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా గాలింపు చర్యలకు తీవ్ర ఆటంకం కలిగింది. అయినప్పటికీ విశ్వయత్నాలు చేసి చివరకు ప్రమాద స్థలికి చేరుకున్నాయి. మరోవైపు రైసీ క్షేమంగా తిరిగి రావాలని ఇరాన్‌ ప్రజలు చేసిన ప్రార్థనలు ఫలించలేదు.

Advertisement
 
Advertisement
 
Advertisement