పోటాపోటీగా దాడులు | Iran Deadly Cluster Bomb Attack On Israel, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

పోటాపోటీగా దాడులు

Jun 21 2025 1:23 AM | Updated on Jun 21 2025 4:03 PM

Iran Deadly Cluster Bomb Attack On Israel

ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ క్లస్టర్‌ బాంబుల వర్షం 

హైఫా సిటీపై క్షిపణుల దాడిలో డజన్లమందికి గాయాలు

ఇరాన్‌ క్షిపణి తయారీ కేంద్రంపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌

ఎటూతేలని ఇరాన్, యూరప్‌ నేతల ‘అణు’ మధ్యవర్తిత్వ తొలి దఫా చర్చలు

టెహ్రాన్‌లో ఇజ్రాయెల్‌ వ్యతిరేక ర్యాలీ

టెల్‌ అవీవ్‌/టెహ్రాన్‌/జెనీవా: ఏడు రోజులుగా ఎడతెరిపిలేకుండా భీకరంగా బాంబులేసుకుంటూ పశ్చిమాసియాలో రావణకాష్టాన్ని మరింత రాజేసిన ఇజ్రాయెల్, ఇరాన్‌లు శుక్రవారం సైతం పోరుపంథాలోనే పయనించాయి. పోటాపోటీగా క్షిపణులు జారవిడుస్తూ రెండు దేశాల్లో ఉద్రిక్తతల్ని అమాంతం పెంచేశాయి. ఇజ్రాయెల్‌ను మరింత దెబ్బకొట్టేందుకు ఇరాన్‌ తన వద్ద పోగుబడిన క్లస్టర్‌ బాంబులను ప్రయోగించింది. 

ఇరాన్‌ క్లస్టర్‌ బాంబుల్ని ఉపయోగించడం ఇదే తొలిసారి. ఇజ్రాయెల్‌లోని టెల్‌అవీవ్, హైఫా, బీర్‌షెబా, రెహోవోట్‌ నగరాలు సహా పలు ప్రాంతాలపై క్లస్టర్‌ బాంబులను వేయడంతో పెద్దసంఖ్యలో భవనాలు ధ్వంసమయ్యాయి.  తీరప్రాంత నగరమైన హైఫాలో భవంతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో పదుల సంఖ్యలో జనం గాయపడ్డారు. రక్తమోడుతూ జనం వీధుల్లో పరుగులు పెడుతున్న దృశ్యాలు మీడియాలో కనిపించాయి. 

క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రుల్లో చేర్పించారు. కొందరి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని నగర మేయర్‌ యొనా యాహవ్‌ చెప్పారు. రెహోవోట్‌లో దెబ్బతిన్న భవనాలను ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహూ స్వయంగా వచ్చి పరిశీలించారు. కర్మేయిన్‌ పట్టణంలో షెల్టర్‌లో దాక్కున్న 51 ఏళ్ల మహిళ భయంతో గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది. ప్రతిగా ఇజ్రాయెల్‌ టెహ్రాన్‌లోని పలు క్షిపణి తయారీ కార్మాగారాలపై దాడులు చేసింది. 

దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా సగం వరకు ఇరాన్‌ మిస్సైల్‌ లాంచర్లను నాశనంచేశామని ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ చీఫ్‌ ఇయాల్‌ జమీర్‌ చెప్పారు. ఇరాన్‌ అణుపరిశోధనా ఏజెన్సీసహా పలు నగరాలపై తమ 60 యుద్దవిమానాలు బాంబుల వర్షం కురిపించాయని ఇజ్రాయెల్‌ ప్రకటించింది. శుక్రవారం నాటికి ఇరాన్‌లో 263 మంది పౌరులు, 154 మంది సైనికులు సహా 657 మంది ప్రాణాలు కోల్పోయారు. 

2,000 మందికిపైగా గాయాలపాలయ్యారు. ఇరాన్‌ జరిపిన దాడుల్లో ఇజ్రాయెల్‌లో 24 మంది చనిపోయారు. మరోవైపు ఇరాన్‌లో బుషెహర్‌ అణుకేంద్రంపై దాడితో అత్యంత ప్రమాదకర పరిస్థితి తలెత్తనుందని అంతర్జాతీయ అణుఇంధన ఏజెన్సీ డైరెక్టర్‌ రఫేల్‌ గ్రోసీ ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ప్లాంట్‌లో వేల కేజీల అణుపదార్థం ఉందని, అది బయటకొస్తే వినాశకర స్థాయిలో రేడియోధార్మికత వందలకిలోమీటర్ల పరిధికి విస్తరిస్తుందని ఆయన చెప్పారు. 

మరోవైపు అవసరమైన సమయంలో పోరులో భాగస్వాములమవుతామని హెజ్‌బొల్లా ఉగ్రసంస్థ ప్రధాన కార్యదర్శి షేక్‌ నయీమ్‌ ఖాసిమ్‌ అన్నారు. ఇన్నాళ్లూ ఇరాన్‌ రహస్యంగా గాజాలో హమాస్, లెబనాన్‌లో హెబ్‌బొల్లా, యెమెన్‌లో హూతీ తిరుగుబాటుదారులను పెంచి పోషించినప్పటికీ ఎవరూ ఇంతవరకు సాయపడేందుకు ముందుకురాలేదు. ఈ నేపథ్యంలో హెజ్‌బొల్లా స్పందించడం గమనార్హం. అయితే హెజ్‌బొల్లా స్పందించిన వెంటనే లెబనాన్‌లోని దాని స్థావరాలపై ఇజ్రాయెల్‌ బాంబులు వేసింది.

ఇజ్రాయెల్‌ వ్యతిరేక ర్యాలీలు
తమపై దండెత్తిన ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఇరాన్, ఇరాక్‌లో ముస్లింలు శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనల తర్వాత వేలాదిగా రోడ్లమీదకొచ్చి భారీ నిరసనర్యాలీ చేపట్టారు. టెహ్రాన్, బాగ్దాద్, సదర్‌ సిటీల్లో ఇజ్రాయెల్‌ వ్యతిరేక నినాదాలు చేశారు. మరోవైపు ఇప్పటికే హమాస్‌తో పోరాడుతున్న ఇజ్రాయెల్‌ కొత్తగా ఇరాన్‌తోనూ కయ్యం పెట్టుకోవడాన్ని ఇజ్రాయెలీలు తీవ్రంగా తప్పుబట్టారు.

 టెల్‌ అవీవ్‌లో వేలాది మంది ఆందోళనకారులు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. మరోవైపు ఇరాన్‌లో మౌలికసదుపాయాలు దెబ్బతిని గత 48 గంటలుగా ఇంటర్నెట్‌ స్తంభించింది. కేవలం 3 శాతం ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ను పునరుద్ధరించారు. ఇరాన్‌లోని బ్యాంక్‌ సెఫాపై ఇజ్రాయెలీ హ్యాకర్లు సైబర్‌ దాడులు చేశారు. దీంతో ఏటీఎంలు పనిచేయక జనం ఇబ్బందులు పడ్డారు.

ఇరాన్‌కు విదేశీ ఆయుధసాయంపై అమెరికా ఆంక్షలు
ఇరాన్‌ సైనికరంగంపై అమెరికా శుక్రవారం మరికొన్ని ఆంక్షలు విధించింది. ఇరాన్‌ సైన్యం ఉపయోగించే పలు రకాల ఆయుధాల్లో విడిభాగాలు, సాఫ్ట్‌వేర్‌లను సరఫరాచేసే విదేశీ సంస్థలు, వ్యక్తులపై అమెరికా నిషేధం విధించింది. ఆంక్షలు ఎదుర్కొంటున్న వారిలో చైనా కంపెనీ, ఒక సరుకు రవాణా నౌక సంస్థ సైతం ఉన్నాయి. బాలిస్టిక్‌ క్షిపణులు, డ్రోన్లు, బాంబులను విక్రయించే సంస్థలనూ అమెరికా నిషేధిత జాబితాలో చేర్చింది.


మరోదఫా చర్చలకు సిద్ధమన్న యూరప్‌ నేతలు
స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో శుక్రవారం బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్‌ విదేశాంగ మంత్రులతోపాటు యూరోపియన్‌ యూనియన్‌ విదేశీవిధానాల చీఫ్‌తో ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాఘ్చీ చర్చలు జరిపారు. చర్చల్లో ఏఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయో వెల్లడించలేదు. మరోదఫా చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామని, చర్చలు ముగిశాక యూరోపియన్‌ కమిషన్‌ ఉపాధ్యక్షుడు చెప్పారు. మరోవైపు తమ సేనలు ఎక్కడెక్కడ ఉన్నాయనే విషయాలను మీడియా అత్యుత్సాహంతో ప్రసారం చేయొద్దని స్థానిక మీడియాకు ఇజ్రాయెల్‌ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement