టెహ్రాన్: అమెరికా, ఇరాన్ మధ్య మరోసారి మాటల యుద్ధం చోటుచేసుకుంది. తన వల్లే ఇరాన్‌లో నిరసనకారులకు మరణ శిక్షలు ఆగిపోయాని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ కౌంటరిచ్చింది. నిరసనకారులకు సామూహిక మరణ శిక్ష విధించాలనే నిర్ణయమే తమ ప్రభుత్వం తీసుకోలేదని ఓ అధికారి చెప్పుకొచ్చారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ఇరాన్‌లో ఖమేనీ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు నిరసనల్లో పాల్గొన్నారు. వందల మంది నిరసనకారులకు విధించిన ఉరిశిక్ష విధించాలని ఖమేనీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే, అమెరికా ఒత్తిడి వల్ల అక్కడి అధికారులు దాదాపు 800 మందికి మరణ శిక్షను రద్దు చేశారు. అమెరికా కల్పించుకోకపోయి ఉంటే 800 మందికి పైగా ప్రాణాలు కోల్పోయేవారు. వారి ఉరిశిక్షలను నేనే ఆపాను. నేను తీవ్ర చర్యలు తీసుకుంటానని హెచ్చరించడంతో ఇరాన్ పాలకవర్గం వెనక్కి తగ్గింది అంటూ వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు.. ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ న్యాయవ్యవస్థకు చెందిన అధికారి స్పందించారు. ట్రంప్ చెబుతున్నవన్నీ అబద్ధాలే అని క్లారిటీ ఇచ్చారు. నిరసనకారులకు సామూహిక మరణ శిక్ష విధించాలనే నిర్ణయమే తమ ప్రభుత్వం తీసుకోలేదన్నారు. ఎవరికీ ఉరిశిక్షలు విధించలేదని తెలిపారు. అరెస్టు చేసిన వారి సంఖ్య కూడా అంత మొత్తంలో లేదన్నారు. దీనిపై తప్పుడు వార్తలు, ప్రకటనలను ప్రచారం చేయొద్దని అంతర్జాతీయ మీడియా వర్గాలకు సూచించారు.
ఇరాన్‌లో నిరసనలు..
ఇదిలా ఉండగా.. ఇరాన్‌లో ద్రవ్యోల్బణం, అవినీతి తదితర కారణాలతో అక్కడి ప్రజలు ఖమేనీ ప్రభుత్వంపై పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు. ఇస్లామిక్ పాలన అంతంకావాలంటూ ఆందోళనలు చేశారు. మహిళలు సైతం రోడ్లెక్లి హిజాబ్‌లను తొలిగించి చేతిలో సిగరెట్లు పట్టుకొని ఇస్లామిక్ చట్టాలకు వ్యతిరేకంగా నిరనసలు జరుపుతున్నారు. అయితే ఆందోళన కారులపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని అమెరికా రంగంలోకి దిగుతుందని ట్రంప్ హెచ్చరించారు. అయినప్పటికీ ఖమేనీ ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. నిరసన కారులను ఊచకోతకోస్తుంది.
రెండు వేల మందికిపైగా మృతి
ఇరాన్‌లో నిరసనలో పాల్గొన్న వారిలో రెండువేల మందికిపైగా మృతి చెందిన విషయాన్ని ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఇరాన్ అధికారి ఒకరు మరణాల సంఖ్యను వెల్లడించారు. ఇరాన్ పౌరులు చేపట్టిన ఈనిరసనలను ఆ దేశం ఉగ్రవాద చర్యగా అభివర్ణించింది. ఆందోళనలు ఇలానే కొనసాగితే మరణాల సంఖ్య కూడా ఇలానే ఉంటుందని హెచ్చరించింది. ఈ నిరసనల్లో పాల్గొన్న ఉగ్రవాద శక్తులు ప్రభుత్వ భవనాలు, పోలీస్ స్టేషన్లు, వ్యాపారాలు, పౌరులు, భద్రతా దళాలపై కాల్పులు జరిపాయని సదరు అధికారి పేర్కొన్నారు.


