
జకార్తా: ఇజ్రాయెల్ సాగిస్తున్న నిరంతర దాడులకు గాజాలో లెక్కలేనంతమంది క్షతగాత్రులుగామారారు. ఈ నేపధ్యంలో గాజాలోని బాధితులను ఆదుకునేందుకు ఇండోనేషియా ముందుకొచ్చింది. తమ దేశానికి చెందిన జనావాసాలు లేని గలాంగ్ ద్వీపంలో గాజా బాధితుల కోసం వైద్య సౌకర్యాలను ఏర్పాటుచేసింది. ఇక్కడ గాజాలో గాయపడిన రెండు వేల మందికి చికిత్స అందించనున్నారు. వారు కోలుకున్న తర్వాత వారిని ఇంటికి తరలించనున్నారని ఇండోనేషియా ప్రతినిధి తెలిపారు.
2023 అక్టోబర్‌లో ఇజ్రాయెల్ దాడుల అనంతరం ఇండోనేషియా.. గాజాకు మానవతా సహాయం పంపింది. ఇప్పుడు యుద్ధంలో బాధితులైన, గాయపడిన సుమారు రెండు వేల ఇండోనేషియా వైద్య సహాయం అందించనుంది. గాయపడిన గాజా ప్రజలకు చికిత్స అందించేందుకు, వారి కుటుంబసభ్యులకు తాత్కాలికంగా ఆశ్రయం కల్పించేందుకు ఇండోనేషియా సుమత్రా ద్వీపంతోపాటు గలాంగ్ ద్వీపంలో వైద్య సదుపపాయాలను ఏర్పాటు చేస్తోంది. గాయపడిన పాలస్తీనియన్లకు ఆశ్రయం కల్పించేందుకు అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో చేసిన ప్రతిపాదనకు ఇండోనేషియా మతాధికారులు తొలుత వ్యతిరేకించినా తరువాత మద్దతు పలికారు.