ఆస్ట్రేలియా: మత్తు మందు ఇచ్చి మృగవాంఛ తీర్చుకున్నాడు

Indian Origin Balesh Dhankhar Found Guilty In Rape Cases - Sakshi

NRI Crime News: మాయ మాటలు చెప్పి స్నేహం చేశాడు. అబద్దాలతో ఆకట్టుకున్నాడు. డ్రగ్స్‌ ఇచ్చి అచేతన స్థితిలోకి తీసుకెళ్లి.. మరీ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ మృగచేష్టలను తన ఫోన్‌లో బంధించి ఆనందం పొందాడు. ఒకరు కాదు.. ఐదుగురిపై అలా చేశాడు. రాజకీయ నేపథ్యం ఉన్న కారణంగా నేరాల నుంచి బయటపడొచ్చని భావించాడు. కానీ, ఆ కామాంధుడి పాపం పండింది. 

ఆస్ట్రేలియాలో భారత కమ్యూనిటీకి ప్రముఖుడు బాలేష్‌ ధన్కడ్‌ను.. సిడ్నీ డౌనింగ్‌ సెంటర్‌ కోర్టు సోమవారం అత్యాచార కేసుల్లో దోషిగా తేల్చింది. ఐదుగురు కొరియన్‌ యువతులను మభ్య పెట్టి, వాళ్లను మత్తుమందు ఇచ్చి మరీ అత్యాచారం చేశాడని నిర్ధారించింది. రాజకీయ బలం ఉన్న మానవ మృగంగా కోర్టు.. సిడ్నీ చరిత్రలోనే నీచమైన రేపిస్ట్‌గా అక్కడి మీడియా బాలేష్‌ను అభివర్ణించడం గమనార్హం. 

👉బాలేష్‌ ధన్కడ్‌(43) ఓ డేటా ఎక్స్‌పర్ట్‌. అతనికి వ్యతిరేకంగా 39 అభియోగాలు నమోదు అయ్యాయి. యువతులతో స్నేహం నటించి.. వాళ్లకు ఇంటికి, హోటల్స్‌కు తీసుకెళ్లి డ్రగ్స్‌ ఇచ్చి ఆపై అకృత్యాలకు పాల్పడే వాడు. లైంగిక దాడుల్ని తన ఫోన్‌తో పాటు అలారం క్లాక్‌లో దాచిన సీక్రెట్‌ కెమెరాలోనూ బంధించినట్లు తెలుస్తోంది. 

👉జడ్జి మైకేల్‌ కింగ్‌ బెయిల్‌కు నిరాకరించడంతో బాలేష్‌ కోర్టులోనే కన్నీటి పర్యంతం అయ్యాడు. అక్కడే అతని భార్య సైతం కన్నీళ్లు పెట్టుకుంది. బాలేష్‌ మళ్లీ మే నెలలో కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ ఏడాదిలోనే అతని శిక్షలు ఖరారు అవుతాయి కూడా.    

👉ఇదిలా ఉంటే బాలేష్‌.. బీజేపీ మాజీ సభ్యుడు. ఓవర్సీస్‌ ఫ్రెండ్స్‌ ఆఫ్‌ ది బీజేపీకి గతంలో చీఫ్‌గా పని చేశాడు. ప్రధాని మోదీని సైతం కలిసిన పలు ఫొటోలు వైరల్‌ అయ్యాయి కూడా.

👉తన వైవాహిక జీవితం అస్తవ్యస్తం కావడంతోనే తాను అబద్ధాలతో యువతులను ఆకట్టుకున్నానని బాలేష్‌ అంటున్నాడు. అంతేకాదు.. కోర్టు, లాయర్‌ ఫీజుల కోసం ఆస్తులను అమ్ముకున్నట్లు వెల్లడించాడు.

👉2018లోనే బాలేష్‌ ధన్కడ్‌ కీచక పర్వం వెలుగు చూసింది. ఇతర మహిళలతో సన్నిహితంగా ఉన్న డజనుకుపైగా వీడియోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతని మృగచేష్టలతో కూడిన ఆ వీడియోల్ని చూసి జ్యూరీ సైతం ఉలిక్కిపడింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top